శివలింగం పాలు తాగింది!

కన్నడదేశంలో శివభక్తులైన దంపతులకు కూతురు పుట్టింది. గొడగూచి అని పేరు పెట్టి గారాబంగా పెంచారు.

Updated : 27 Oct 2022 01:28 IST

కన్నడదేశంలో శివభక్తులైన దంపతులకు కూతురు పుట్టింది. గొడగూచి అని పేరు పెట్టి గారాబంగా పెంచారు. ఒకసారి తల్లిదండ్రులు పొరుగూరు వెళ్తూ తాము తిరిగొచ్చేవరకూ ఏమేం చేయాలో గొడగూచికి చెప్పారు. వాటిలో శివుడికి క్షీర నివేదన ముఖ్యమైంది. మర్నాడు ఆమె శుచిగా స్నానంచేసి ఆరకాగిన పాలు తీసుకెళ్లి శివుడి ఎదుట పెట్టి తాగమంది. శివలింగం పాలు తాగలేదని బతిమాలింది, బామాలింది. ‘పాలు సరిపడినన్ని లేవా? బాగా కాగలేదా? ఇంకేదైనా పొరపాటు చేశానా? నాకు తగినంత భక్తి లేదా? చిన్నపిల్లనని నిర్లక్ష్యమా? నువ్వు పాలు తాగకపోతే నన్ను కోప్పడతారు. దయచేసి తాగు’ అంటూ కాళ్లావేళ్లా పడింది. శివుడు పాలు తాగక పోతే పెద్దవాళ్లు తిరిగొచ్చాక తనని ఏమంటారోనని భయపడి రోదించింది. ఆ భక్తికి మురిసిపోయిన శివుడు పాలు తాగేశాడు. ప్రతిరోజు ఇదే తంతు.
ఊరెళ్లిన పెద్దలు తిరిగొచ్చారు. ఇంట్లో పాలు లేవు. అడిగితే శివుడు తాగాడని చెప్పింది. కూతురే పాలు తాగి అబద్ధం చెబుతోందనుకున్నారు. వాళ్లు తన మాట నమ్మనందుకు గొడగూచికి ఉక్రోషం వచ్చింది. నిజమైతే శివుడు పాలు తాగటాన్ని చూపమన్నారు. వాళ్ల ఎదుట పాలు శివుడికి పాలు నివేదించి తాగమంది. నమ్మని వారికి నిరూపించటం కోసం శివుడు పాలు తాగాలా? ఉలకలేదు, పలకలేదు. అమ్మానాన్నలు తాను చెప్పింది అబద్ధం  అనుకుంటారన్న బాధతో శివలింగానికేసి తల కొట్టుకుంది గొడగూచి. ఆ ముగ్ధభక్తికి మురిసిన శివుడు బాలికను తనలో లీనం చేసుకున్నాడు. అది చూసి పెద్దలు గొడగూచిని కాపాడేందుకు పట్టుకోబోయారు. చేతులకి అందిన ఆమె జుట్టు పట్టుకుని తమ వైపుకి లాగితే అది మాత్రమే వారికి దక్కింది. ఆ కురులనే తమ ఇలవేలుపుగా భావించారు.

- డాక్టర్‌ అనంతలక్ష్మి


శ్లోకామృతమ్‌

లాఘవం కర్మసామర్థ్యం
స్థైర్యం దుఃఖసహిష్ణుత  
దోషక్షయో అగ్నివృద్ధిశ్చ  
వ్యాయామాదుపజాయతే

వ్యాయామం వల్ల శరీరం తేలికపడుతుంది. పనిలో సామర్థ్యం పెరుగుతుంది. కష్టాలను సహించే శక్తి, స్థైర్యం ఇనుమడిస్తాయి. శారీరక దోషాలు తొలగి ఆరోగ్యం కలుగుతుం దనేది భావం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని