కృష్ణుడు మరోసారి చెప్పిన గీత

కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. దాన్ని మళ్లీ వినాలనుకున్న అర్జునుడు మరోసారి బోధించమని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిందే అనుగీత. ఇది మహాభారతం అశ్వమేధిక పర్వంలో ఉంది.

Published : 15 Sep 2022 00:43 IST

కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. దాన్ని మళ్లీ వినాలనుకున్న అర్జునుడు మరోసారి బోధించమని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చెప్పిందే అనుగీత. ఇది మహాభారతం అశ్వమేధిక పర్వంలో ఉంది. అనుగీత ప్రధానంగా ఉన్నందువల్లే అశ్వమేధిక పర్వానికి అనుగీతా పర్వం అనే పేరొచ్చింది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు రాజ్యాధికారాన్ని చేబట్టి దిగ్విజయంగా అశ్వమేధయాగం చేసిన శ్రీకృష్ణుడు ద్వారకకు బయల్దేరాడు. తన అవతార పరిసమాప్తి కానున్నదని గ్రహించి తాను ద్వారకకు వెళ్లదలచినట్లు చెప్పాడు. అప్పుడు అర్జునుడు ‘పూర్వం నన్ను కర్తవ్యోన్ముఖుని చేస్తూ జ్ఞానం ఉపదేశించావు. కానీ, అదిప్పుడు జ్ఞాపకం లేదు కనుక మరోసారి వినాలనుకుంటున్నాను’ అన్నాడు. కృష్ణుడు చిన్నగా నవ్వి ‘అర్జునా! ఆ సమయంలో నేను యోగయుక్తుడినై ఉండి జ్ఞానమంతటినీ బోధించగలిగాను. ప్రస్తుతం ఆ స్థితి లేనందున పూర్తిగా బోధించలేకున్నా.. కొంత ప్రయత్నిస్తాను. కొన్ని ఇతిహాసాల రూపంలో పరోక్షంగా చెబుతాను’ అని బ్రాహ్మణ సిద్ధ కాశ్యప సంవాదం, బ్రాహ్మణ గీత, గురుశిష్య సంవాదం, బ్రహ్మదేవ మహర్షి సంవాదం... తదితరాలను వివరించాడు. మోక్షపద ప్రాప్తిని గురించిన వివరణ ఇందులో ఉంది. ఇదంతా వేదాంత విద్య. యుద్ధ సమయంలో బోధించిన అమృతపద ప్రాప్తి హేతువైన విజ్ఞానాన్ని తిరిగి బోధించిన గీత ఇది.

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని