Published : 13 Oct 2022 00:39 IST

ఆహారం... అంతర్యోగం

ఆహారం భౌతిక పుష్టికే కాదు, మానసిక స్థితిగతులకూ మూలం. శాంతం, సౌఖ్యం, కోపం, విసుగు, శారీరక రుగ్మతలూ, మానసిక చాంచల్యాలూ... అన్నీ మనం తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటాయి. మహర్షుల దగ్గర నుంచి మహాత్మాగాంధీ వరకూ ఎందరో బోధించిన సత్యమిది.

గాంధీజీ కారాగారవాసం చేస్తున్న రోజులవి. నియమితవేళల్లో భోజనాదులు యథావిధిగా సమకూరుస్తున్నారు. సబర్మతి ఆశ్రమంలో మాదిరి పూర్తిగా సాత్త్వికాహారం లేకున్నా వడ్డించిన పదార్థాలతో సర్దుకుపోతూ రచనా వ్యాసంగంలో మునిగిపోయారు గాంధీజీ. నాలుగు రోజులిలా గడిచాక, తన ఆలోచనల్లో మార్పు వస్తున్నట్లు అనిపించింది. ఏదో అసహనం, ఉద్రేకం ఉబికి వస్తున్నాయి. బ్రిటిష్‌ అధికారులపై కోపం, వారిని ప్రతిఘటించాలన్న కాఠిన్యం తొంగి చూస్తున్నాయి. ఆ స్థితి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంయమనంతో శాంతంగా ఉండే తన మనసు ఎందుకిలా ఉడికి పోతోందో అర్థం కాలేదు. ఆలోచనలు ఎటెటో పరిభ్రమిస్తున్నాయి. ఇంతలో భోజనం వచ్చింది. ఏదో తట్టినట్టు కారాగారంలోని వంటగదికి వెళ్లి పదార్థాలను, వంటవారిని గమనించారు. ఉరితీసే తేదీ దగ్గర పడుతున్న ఓ కరుడు కట్టిన నేరస్థుడు వంట చేయడం చూశాక మారిన తన మనోస్థితికి కారణమేంటో మహాత్ముడికి అర్థమైంది. తినే ఆహారంతో పాటు, వండే వ్యక్తి మానసికస్థితి కూడా ప్రభావం చూపుతుందని తెలిసొచ్చింది. అంటే భౌతిక పరిపుష్టికే కాదు, మానసిక స్థితిగతులకూ ఆహారం మూలం.

ప్రవర్తనపై ప్రభావం...
ఆహారనియమాలు ప్రవర్తనపై ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తి తత్త్వంపైన అతడు అపేక్షించే ఆహారం ఆధారపడి ఉంటుంది. సాత్త్వికాహారం తినేవారు సాత్త్వికంగా వ్యవహరిస్తారు. రాజసిక ఆహారంతో దర్పం చోటుచేసుకుంటే, తామసిక ఆహారంతో చురుకుదనం కోల్పోతారు.

అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్‌
కలుషీకృత చిత్తానాం ధర్మస్సమ్యక్‌ న భాషతే

అన్నదోషంతో మనసు మలినమౌతుంది, చిత్తమాలిన్యం వల్ల ధర్మబద్ధత కొరవడుతుంది అంటూ ఆహారప్రాధాన్యాన్ని గుర్తుచేశారు మహర్షులు. కొన్ని పదార్థాలు దేహంలోనూ, మనసులోనూ అలజడి సృష్టిస్తాయి. పైగా నాగరికత వేగం ప్రభావంతో సిద్ధాహారం(ఫాస్ట్‌ఫుడ్‌)పైనే ఆధారపడేలా చేసింది. జిహ్వ కొత్తకొత్త రుచులను కోరుతోంది. వేళకాని వేళలోనూ తిండికి తపిస్తోంది. మారుతున్న సామాజిక పరిస్థితులను బట్టి భోజన నియమాల్లో కొన్ని సవరణలు చేసినా మౌలికంగా శరీరధర్మాన్ని అనుసరించి సంప్రదాయబద్ధమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మన ప్రవర్తన, మాటతీరు కూడా తినే ఆహారం మీద ప్రభావం చూపుతాయని, అందుకే అధిక ప్రసంగాలకు దూరంగా ఉంటూ మౌనంగా తినడమే ఉత్తమం... (మౌనేన భోజనం కుర్యాత్‌) అన్నారు.

యుగపురుషుడు చెప్పిన యుక్తాహారం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు యుక్తాహారాన్ని ప్రస్తావించాడు. శరీరానికి యుక్తమైన, ఆమోదయోగ్యమైన ఆహారాన్నే తీసుకోవాలని హితవు పలికాడు. ఆ పరంపరలో...

ఆయుః సత్త్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః
స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః

అన్నారు. సాత్త్వికాహారంతో బుద్ధి, ఆరోగ్యం, సుఖసంతోషాలు కలిగి ఆయువు వృద్ధి అవుతుంది. పాలవంటి రస పదార్థాలు, వెన్న, నెయ్యి వంటి స్నిగ్ధ పదార్థాలు తేజస్సును పెంచుతాయి. చేదు, పులుపు, ఉప్పు, కారం, ఎక్కువ వేడిగా ఉన్న పదార్థాలు తీక్షణతను, అలజడిని, అశాంతిని, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. పక్వం కానివి, సరిగా ఉడకనివి, రసహీనమైనవి, దుర్గంధాన్ని ఇచ్చేవి, పాడైనవి తామసగుణాల్ని పెంచేవి నిర్వీర్యుల్ని చేస్తాయనేది భావం.

జిహ్వ చాపల్యం.. చిత్తచాంచల్యం
రుచి మరిగిన జిహ్వ వాంఛల్ని రెచ్చగొడుతుంది. అది కొన్నిటితో సంతృప్తి చెందదు. కొత్తకొత్త రుచుల కోసం ఉవ్విళ్లూరుతుంది. ఆహారం విషయంలో పొట్ట మాట వినాలే కానీ, నాలుక మాట వినకూడదన్నారు పెద్దలు. ప్రలోభపెట్టి పతనమొందించడంలో నయనం, నాలుక తోడుదొంగలు. అందుకే ఉత్తరగీతలో శ్రీకృష్ణపరమాత్ముడు ‘జితం సర్వం జితే రసే’ అన్నాడు. రసేంద్రియమైన నాలుకను జయిస్తే, సర్వేంద్రియాలను జయించినట్లేనని భావం. మనోచాంచల్యానికి మనం తీసుకునే ఆహారమూ కారణమేనని పరోక్షంగా హెచ్చరించాడు. ఎందరో మహానుభావులు దీన్ని అక్షరాలా ఆచరించారు.

ఆహార నియమనిష్ఠల్లో గాంధీజీ ఆదర్శనీయులు. వారు అన్నం సహా అయిదు పదార్థాలే కంచంలో ఉండేట్లు నిబంధన విధించు కున్నారు. జీవితాంతం దాన్ని పాటించారు. ఆహార్యంలోనే కాదు ఆహారంలోనూ తన నిరాడంబరతను చాటుకున్నారు. ‘పుష్కలంగా ఉన్నాయని బావిలోని నీళ్లన్నీ తాగటం లేదుగా! మరి అందుబాటులో, ఆకర్షణీయంగా ఉన్నాయని అతిగా ఎందుకు తినాలి?’ అని ప్రశ్నించేవారు. ఆహారనియమాలకు సంబంధించి ‘డైట్‌ అండ్‌ డైట్‌ రిఫార్మ్‌’ పేరిట వ్యాసాలు కూడా రాశారు. ఇక స్వామి వివేకానంద ‘సులభంగా జీర్ణంకాని ఆహారం తీసుకుంటే మనసును నిగ్రహించటం కష్టమవుతుంది’ అనేవారు.

ఆహారం ఔషధంలా...
సాత్త్వికం, మితం, న్యాయార్జితం, దైవార్పితం- అంటూ ఆయుర్వేదంలో నాలుగు ఆహార నియమాలున్నాయి. వాటితోనే ఆరోగ్యం, ఆనందం సాధ్యమన్నారు. ఆహారం అటు ప్రాపంచిక, ఇటు పారమార్థిక జీవితాలపై ప్రభావం చూపుతుంది. అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాలు అవగతం కావాలంటే ఆహారం మితంగా, హితంగా ఉండాలి.

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతి దినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్‌ప్రాప్తేన సన్తుష్యతామ్‌

అన్నారు ‘సాధనపంచకం’లో ఆదిశంకరాచార్యులు. ప్రతిదినం ఆకలి అనే రోగాన్ని అన్నమనే ఔషధంతో ఉపశమింపచేయాలి. పలు రుచులు కోరక దొరికినదానితో తృప్తిచెందాలని భావం. రమణమహర్షి కూడా ఆహారనియమాలు పాటించేవారు. వేళల నుంచి వంటకాల వరకు భక్తులు నిర్దిష్ట సూత్రాలను అవలంబించేలా చూసేవారు. ఒక శిష్యుడు- ఆధ్యాత్మిక పురోగతికి ఎలాంటి ఆహారం తీసుకోవాలని అడిగితే ‘సాత్త్వికమైన మితాహారంతో శరీరం, మనసూ పరిశుద్ధమౌతాయి. అది పారమార్థిక, లౌకిక జీవనాలకు శ్రేయోదాయకం’ అన్నారు. ఆ హితోపదేశాన్ని అనుసరిద్దాం.

- బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు