జీవావరణ సమతుల్యం...నాగారాధనం

భారతీయంలో నాగారాధన ఒక ఆచారం. పామును ఆరాధించడం, పాలు పోసి మొక్కులు తీర్చుకోవడం మన ప్రత్యేక సంప్రదాయం.

Updated : 29 Oct 2022 09:06 IST

అక్టోబరు 29 నాగుల చవితి

భారతీయంలో నాగారాధన ఒక ఆచారం. పామును ఆరాధించడం, పాలు పోసి మొక్కులు తీర్చుకోవడం మన ప్రత్యేక సంప్రదాయం. నాగులచవితి, నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాలు అందుకు నిదర్శనం.

కార్తిక శుద్ధ చవితినాడు నాగవ్రతం చేయాలని ‘చతుర్వర్గ చింతామణి’ వివరించింది. సంతాన, సౌభాగ్యం కోసం స్త్రీలు సర్ప పూజలు చేస్తారు. నాగదోషం వల్ల సంసారంలో సమస్యలొస్తాయని, పరిహారంగా నాగేంద్రుని అర్చించాలని నమ్ముతారు. సంతానం ఇబ్బందులు ఎదుర్కోకుండా, అపమృత్యువును అధిగమించడానికి నాగప్రతిష్ఠ చేసే ఆచారమూ ఉంది. జానపదుల జీవితాల్లో నాగారాధన ప్రముఖమైంది. ప్రతి ఆలయంలో నాగప్రతిమలుంటాయి. వీటిని నాగశిల, నాగకల్లు అంటారు. ‘నాగేంద్రస్వామీ! నీకు నూకలు సమర్పిస్తాం, మాకు మూకను (అధిక సంతానం) ఇవ్వు’ అంటూ స్త్రీలు ప్రార్థించే పాట బహుళ ప్రచారంలో ఉంది. పూర్వం గంపెడు బిడ్డలు కలగాలని ఆశీర్వదించేవారు పెద్దలు. నాగేంద్రుడి దయవల్ల పిల్లలు పుట్టారని నాగయ్య, నాగమ్మ, నాగులయ్య, నాగేశ్వరరావు, నాగులు లాంటి పేర్లు పెట్టుకోవడం, కోపంలోనూ వెర్రినాగన్న అని విసుక్కోవడం చూస్తుంటాం. నాగులారం, నాగవరం, సర్పవరం లాంటి ఊళ్ల పేర్లూ ఉన్నాయి. ఈ పర్వదినాల వెనుక యోగ భావన, భక్తి బోధన ఇమిడి ఉంది.

నాగుల చవితి ఇలా...
కార్తిక శుద్ధ చవితే నాగులచవితి. అంతకు ముందురోజే ఆలయాలు, ఊరి వెలుపల పాముల పుట్టల దగ్గర అలికి ముగ్గులుపెడతారు. పండ్లు, చలిమిడి, చిమ్మిరి సిద్ధం చేసుకుంటారు. నాగుల చవితినాడు వేకువ జామునే పుట్ట దగ్గర పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. కొందరు వడపప్పు, కోడిగుడ్లు, కాల్చిన తేగలు, తాటి బుర్రగుంజు కూడా నివేదిస్తారు. సంతానం కలగకపోవడం, వినికిడి లోపం, మాటలు సరిగా రాకపోవడం తదితర దోషాల పరిహారానికి నాగారాధన చేస్తారు. పూజ తర్వాత పుట్ట బంగారం పేరుతో మట్టి తీసి చెవులకు అద్దుకుంటారు.

యోగశాస్త్రపరంగా..
జ్యోతిష, యోగశాస్త్రాల పరంగానూ ప్రాముఖ్యత సంతరించుకుంది నాగుల చవితి. కుండలినీ యోగ సాధనకు పాముపుట్ట నిదర్శనమని, సాధకుడి శరీరం నవరంధ్రాలతో కూడిన పాము పుట్టలాంటిదని చెబుతారు. నాగు పాము శైవ, వైష్ణవ భేదాలకు అతీతంగా శివుడి మెళ్లో అలంకారంగా, శ్రీమహావిష్ణువుకు పాన్పుగా ఉంది. మన శరీరంలోని ఇడ, పింగళ నాడులను ఆడ, మగ సర్పాలతో పోలుస్తారు. నాగులకు జన్మస్థానం పాతాళమని పురాణాలు వివరించినప్పటికీ భూమిమీది ప్రకృతి అంటే మక్కువకొద్దీ ఇక్కడికొచ్చి సంచరిస్తాయంటారు. దేవ గంధర్వ, యక్ష, పితృ, రాక్షస గణాల వరుసలో సర్పగణమూ ఉంది.

నాగదేవతే మానసాదేవి
ఒంటినిండా సర్పాలు, తలమీద పడగ, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి సుపరిచితమే. ఆ దేవిని చెట్టు-పుట్ట-గుట్టల రూపంలో గ్రామ దేవతగా ఆరాధిస్తారు. ఆ తల్లి ఒడిలోని పిల్లవాడే ఆస్తీకుడు. అతడు సర్పయాగాన్ని ఆపి వాటిని రక్షించాడు. ఆస్తీకుడి పేరు చెబితే పాములు పక్కకు తొలగిపోతాయి. దేవీభాగవతంలోని మానసాదేవి ఆరాధన సర్పారాధనే. సర్పభయాన్నీ విషప్రభావాన్నీ పోగొట్టి సంపదలనూ, సంతానాన్నీ ప్రసాదిస్తుంది.
క్షీరసాగరమథనంలో గరళాన్ని మింగినప్పుడు, ఆ విషం శివుడి మీద ప్రభావం చూపకుండా అడ్డుకుంది మానసాదేవే.

జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ
వైష్ణవీ నాగభగినే శైవీ నాగేశ్వరీ తథా

అందంగా గౌరవర్ణంలో ఉన్నందున జగద్గౌరి, శివుడి శిష్యురాలు కనుక శైవి, శ్రీకృష్ణుడి భక్తురాలు కనుక వైష్ణవి, నాగులకు సోదరి కనుక నాగభగిని, సర్పయాగంలో వాటిని కాపాడటాన నాగేశ్వరి అన్నారు.

పురాణాల్లో సర్ప రాజులు
వాసుకి, తక్షకుడు, ఐరావతుడు, ధనంజయుడు, కర్కోటకుడు, శంఖపాలుడు, అనంతుడు, శేషుడనే అష్ట సర్పరాజులను వర్ణించాయి పురాణాలు. వాసుకి, అనంతుడు, శేషుడు సత్త్వగుణ సంపన్నులు. ఐరావత, ధనంజయ, శంఖపాలులు రజోగుణులు. తక్షక, కర్కోటకులు తమోగుణులు. ఇవే జాతి పాములు. త్రాచుపాములు తక్షక, నల్లత్రాచులు కర్కోటక వంశానివి. అనంతుడి వంశ పాములు బంగారురంగులో, శేష, శంఖపాల వంశ సర్పాలు తెల్లగా, వాసుకి జాతివి కపిల వర్ణంలో ఉంటాయి. ధనంజయుడి జాతి పసుపురంగులో, ఐరావతుడి జాతి బూడిదరంగు లేదా ఇంకా లేతవర్ణంలో ఉంటాయి. పాములను చంపితే నాగదోషమని, కొన్నిటి పడగల మీద మహిమాన్విత మణులుంటాయని నమ్ముతారు. జీవావరణ వ్యవస్థలో సర్పం ఓ భాగం. అందుకే ‘సేవ్‌ స్నేక్స్‌’ పేరుతో ఉద్యమాలు నడుపుతున్నారు. ఆ జాతి అంతరిస్తే ప్రకృతి సమతుల్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ కారణంతోనే మన పూర్వులు నాగారాధనను సూచించినట్టు పండితులు వివరిస్తున్నారు.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని