మహాశివుడి దర్శనం

మహాశివుణ్ణి నేరుగా చూడాలను కుంటున్నారా? అదెంతో సులభం. భౌమేశ్వరుడు భూమి, ఉదకభవుడు జలం, రుద్రుడు అగ్ని, ఉగ్రుడు వాయువు, భీముడు ఆకాశం, పశుపతి మనలో ఉండే ఆత్మ, ఈశానుడు సూర్యుడు, మహాదేవుడు చంద్రుడు- ఈ ఎనిమిదీ శివుడి అష్ట రూపాలు.

Updated : 03 Nov 2022 04:04 IST

మహాశివుణ్ణి నేరుగా చూడాలను కుంటున్నారా? అదెంతో సులభం. భౌమేశ్వరుడు భూమి, ఉదకభవుడు జలం, రుద్రుడు అగ్ని, ఉగ్రుడు వాయువు, భీముడు ఆకాశం, పశుపతి మనలో ఉండే ఆత్మ, ఈశానుడు సూర్యుడు, మహాదేవుడు చంద్రుడు- ఈ ఎనిమిదీ శివుడి అష్ట రూపాలు. వీటిలో పశుపతిని దర్శించేందుకు మాత్రమే తీవ్ర కృషి అవసరం. మిగిలిన ఏడు రూపాలూ నిత్యం మనం చూసేవే. ఇక వరాహకల్పం 7వ వైవస్వతంలో శివుడు శ్వేతాచార్యుడిగా, రెండో ద్వాపరాంతంలో సుతారుడనే యోగిగా, మూడో ద్వాపరంలో దమనుడనే రుషిగా జన్మించాడు. అలా సుహోత్రుడు, కంకుడు, లోకాక్షి, దధివాహునుడు, రుషభుడు.. ఇలా ఒక్కో ద్వాపరంలో అవతారాలు దాల్చాడు. రానున్న 19 ద్వాపర యుగాల్లో శివుడు వరుసగా తపోధన, అత్రి, బలి, గౌతమ, వేద, శిర, గోకర్ణ, గుహవాసు, శిఖండి, మాలి, అట్టహాసుడు, దారకుడు, లాంగలీశ, శ్వేతయోగి, శూలి, దండి, సహిష్ణు, సోమశర్మ, కులీశ పేర్లతో అవతరించాడు. శివపురాణం ప్రకారమైతే శివుడికి 116 అవతారాలున్నాయి. దేవుళ్లకు ఇన్ని అవతారాలు ఎందుకనే సందేహం కలగొచ్చు. ‘ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి’ అన్నారు. పరమాత్మ తనను భిన్నమైన రూపాల్లో చూసుకుంటాడు. సర్వజీవుల్లో తనను ప్రతిఫలింప చేసుకుంటాడు. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ అన్నారు కదా! అంటే లోకంలో ఉన్నదంతా బ్రహ్మమేనని భావం.

- పద్మజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని