Updated : 24 Oct 2022 08:47 IST

దివ్య దీప్తుల కేళి దీపావళి

వెలుగు రేఖ జ్ఞానానికి ప్రతీక. మన హృదయాల్లో నిండిన అజ్ఞాన తమస్సులను కాంతిపుంజంతో తరిమికొట్టి తేజోవంతం చేసేదే దీపావళి పర్వదినం.

ఇంటా బయటా దీప్తులు నింపే దీపావళి చిన్నాపెద్దా అందరికీ ఇష్టమైన ఆనందాల పర్వదినం. దీని వెనక అనేక ఆంతర్యాలున్నాయి. యుగయుగాల చరిత్ర ఉంది. ప్రధాన కథ మాత్రం నరకాసుర వధతో ముడిపడింది. దాని గురించి భాగవత శ్రోత అయిన పరీక్షిత్తు ‘భూదేవికి ప్రియ పుత్రుడైన నరకుణ్ణి శ్రీహరి ఎందుకు చంపాడ’ని అడిగితే శుకమహర్షి వివరించాడు.

నరకుడి విచిత్ర కోరిక

విష్ణుమూర్తి ఆదివరాహ స్వామిగా అవతరించినప్పుడు భూమాత వలన నరకాసురుడు జన్మించాడు. తనకు ఎవరి ద్వారానూ మరణం సంభవించకూడదని వరం కోరితే.. బ్రహ్మదేవుడు జీవికి మరణం తప్పదంటూ మరేదైనా అడగమన్నాడు. నరకుడు తాను తల్లి కారణంగా మాత్రమే చనిపోవాలని అడిగాడు. అది ఎటూ జరగదన్నదే అతడి ఆలోచన. వెంటనే ‘తథాస్తు’ అన్నాడు విధాత. ఇక నరకాసురుడికి ఎదురులేకుండా పోయింది. కాలం గడిచింది. యుగాలు మారాయి. వరాహమూర్తి శ్రీకృష్ణుడిగా, భూమాత సత్యభామగా అవతరించారు.

ఒకనాడు దేవేంద్రుడు కృష్ణుణ్ణి సమీపించి దేవతల తల్లి అదితి చెవి కుండలాలను, వరుణదేవుడి ఛత్రాన్ని, దేవతల మణి పర్వతాన్ని నరకాసురుడు అపహరించాడనీ, పదహారు వేలమంది కన్యలను బలవంతంగా తీసుకెళ్లి ప్రాగ్జ్యోతిషపురంలో బంధించాడని చెప్పి అతడి బారినుంచి రక్షించ మన్నాడు. శస్త్ర, వాయు, జల, అగ్ని, పర్వత దుర్గాలతో ప్రాగ్జ్యోతిషపురం శత్రు దుర్భేద్యంగా నిర్మితమైంది. పైగా మురాసురుడనే ఐదు తలల రాక్షసుడు దానికి కాపలా.

దేవేంద్రుడి వినతితో కృష్ణుడు యుద్ధానికి బయల్దేరగా ‘మీ వీరత్వం గురించి ఎప్పుడూ వింటుంటాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తాను’ అంది సత్యభామ. కృష్ణుడు చిరునవ్వుతో అంగీకరించాడు. లోక కల్యాణానికి కావలసింది అదే! శ్రీకృష్ణుడు దుర్గాలను నాశనం చేశాడు. మురాసురుణ్ణి, అతడి ఏడుగురు కుమారులనూ హతమార్చాడు. ఇంతలో నరకాసురుడు యుద్ధానికి రావడం చూసి కోపోద్రిక్తురాలైన సత్యభామతో..

లేమా దనుజుల గెలువగ లేమా నీవేల కడగి లేచితి విటు రా
లేమాను మాన వేనిన్‌ లేమా విల్లందుకొనుములీలం గేలన్‌

అన్నాడు. ‘భామా! ఈ రాక్షసులను మనం గెలవలేమా? సరే, యుద్ధానికి సిద్ధమవుతున్నావు కనుక ఇదిగో చెయ్యి’ అంటూ విల్లు అందించాడు. ఆశ్చర్యంగా సత్యభామ రాక్షస సమూహం మొత్తాన్నీ అంతం చేసింది. ఆమె వీరత్వం చూసి నరకుడు హడలిపోయి శ్రీకృష్ణుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. కృష్ణుడు సత్యభామను సేదతీరమని, నరకుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించాడు. అప్పటికే సత్యభామ కారణంగా రాక్షసగణం నాశనం కాగా నైతికంగా పతనమైన నరకాసురుడి శిరస్సు సుదర్శనచక్రం ధాటికి తెగిపడింది. నాటి నుంచి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశిని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నరకచతుర్దశి పండుగయ్యింది.

దీపాల పండుగ

చీకటిని చీల్చే జ్యోతి ప్రకాశం త్రిమూర్త్యాత్మకం. త్రిమాతలకు ప్రియాతిప్రియం. పాప క్షయ కారకం. అందుకే పెద్దలు సాయంసంధ్య వేళ దీపం వెలిగించి

దీపోజ్యోతిః పరబ్రహ్మా దీపోజ్యోతిః జనార్దనః
దీపోహరతు మే పాపం సంధ్యాదీపం నమోస్తుతే

అంటూ ప్రార్థించేవారు. త్రిమూర్తి స్వరూపమైన ఆ దీపం ఈనాడు వందల ప్రమిదల్లో జాజ్వల్యమానంగా వెలుగుతుంటే దేవతలంతా ముంగిట నిలిచి ఆశీర్వాదాలు అందిస్తారనడంలో సందేహమేలేదు.

లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు

పురాణ కథలను అనుసరించి శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తిని చేరుకున్న రోజిది. అందుకే ఆమెకెంతో ప్రియమైన ఈరోజు లక్ష్మీపూజ చేయడం ఆనవాయితీగా మారింది.

మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరీ
హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే
సిద్ధి బుద్ధి ప్రదే దేవీ భుక్తి ముక్తి ప్రదాయినీ
మంత్ర మూర్తే సదాదేవీ మహాలక్ష్మీ నమోస్తుతే

అంటూ పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి.

మార్వాడీలకు సంవత్సరాది

మార్వాడీలు వ్యాపార నిర్వహణకు దీపావళిని రోజును సంవత్సరాదిగా భావిస్తారు. ఏడాది లావాదేవీలన్నీ దీపావళి నాటికే పూర్తిచేసుకుని పండుగ నాడు కొత్త ఖాతా పుస్తకాలను సిద్ధం చేసుకుంటారు. లక్ష్మీపూజ చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు.

బలిచక్రవర్తి దానశీలతకు గుర్తు
విష్ణునా వసుధా లబ్ధా ప్రీతేన బలయే పునః
ఉపకారకరో దత్త శ్చాసురాణాం మహోత్సవః

భవిష్య పురాణం ఉత్తర భాగంలో ఉన్న కథ ప్రకారం.. వామనుడి కోసం సర్వం త్యాగం చేసినందుకు దీపాలికా ఉత్సవం పేరుతో బలిచక్రవర్తిని పూజించేలా విష్ణువు ఏర్పాటుచేసిన పర్వమిది.

నరక విముక్తి కోసం

పితృదేవతలు నరకం నుంచి విముక్తులై స్వర్గలోకానికి వెళ్లాలని ‘యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ’ అంటూ దీపాలు వెలిగించి యమధర్మరాజును పూజించే ఆచారమూ ఉంది. ఆ దీపాల వెలుగులో పితృదేవతలు నరకం నుంచి స్వర్గానికి వెళ్తారంటారు.

శ్రీరాముడి విజయాన్ని సూచిస్తూ

రావణుణ్ణి సంహరించి రాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగొచ్చిన రోజు అమావాస్య కావడంతో ప్రజలు దీపాలతో వారిని స్వాగతించారనే కథ కూడా ప్రచారంలో ఉంది.

ఇలా దీపావళి వెనుక యుగాలు దాటిన చరిత్ర ఉంది. విభిన్న కారణాలను తెలియజేసే కథలున్నాయి. చెడుకు చాలా దూరంగా, మంచికి మరింత దగ్గరగా ఉంటే విజయం తథ్యమన్నదే అన్నిటి సారాంశం.

- రామచంద్ర, కనగాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు