దధీచి ధీరత్వం

వృత్రాసురుడి అకృత్యాలను తట్టుకోలేక దేవతలందరూ శ్రీమహావిష్ణువు వద్దకు పరుగు తీశారు. అప్పుడా దేవదేవుడు దధీచిని ఆశ్రయించమన్నాడు.

Updated : 03 Nov 2022 04:03 IST

వృత్రాసురుడి అకృత్యాలను తట్టుకోలేక దేవతలందరూ శ్రీమహావిష్ణువు వద్దకు పరుగు తీశారు. అప్పుడా దేవదేవుడు దధీచిని ఆశ్రయించమన్నాడు. ఆ రుషి దేహం నారాయణ కవచ మంత్ర ప్రభావంతో తేజో వంతంగా ఉంటుందని, ఆ శరీరంతో రూపుదిద్దుకున్న దివ్యాయుధంతో వృత్రాసురుణ్ణి సంహరించడం సాధ్యం- అన్నాడు. దాంతో సుర సమూహం దధీచిమహర్షిని సందర్శించి వృత్రాసురుడి విషయమంతా విన్నవించు కున్నారు. అడగకూడనిదైనా అనివార్య పరిస్థితుల్లో తమరి దేహాన్ని అర్థించక తప్పడం లేదన్నారు. ఆ సర్వసంగ పరిత్యాగి ‘అవసరంకొద్దీ అడుగుతున్నప్పుడు అడగరానిదైనా అడిగి తీరతాడు. ఇచ్చే దాత ఈయరానిదైనా ఇచ్చి తీరతాడు. ఆశగా అర్థిస్తే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. ఈ శరీరాన్ని ఎప్పటికైనా విడిచిపెట్టాల్సిందే. అలాంటప్పుడు మీ అంతటివారికి ఈ దేహం అవసరమైతే దీన్ని అర్పించడానికి అభ్యంతరం ఏముంటుంది? అశాశ్వత శరీరం వల్ల శాశ్వత యశస్సూ, పుణ్యమూ సంప్రాప్తిస్తుంటే అంతకంటే కావల్సిందేముంది? ఇలాంటి సదవకాశాన్ని జారవిడుచుకుంటే పాషాణంతో సమానం’ అంటూ దేహాన్ని అర్పించడానికి అంగీకరించాడు. దధీచిలా ‘పరోపకారార్థం ఇదం శరీరమ్‌’ అంటూ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేందుకు సిద్ధపడిన త్యాగమూర్తులెందరో! శిబిచక్రవర్తి కూడా ఈ దయా గుణంతోనే కీర్తి గడించాడు. అందుకే మన సనాతన ధర్మం ‘త్యాగమొక్కటి చాలు. అదే పొగడదగింది. తక్కిన గుణాలు ఎందుకు? త్యాగం వల్లనే లోకంలో పశువులు, రాళ్లు, చెట్లు పూజలందుకుంటున్నాయి’ అని శ్లాఘించింది. ఇలాంటి గుణసంపన్నులు ఏ రాజ్యాలూ ఏలకపోయినా, ఏ సుఖాలూ అనుభవించక పోయినా తమ జన్మలను సార్థకం చేసుకుంటారు. 

 - బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని