బతుకమ్మ పర్వదినం సాంస్కృతిక సంబురం

ప్రకృతిలోని చెట్టూచేమా, రాయీరప్పా, పువ్వూ మొగ్గా... ఇలా అన్నింటినీ పూజించటం హైందవ సంప్రదాయం. కాలానుగుణంగా మారే రుతువులను అనుసరించి పండుగలు చేసుకుంటాం. అలా ఏర్పడిందే తెలంగాణ ప్రాంతం అంతటా స్త్రీలు ఆనందోత్సాహాలతో ఆడిపాడే బతుకమ్మ పండుగ.

Published : 22 Sep 2022 00:56 IST

సెప్టెంబర్‌ 25 బతుకమ్మ పండుగ ప్రారంభం

ప్రకృతిలోని చెట్టూచేమా, రాయీరప్పా, పువ్వూ మొగ్గా... ఇలా అన్నింటినీ పూజించటం హైందవ సంప్రదాయం. కాలానుగుణంగా మారే రుతువులను అనుసరించి పండుగలు చేసుకుంటాం. అలా ఏర్పడిందే తెలంగాణ ప్రాంతం అంతటా స్త్రీలు ఆనందోత్సాహాలతో ఆడిపాడే బతుకమ్మ పండుగ.

ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ స్త్రీలకి మహా ఇష్టమైంది. బంధుమిత్రులతో కలిసి కోలాహలంగా ఆడిపాడతారు. మహాలయ అమావాస్య మొదలు ఆశ్వయుజ మహా నవమి వరకు రకరకాల పూలతో బతుకమ్మను అలంకరించి అమ్మవారిగా కొలిచి ఆరాధించడమే ఈ పండుగ ప్రత్యేకత. పండుగ తొమ్మిది రోజులుా వీధులన్నీ కళకళలాడతాయి. బంతి, చామంతి, తంగేడు, రుద్రాక్ష, సీతమ్మ జడ మొదలైన పువ్వులను గుండ్రంగా పేర్చి వాటిపై పసుపు ముద్దను అమర్చి గౌరమ్మగా భావిస్తారు. ఆ అమ్మను భక్తితో కొలుస్తారు. ‘ఒక్కొక్క పువ్వేసి ఉయ్యాలో..’ అంటూ వన్నెవన్నెల వస్త్రాలు ధరించి ముచ్చటగా ముస్తాబైన ఆడపడుచులు అందంగా అలంకరించిన పూల దొంతరల చుట్టూ చేరి లయబద్ధంగా పాటలు పాడుతూ ఆడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ.. ఇలా తొమ్మిది రోజులు సాగే బతుకమ్మలను చెరువులు, బావులు, నదీ ప్రవాహాల్లో నిమజ్జనం చేస్తారు.

పాటల్లో ప్రతిఫలించే జీవితం

ప్రతిరోజుా పూలతో బతుకమ్మని పేరుస్తూ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ ‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాముా లాయె చందమామా..’, ‘కోసలా దేశం నుంచి ఉయ్యాలో.. దశరథ రాముడూ ఉయ్యాలో..’, ‘చిత్తూ చిత్తూల బొమ్మా.. శివుడూ ముద్దుల గుమ్మా..’ వంటి పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం ఆప్యాయత, చరిత్ర, పురాణాలు వంటి అనేక విషయాలు మేళవిస్తారు.

ప్రచారంలో ఉన్న పండుగ కథలు

బతుకమ్మ పండుగకు సంబంధించి ఎన్నో కథలు వినిపిస్తుంటాయి. విస్తృత ప్రచారంలో ఉన్న కథ ప్రకారం... ఒక రాజ్యంలో వీరులైన ఏడుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క ముద్దుల చెల్లెలు. ఆమెను వదినలు ఆరళ్లు పెట్టి విషమిచ్చి చంపి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. అలా పూడ్చిన చోట తంగేడు చెట్టు విరగబూసింది. ఆమె కోసం సోదరులు వెతుకుతూ ఆ తంగేడు చెట్టు వద్దకు వచ్చి ఆగారు. అప్పుడా చెట్టు జరిగిన విషయమంతా వారితో చెప్పింది. ఆ మాటలు విన్న సోదరులు చెట్టు రూపంలో ఉన్న చెల్లెల్ని ఏం కావాలో కోరుకోమన్నారు. అప్పుడామె తంగేడు పూలలో తనను చూసుకోమంది. ఏటా తన పేరున పండుగ చేయమని కోరింది.

మరో కథను అనుసరించి... ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్యకు పూనుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను ‘కలకాలం బతుకమ్మా’ అంటూ గ్రామ స్త్రీలు దీవించారు. అప్పటినుండి బతుకమ్మ పేరుతో పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. అప్పట్లో తెలంగాణ గ్రామాల్లోని మహిళలు నవాబులు, భూస్వాముల చేతుల్లో నలిగిపోయేవారు. అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయేవారు. అలాంటివారి మీద సానుభూతి చూపుతూ తోటి మహిళలు వారికి ప్రతీకగా పూలను పేర్చి ‘బతుకవమ్మా..., బతుకమ్మా...’ అంటూ పాటలు పాడేవారట. బతుకమ్మ పాటల వెనుక ఆంతర్యం అదేనని చెబుతారు. దసరా నవరాత్రుల సమయంలో పూజించే అమ్మవారి స్వరూపం ఒకటైతే, బతుకమ్మ పండుగలో మాత్రం ప్రకృతిలో మమేకమయ్యే పూల రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. కానీ రెండింటిలోని ప్రాణశక్తి ఒకటే. పురాణాల్లోని దుర్గామాతయే బతుకమ్మ అంటూ చెప్పే కథలూ ఉన్నాయి. మహిషాసురునితో తలపడి అలసిన దుర్గామాతకు తోటి నెచ్చెలులు పాటలు పాడుతూ సపర్యలు చేశారు. అలా అమ్మవారు అక్కడ కొంతసేపు సేదతీరి, ఆనక మహిషాసురుణ్ణి సంహరించింది. అందుకే బతుకునిచ్చిన అమ్మ అంటూ దుర్గమ్మను బతుకమ్మగా ఆరాధిస్తున్నారనేది ఒక నమ్మకం.

పండుగ విశిష్టత

మొదటి రోజు బతుకమ్మను అలంకరించేందుకు ముందు రోజే పూలను కోసుకొస్తారు. అవి వాడకుండా నీళ్లలో వేసి మర్నాడు బతుకమ్మగా పేరుస్తారు. ఈ బతుకమ్మను ఎంగిలి బతుకమ్మగా కొలుస్తూ తమలపాకులు, తులసి ఆకులను వాయనంగా ఇస్తారు.

రెండో రోజు తంగేడు, గునుగు, బంతి, గడ్డి పూలను సేకరించి గౌరమ్మను పేర్చి సాయంత్రం వేళల్లో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేస్తారు. ప్రసాదంగా అటుకులు పంచుతారు. ఇక మూడోరోజు సీతమ్మ జడ, చామంతి, రామబాణం వంటి పూలతో బతుకమ్మను పేర్చి ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తూ బెల్లం, సత్తుపిండి, చక్కెర, పెసలు వాయనంగా ఇస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మగా గుమ్మడి, మందార పూలతో బతుకమ్మను పేర్చి నానబెట్టిన బియ్యం, బెల్లంతో కలిపి వాయనంగా ఇస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మగా, ఆరో రోజు అలిగిన బతుకమ్మగా, ఏడో రోజు   వేపకాయల బతుకమ్మగా, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా అమ్మవారిని కొలుస్తారు. ఇక చివరిగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఆడపడుచులంతా చేరి ఉత్సాహంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో ఆ తల్లిని మురిపించి నిమజ్జనం చేస్తారు. ఆనాటితో పండుగ ముగుస్తుంది.

పరస్పర ఆత్మీయత, మాటలకందని సృజనాత్మకత ప్రతిఫలించే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఆడపడుచుల ఆనందాలు అంబరాన్నంటే విధంగా ఆడిపాడే ఈ తొమ్మిది రోజుల పర్వదినం సాంస్కృతిక సంబురం.

- ఉషా కామేష్‌ డొక్కా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని