Updated : 05 Oct 2022 00:15 IST

దుర్గాసూక్తం విశ్వశ్రేయం

నేడు విజయదశమి

దసరా అంటేనే సందడి, సంతోషం. పది రోజుల పాటు పరమ పావనంగా జరుపుకునే పండుగ. అమ్మవారిని రోజుకో రీతిన అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తాం. చివరి మూడురోజులైన దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి మరింత విశిష్టం. అమ్మవారి అనంత తత్వాన్ని కీర్తించిన దుర్గాసూక్తం దేవికి సమర్పించిన అక్షరమాల.

దుర్గమ్మ శక్తి అపారం. కరుణ అనంతం. పిలిస్తే పలుకుతుంది. వెన్నంటి నడిపిస్తుంది. దుష్టుల్ని శిక్షిస్తుంది, శిష్టుల్ని రక్షిస్తుంది. ఆమె నామాన్ని స్మరిస్తే చాలు అనుగ్రహిస్తుంది. ఆనందమయ జీవనాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానదీప్తులను వెలిగించి, చెడును భస్మంచేసే అమ్మను దీపారాధనతో ఆహ్వానించాలి. అంటే శక్తిజనక మైన అగ్ని ప్రజ్వలనం. అందుకే మాత శక్తిదేవతే కాదు, దీపారాధన సంప్రదాయానికి తెరతీసిన దైవం కూడా.

దుర్గాదేవి విశ్వ దేవత!

దుర్గాదేవి విశ్వవ్యాప్త దేవత. మనం అమ్మవారిని జగజ్జననిగా అర్చిస్తే.. గ్రీకులు హెకటే లేదా త్రియొడిటీస్‌ను శక్తిగా ఆరాధిస్తారు. చంద్రుడితో బంధుత్వం ఉందంటూ ప్రతి పౌర్ణమికీ దీపపూజలు చేస్తారు. 3 ముఖాలు, 6 చేతులతో దుర్గామాతను తలపిస్తుందీ దేవత. 3 జతల కళ్లు ఉన్నందున త్రికాల దేవత అన్నారు. 3 దారులు కలిసే కూడలిలో ఈ దేవతావిగ్రహాన్ని ఉంచి పూజిస్తారు. అలా దుర్గ సర్వమత హితైషిణిగా విశ్వవ్యాప్త పూజలు అందుకుంటోంది.
మనోమాలిన్యాలను తొలగించే మహాశక్తి దేవత దుర్గామాత. దేవీ స్తోత్రాల్లో తైత్తరీయ అరణ్యకం సప్త రుక్కుల్లో చెప్పిన ‘దుర్గాసూక్తం’ విలక్షణమైంది, విశిష్టమైంది.

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః
స నః పర్‌షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః  

దుర్గాసూక్తంలో ‘జాతవేదసే’, ‘అగ్ని’ పదాలు 9 సార్లు పునరావృతమవడం నవరాత్రులు, నవ దుర్గలు, అమ్మవారు సంహరించిన 9 మంది రాక్షసులు, శ్రీచక్ర నవావరణ పూజకు సంకేతాలు.

కాపాడే దుర్గమ్మ

పృతనా జిత్‌గ్మ్‌ సహ మనముగ్రమగ్నిగ్మ్‌ హువేమ పరమాథ్‌ సధస్థాత్‌
స నః పర్‌షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితాత్యగ్నిః   

మన కష్టాలన్నీ గతజన్మల కర్మఫలాలే. దుఃఖం, స్వార్థం, కోపం, ద్వేషం లాంటివన్నీ భీకర కెరటాలై పురోగతికి అడ్డుపడతాయి. ఆ అవలక్షణాలు మనలో ప్రవేశించకుండా దుర్గాదేవి కోటగోడలా అడ్డు నిలిచి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తుంది. అప్పుడు సంసార జంజాటం నుంచి విడివడతాం.  

తామగ్ని వర్ణాం తపసా జ్వలంతీం వైరోచనిం కర్మఫలేషు జుష్టామ్‌
దుర్గామ్‌ దేవీగ్మ్‌ శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః 

‘సమస్యల సంసార సాగరాన్ని దాటించేది నువ్వే! నిన్నే ఆశ్రయించాను. అగ్నిలా వెలిగే దుర్గామాతా! నా దుష్కర్మ ఫలాలను, నాలో ఉన్న అహంకారాన్ని భస్మం చేయమ్మా’ అని దుర్గాదేవిని వేడుకోవడం ఇక్కడ కనిపిస్తోంది. దుర్గమ్మ చెడును దగ్ధంచేసే అగ్నిరూపం కనుక దేవి ఆరాధనలో దీపం ముఖ్యమన్నారు.

అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్‌ స్వస్తిభిరితి దుర్గాణి విశ్వాః
పుశ్చ పృథ్వీ బహుళా న ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః 

అహంకారమనే అగ్నిని విశిష్ట దుర్గాగ్నిలో కలిపేయమని, భవసాగరాన్ని దాటించమని, వివక్ష లేకుండా విశ్వమంతటికీ శాంతి, క్షేమం చేకూర్చమనీ ప్రార్థించారు.

విశ్వాని నో దుర్గహ జాతవేదః సింధున్న నావా దురితాతి పర్‌షి
అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనామ్‌ 

‘లోక భ్రాంతులను అధిగమించే శక్తినివ్వు తల్లీ! పాప కర్మలను దహించు. అసూయ లేని అనసూయా దేవిని పెళ్లాడిన అత్రి మహర్షి ధ్యాన స్థాయిని మాకు ప్రసాదించి స్వార్థమనే చెర నుంచి మమ్మల్ని విడిపించు. సాధారణ మానసిక స్థాయి నుంచి మహిమాన్విత స్థితికి చేర్చు’ అనేది దీని భావన.

నేను, నాది అనే ద్వంద్వ భావన ఆధ్యాత్మిక మార్గంలో పెద్ద అడ్డంకి. ఉన్నది ఒక్కరే అనే భావన రావాలంటే దుర్గారాధనే ఉత్తమ మార్గం.

ప్రత్నోషి కమిడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభాగమాయ జస్వ 

యావత్‌ సృష్టి రహస్యమంతా ఈ రుక్కుల్లో నిక్షిప్తం చేశారు అత్రి మహర్షి. నేను, నాది, మనది, అందరిదీ- అనే భావాన్ని ఆధ్యాత్మిక భాషలో వ్యష్టి, సమష్టి, సృష్టి, పరమేష్టి అంటారు. నేను అంటే వ్యష్టి లేదా ఒంటరి. పెళ్లితో భార్యను పొంది సమష్టి అవుతాడు. ఇద్దరూ కలిసి సృష్టి చేస్తారు. అదే మనం. కాలక్రమంలో తమను నడుపుతున్న పరమేష్టి అందరిదీ అని గ్రహిస్తారు. భ్రాంతిమయ ప్రపంచంతో మన అనుబంధం శరీరానికే పరిమితమై, సర్వం మాతేనన్న భావనకు రావాలి.

ఈ దుర్గాసూక్తం అన్ని మతాలనూ ఒక్కటిగా చూసే విశ్వశ్రేయం. రాక్షస ఆలోచనలను చంపేయడమే ఇందులో ఉన్న అసలైన సందేశం. ఇదీ రుక్కుల సారం.

ప్రతి మహిళా దుర్గామాత అంశే

దుర్గ పదానికి లోతైనదని అర్థం. స్త్రీ హృదయం కూడా ఎంతో లోతైనది, భావోద్వేగాలను హృదయంలోనే దాచుకుని ప్రేమ, కరుణ, క్షమ చూపిస్తుంది. ఈ సుగుణాలతోనే సృష్టి సజావుగా సాగేది. అందుకే ప్రతి మహిళా దుర్గా స్వరూపమే, ఆ దేవి అంశేనన్నారు.

- డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు