ధర్మాచరణ బోధించిన నహుష గీత

మహాబలశాలి భీముణ్ణి ఒకసారి నహుషుడనే కొండచిలువ పట్టింది. భీముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజును నహుషుడు కొన్ని ధర్మ సంబంధ ప్రశ్నలడిగాడు. అదే అజగరోపాఖ్యానం. పదివేల ఏనుగుల బలం ఉన్న భీముణ్ణి బంధించేంత...

Updated : 29 Sep 2022 04:45 IST

హాబలశాలి భీముణ్ణి ఒకసారి నహుషుడనే కొండచిలువ పట్టింది. భీముణ్ణి వెతుక్కుంటూ వచ్చిన ధర్మరాజును నహుషుడు కొన్ని ధర్మ సంబంధ ప్రశ్నలడిగాడు. అదే అజగరోపాఖ్యానం. పదివేల ఏనుగుల బలం ఉన్న భీముణ్ణి బంధించేంత అద్భుతశక్తి నీకెలా వచ్చిందని అడిగాడు ధర్మరాజు. అప్పుడా సర్పం పూర్వజన్మ జ్ఞానంతో మనిషిలా మాట్లాడింది. ముందుగా ధర్మరాజు- దేహాభిమానం లేనివాళ్లకి ఎటువంటి స్థితి కలుగుతుంది? వాటి ఫలితాలు ఎలా ఉంటాయో వివరించమన్నాడు. దానికి నహుషుడు ‘వారి వారి కర్మలననుసరించి జీవులకు మూడు రకాల గతులు కలుగుతాయి. మొదటిది స్వర్గప్రాప్తి, రెండోది మనిషిజన్మ, మూడోది పశుపక్ష్యాది రూపంలో పుట్టడం. ఓ రకంగా అదే నరకం’ అన్నాడు. ధర్మరాజు స్వర్గం ఎలా ప్రాప్తిస్తుందని అడగ్గా నహుషుడు ‘ధర్మరాజా! మనిషిగా జన్మించినవాడు సోమరితనం వదిలిపెట్టాలి. అహింసను పాటించాలి. దానాది పుణ్యకార్యాలు చేయాలి. అప్పుడు స్వర్గం ప్రాప్తిస్తుంది. లేదంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది అరిషడ్వర్గాలకు దాసుడవుతాడు. హింసను అవలంభిస్తాడు. వివేకభ్రష్టుడై మానవత్వాన్ని కోల్పోతాడు. మరు జన్మలో పశుపక్ష్యాది జన్మలెత్తుతాడు. నిష్కాములకు జన్మరాహిత్యం ప్రాప్తిస్తుంది’ అంటూ వివరించాడు. ఆనక నహుషుడు తన సందేహాలను వెలిబుచ్చగా ఇంద్రియనిగ్రహం, తపస్సు, దానం, అహింస, ధర్మ పరాయణత్వం అనే సద్గుణాలు మనిషిని మహనీయుడిగా చేస్తాయంటూ వివరించాడు. సిద్ధిని కలుగజేసేది అవేనని.. జాతి, కులం ముఖ్యం కాదని చెప్పాడు. ధర్మరాజు మాటలకు నహుషుడు ఆనందించి భీముణ్ణి బంధవిముక్తుణ్ణి చేశాడు. అప్పుడు నహుషుడికి కూడా శాపవిమోచనమైంది. తర్వాత ధర్మరాజుకు మరిన్ని ఆధ్యాత్మిక అంశాలను బోధించి అంతర్థానమయ్యాడు. ఇలా సర్పరూపంలో ఉన్న నహుష, ధర్మజుల మధ్య జరిగిన ధర్మ సందేహ చర్చే నహుషగీత. ఆధ్యాత్మిక విద్యాబోధినిగా ప్రసిద్ధికెక్కిన ఈ గీత మహాభారతం అరణ్యపర్వంలో ఉంది.

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని