తిరువీధుల మెరసీ దేవదేవుడు

శ్రీనివాసుని నిత్యోత్సవం సకల జనులకు నేత్రోత్సవం. శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవం సమస్త లోకాలకు దివ్యోత్సవం. నిత్యసేవల్లో స్వామి ఆనంద నిలయాన ఆరాధనలు అందుకుంటే, బ్రహ్మోత్సవాల్లో శ్రీనిలయుడు పురవీధుల్లో పూజలందుకుంటాడు.

Published : 22 Sep 2022 01:03 IST

సెప్టెంబరు 27 - అక్టోబరు 5 తిరుమల  బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసుని నిత్యోత్సవం సకల జనులకు నేత్రోత్సవం. శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవం సమస్త లోకాలకు దివ్యోత్సవం. నిత్యసేవల్లో స్వామి ఆనంద నిలయాన ఆరాధనలు అందుకుంటే, బ్రహ్మోత్సవాల్లో శ్రీనిలయుడు పురవీధుల్లో పూజలందుకుంటాడు. నిత్యసేవల్ని తిలకించి తరించే భాగ్యంలేని భక్తజనుల మనోరథాన్ని, ఆ బ్రహ్మాండనాయకుడు మహారథాన్ని అధిష్టించి బ్రహ్మోత్సవ రూపంలో తీరుస్తాడు.

లంకరణలైనా, ఆడంబరాలైనా ఆ దేవదేవుడికే చెల్లుతాయని, ఏ వేడుకలైనా ఆ మంగళస్వరూపుడి వైభవం ముందు దిగదుడుపేనని బ్రహ్మోత్సవాలు తేటతెల్లం చేస్తాయి. ఆ విశ్వరూపుడి ఎదుట మనమెంత స్వల్పాతిస్వల్పమో నిరూపిస్తాయి. ఆ మహోత్సవాల్లో అన్ని వాహనాలపై అంత వైభవంగా ఊరేగుతున్న మహామూర్తిని చూశాక, మన అహంకారం, ఆభిజాత్యం తొలగిపోవాలి. అదే బ్రహ్మోత్సవాల దర్శన పరమార్థం. పాపప్రక్షాళన బాధ్యతను సమర్థంగా నిర్వహించే శేషాద్రినిలయుడికి ఈ సందర్భంగా జరిగే విశిష్టపూజల ప్రభావంతో ప్రకృతిలో, జీవుల్లో అనంతశక్తి తిరిగి పుంజుకుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బ్రహ్మోత్సవాలను మహోత్సవం, తిరునాళ్‌, కల్యాణోత్సవం పేర్లతోనూ పిలవడం ఆనవాయితీ. శ్రీనివాసుడి ఈ వేడుకల ప్రస్తావన వరాహ, భవిష్యోత్తర, బ్రహ్మాండ, మార్కండేయ, వామన తదితర పురాణాల్లోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం తిరుమలలో ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు దాదాపుగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించిన రీతిలో జరుగుతున్నాయి. క్రీ.శ.1561 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల్ని చేర్చారు. తొలుత ఈ పవిత్ర ఉత్సవాలు సాక్షాత్తూ బ్రహ్మదేవుడు తిరుమలకు వేంచేసి, శ్రీవేంకటాచలపతికి జరిపాడనేది పురాణ కథనం. ఆ చతుర్ముఖ బ్రహ్మ శ్రీనివాసుడి ఆజ్ఞ మేరకు చతుర్వేదాలకు ప్రతీకగా ఉత్సవ శ్రీనివాసమూర్తి, ఉగ్రశ్రీనివాసమూర్తి, సర్వాధిప శ్రీనివాసమూర్తి, లేఖక శ్రీనివాసమూర్తి- అనే నాలుగు విధాలైన వేంకటేశ్వరుడి అర్చామూర్తులను ఆనందనిలయంలో చల ప్రతిష్ఠ చేశారని చెబుతారు. ఇందులో ఉత్సవ శ్రీనివాసమూర్తి బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో భక్తావళికి దర్శనభాగ్యాన్ని కల్పిస్తాడు.

అంకురార్పణ

తిరుమలలో ఏడుకొండలవాడికి బ్రహ్మోత్సవం వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం జరుగుతుంది. ఉత్సవాల ఆరంభానికి ముందు రోజు రాత్రి తిరుమల ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి పూజారులు, భక్తులు మేళతాళాలతో చేరుకుంటారు. ఆ పుణ్యస్థలి నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి తిరిగొస్తారు. యాగశాలలో ఈ మట్టిని నింపిన తొమ్మిది పాలికల్లో అంటే కుండల్లో నవధాన్యాలను మొలకెత్తిస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రుణ్ణి అధిపతిగా భావిస్తారు. శుక్లపక్ష చంద్రుడిలా మొలకలు దినదినాభివృద్ధి చెందాలని, పుడమి సస్యశ్యామలమై ఆహార ధాన్యాల కొరత లేకుండా వర్ధిల్లాలని ప్రార్థిస్తారు. అంకురాలను అర్పణ చేసే ఈ కార్యక్రమాన్నే అంకురార్పణ అంటారు. అలా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టాక ఆ భాగవతప్రియుడు తిరువీధుల్లోకి వేంచేస్తాడు.

దేవతలకూ ఆహ్వానం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడకేతనాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి దేవతలను ఆహ్వానించటం సంప్రదాయం. మహావిష్ణువు వాహనం గరుడుడు. అంతేకాకుండా వైనతేయశ్చ పక్షిణామ్‌.. పక్షుల్లో నేను గరుత్మంతుణ్ణి- అన్నాడు గీతలో కృష్ణభగవానుడు. గరుడ ధ్వజపటం లేదా గరుడపతాకం సకల దేవతలు, అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వానపత్రం. ఈ ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ ఆ తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా వేంకటేశ్వరుడికి తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చే గోదాదేవి మాలల్ని అలంకరిస్తారు.

అన్నమయ్య కీర్తనల్లో ఆ అద్భుత ఉత్సవాలు

ఆనందనిలయంలో సేవల్నే కాదు, ఆరుబయట ఆ శ్రీవిభునికి సాగే సంబరాలనూ శోభాయమానంగా జరిపిన అసామాన్య భక్తుడు అన్నమాచార్య. అక్కడితో ఆగిపోకుండా నిత్యసేవలకు, ఉత్సవ సేవలకు సంబం ధించిన కీర్తనల్ని కూడా  ఉత్సాహ భరితుడై రచించాడు. భక్తసులభుడి బ్రహ్మోత్సవాలకు తన భక్తిగీతాలతో మరింత వైభవాన్ని కల్పించిన పదకవితా పితామహుడు ఉత్సవమూర్తిలో నిజమూర్తినే దర్శించాడు. ఆ బ్రహ్మోత్సవ వైభవాన్ని పాటల రూపంలో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. అలా పల్లవించినవే ‘తిరువీధుల మెరసీ దేవదేవుడు...’, ‘వీధుల వీధుల విభుడేగీనిదె!...’, ‘తిరువీధు  లేగీని దేవతల జయవెట్ట...’, ‘నానా దిక్కుల నరులెల్లా వానలలోననె వత్తురు కదలి...’  తదితర కీర్తనలు. అన్నమయ్య పరవశుడై రచించిన ఈ పదాల్ని ఆలపించినా, ఆలకించినా మనసు తిరుమల వీధుల్లో విహరిస్తుంది. ఆ మహోత్సవాలను వీక్షించి పులకిస్తుంది.

వాహనసేవలు మొదటిరోజు పగలు ధ్వజారోహణంతో ఆరంభించి, ఆ రాత్రి శ్రీవారిని పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. రెండోరోజు పగలు చిన్న శేష వాహనంపై, రాత్రి హంసవాహనంపై, మూడోరోజు పగలు సింహ వాహనంపై, రాత్రి ముత్యాలపందిరి వాహనంపై, నాలుగోరోజు పగలు కల్పవృక్ష వాహనంపై, రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామిని ఊరేగిస్తారు. అయిదోరోజు ఉదయం మోహినీ అవతారంలో, రాత్రి గరుడ వాహనంపై ఊరేగిస్తారు. ఆరోరోజు పగలు హనుమద్వాహనంపై, రాత్రి గజవాహనంపై, ఏడోరోజు పగలు శతకోటిప్రభలతో సూర్యవాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తాడు. ఎనిమిదోనాడు పగలు స్వామి రథారూఢుడై తన వైభవాన్ని ప్రకటిస్తాడు. ఆ రాత్రి అశ్వవాహనాన్ని అధిరోహిస్తాడు. చివరి రోజున అంటే తొమ్మిదో రోజున పల్లకీపై వడ్డికాసులవాడు తిరువీధుల్లో మెరిసిపోతాడు. అనంతరం స్వామికి పుష్కరిణిలో అవబృథ స్నానం ఆచరింప చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో అంతిమ ఘట్టంగా పదోనాడు ఆ పావనమూర్తికి పుష్పయాగోత్సవం, వివాహ మహోత్సవం నిర్వహిస్తారు. అలా అలమేల్మంగతో కలిసి చూసేవారికి చూడముచ్చటగా, పుణ్యమూర్తులకు ధన్యభాగ్యంగా ధరణీ నాయకుడు దర్శనమిస్తాడు.

- బి.సైదులు


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని