కనకదుర్గకు ఆ పేరెలా వచ్చింది?

విష్ణుకుండినరాజు మాధవవర్మ బెజవాడని పాలించేవాడు. ఆయనకు లేకలేక కుమారుడు కలిగాడు. అతడు కూడా తండ్రిలాగా ధర్మాత్ముడూ, పరాక్రమవంతుడు కావడంతో ప్రజలెంతో అభిమానించేవారు. అందరూ ఆనందంగా ఉండగా పరదేశీయుడు రాజుగారికి...

Updated : 22 Sep 2022 00:38 IST

సెప్టెంబర్‌ 26 నుంచి శరన్నవ రాత్రులు ఆరంభం

విష్ణుకుండినరాజు మాధవవర్మ బెజవాడని పాలించేవాడు. ఆయనకు లేకలేక కుమారుడు కలిగాడు. అతడు కూడా తండ్రిలాగా ధర్మాత్ముడూ, పరాక్రమవంతుడు కావడంతో ప్రజలెంతో అభిమానించేవారు. అందరూ ఆనందంగా ఉండగా పరదేశీయుడు రాజుగారికి గుర్రాన్ని బహూకరిస్తూ ‘ఇది చాలా బలమైంది, పొగరుబోతుది. దీన్ని స్వాధీనం చేసుకోవటం మహా కష్టం. వీరులు మాత్రమే స్వారీ చేయ గలరు’ అన్నాడు. పౌరుషం ఉన్నవారికి ఆ మాటలు అవమాన కరంగా అనిపించటం సహజం. రాకుమారుడు ఆ గుర్రాన్ని రథానికి పూన్చి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ‘పెంకిగుర్రం కట్టిన రథం వస్తోంది, జాగ్రత్త.. తప్పుకోండి’ అంటూ రాజ భటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీస్తున్నారు. అందరూ తొలగారు. కానీ ఆటల్లో మునిగిన ఒక బాలుడికి ఆ మాటలు వినిపించ లేదు. గుర్రం ఇష్టారాజ్యంగా పోతోంది. రాకుమారుడు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. బాలుడు రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాలుణ్ణి చేతుల మీద మోసుకుని రాజాస్థానానికి వచ్చింది తల్లి. రాజులు భోగభాగ్యాలు అనుభవించాలే కానీ ఇలా ప్రాణాలు తీయకూడదని, తనకు న్యాయం చేయమని ఏడుస్తూ చెప్పుకుంది. మాధవవర్మ న్యాయాధికారులని ఈ నేరానికి తగిన శిక్ష చెప్పమని కోరాడు. వారంతా ఆలోచించి, చర్చించి ‘న్యాయప్రకారమైతే మరణశిక్ష విధించాలి. కానీ చేసింది రాకుమారుడు, కాబోయే రాజు. పైగా ఎప్పుడూ ఏ తప్పూ చేయని ధర్మాత్ముడు. ఈ తప్పు కావాలని చేయలేదు. తప్పించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. కనుక శిక్షని తగ్గించవచ్చు’ అన్నారు. మాధవవర్మ ఒప్పుకోలేదు. ‘న్యాయం ఎవరికైనా ఒకటే’ అంటూ మరణశిక్ష విధించమని చెప్పి సింహాసనం దిగి తండ్రిగా భోరున విలపించాడు. అదేరోజు శిక్ష అమలుజరిగింది. మాధవవర్మ ధర్మనిష్ఠకి సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు చనిపోయిన బాలుణ్ణి, ఇటు రాకుమారుణ్ణి బతికించడమే కాకుండా రెండు గడియలపాటు కనకవర్షం కురిపించింది. అప్పటి నుంచి ఆ తల్లి కనకదుర్గగా ప్రఖ్యాతి పొందింది. (ఇది యదార్థంగా జరిగినట్లు చెప్పే శాసనాలున్నాయి)

- డాక్టర్‌ అనంతలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని