Updated : 10 Dec 2022 19:48 IST

మన్ను తినంగనే శిశువునో...

ముద్దు ముద్దు మాటలు, మురిపాల చేష్టలు. అంతులేని ఆటలు.మాయ తెలీని అమాయకత్వం. అబ్బురమనిపించే ఆలోచనలు.  సందడిచేసే అల్లరులూ, పసందైన దోబూచులూ.. ఇవన్నీ పిల్లలు పంచే వినోదాలే కాదు, మన ఆరాధ్యదేవుళ్లూ అనుభవించి అనుభూతులు మిగిల్చినవే.

‘అమ్మా! మన్ను తినంగ నే శిశువునో, ఆకొంటినో, వెర్రినో..’ అంటూ అమాయకంగా ముఖం పెట్టి, తల్లి యశోదాదేవికి నోట్లో బ్రహ్మాండాన్ని చూపించాడు. మళ్లీ మాయలో పడేసి ‘కలయో వైష్ణవ మాయో.. నే యశోద గానో..’ అనే సందేహానికి లోనయ్యేట్టు చేసిన బాలకృష్ణుడి వంటి శిశువు కావాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది.

పరమాత్ముడైనా కర్మభూమిలో అవతరించినప్పుడు, ఆయా వయసులు, అవస్థలకు తగినట్టే ప్రవర్తిస్తాడు. అమాయకత్వానికి, నిష్కల్మషత్వానికి, పసితనం పట్టుగొమ్మ. పరబ్రహ్మ స్వరూపంగా తనలో తాను ఆనందించే శిశువు నానాటికీ లౌకిక విషయాలు నేర్చుకుంటూ ప్రపంచ గమనాన్ని అర్థంచేసుకోవడం చూస్తాం. అప్పటివరకు వారి స్వచ్ఛమైన చిరునవ్వు స్వర్గాన్ని తలపిస్తుంది. ఆ ముద్దుమాటలు, ఆటలు, పాటలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

రాముడికి నోరు తిరగలేదు

వాల్మీకి శ్రీరాముడి బాల్యాన్ని వర్ణించలేదు కానీ, ఆ లోటుని కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తీర్చారు. కౌసల్య మాటలు నేర్పిస్తూ అందరి పేర్లూ చెప్పిస్తుంది.
తానో ‘లాములు’ ‘తండ్రి పేరెవరయా’ ‘దాచాతమాలాలు’ ‘ఔ
లే నాపే’ రన ‘నమ్మగాల’ నగ నోలిందల్లి ‘కౌసల్య తం
డ్రీ!’ నాగా ననబోయి రాక కనులన్నీర్వెట్ట ‘గౌసల్య నౌ
గానే కానులెయమ్మనే’ యని ప్రభున్గౌసల్య ముద్దాడెడిన్‌

మాటలు ఇంకా రాలేదు. తండ్రి దాచాతమాలాలు. అంటే దశరథమహారాజు. తన పేరు చెప్పమంటే ‘అమ్మగాలు’ అన్నాడు. ‘అది పిలుపు, పేరు కౌసల్య’ అంటుంది తల్లి. ఆ మాట పలకలేక ఉక్రోషంతో కన్నీళ్లు వస్తుంటే చూడలేక కౌసల్య ‘నేను అమ్మనే! కౌసల్యని కానే కాను’ అంటూ ముద్దాడింది. నీళ్లలో ఆడటం, ఒక్కచోట నిలవక బొంగరంలా తిరుగుతుండటం, మడి అని చెప్పినా కులదైవం రంగనాథుడి మందిరంలోకి వెళ్లి విగ్రహాలను లాగడం వంటి చిలిపిచేష్టలు కౌసల్యతో పాటు మనకీ ఆనందాన్ని కలిగిస్తాయి.
కృష్ణుడంటే తెలుగువారికి బాలకృష్ణుడే. యశోద సంగతి ఏమో గానీ, అటు వ్యాసుడు, ఇటు పోతన కృష్ణుడి బాల్య లీలలను ఆనందించి తరించారు, తరింపచేశారు.

కృష్ణుడి తప్పటడుగులు

అప్పుడప్పుడే అడుగులు వేయటం మొదలుపెట్టిన కృష్ణుడు మధ్యలో కిందపడతాడు. శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి బూది పూతలా, ఉంగరాల జుట్టుని పైకి దువ్వి ముత్యాలహారంతో వేసిన ముడి చంద్రవంకలా ఉందట. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రటి తిలకం ఫాలనేత్రంలా, రత్నాలహారంలో నాయకమణిలా ఉన్న నీలమణి శివుడి కంఠానున్న నల్లటి మచ్చలా, మెడలోని ముత్యాలహారాలు సర్పహారాల్లా అనిపించి బాలకృష్ణుడు శివుడేమో అనిపించాడట.
పాలు తాగటానికి పేచీ పెడుతున్న కృష్ణుడితో ‘పాలు తాగితే       జుట్టు బాగా పెరుగుతుంది’ అంది యశోద. అంతే గబగబా పాలు తాగి తన జులపాలు తడిమి చూసుకుని ఇంకా పెరగలేదేమని బుంగమూతి పెడతాడు.
ఒకసారి ఏడుస్తుంటే ‘బిచ్చగాళ్లు వచ్చి తమ భిక్షాపాత్రలో వేసుకుని తీసుకెళ్లి కొడతారు’ అని బెదిరించింది యశోద. గుమ్మంలోకి వచ్చిన భిక్షకులని చూసి భయపడుతున్నట్టు తల్లివైపు చూశాడు బాలగోపాలుడు. కథలు చెప్పమని అడిగితే ‘పగలు చెప్పకూడదు, రాత్రికి చెబుతాన’న్న యశోదమ్మను ‘రాత్రి అంటే ఏమిటి’ అనడిగాడు. ‘చీకటిగా ఉంటుంది, ఏమీ కనపడదు’ అని వివరించిందా వెర్రితల్లి. వెంటనే కళ్లు మూసుకుని ‘ఏం కనపడటం లేదు, ఇప్పుడు చెప్పు’ అని తర్కశాస్త్రప్రవీణుడిలా మాట్లాడితే మురిసిపోయి ముద్దు పెట్టుకుని కౌగిలించుకోటం తప్ప ఇంకేం చేయగలదామె?!
ఒకసారి మేనల్లుణ్ణి చూడటానికి వచ్చిన కుంతీదేవికి కనపడిన మనోహర దృశ్యం...
కోపము తోడ నీవు దధికుంభముభిన్నము సేయుచున్నచో
గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రా పరిపూర్ణ వక్తమ్రు గరంబులబ్రాముచు వెచ్చ నూర్చుచుం
బాపడవై నటించుట కృపాపర! నా మది చోద్య మయ్యెడిన్‌

అడగగానే పాలివ్వలేదని, దానికి కారణం పెరుగు చిలకటం అని ఆ కుండని పగులగొట్టాడు చిన్నికృష్ణుడు. యశోద ఆకలితో, ఉక్రోషంతో ఉన్న ముద్దులకన్నయ్యను కొట్టలేక తాడు తెచ్చి కట్టేసింది. అప్పుడు కంటి నుంచి కారుతున్న కన్నీళ్లను చేతి వెనుకభాగంతో తుడుచు కుంటున్నాడు. అప్పుడు కృష్ణుడి రూపం ఆశ్చర్యం కలిగించింది, మరువలేను- అంటుంది కుంతి. కాదా మరి?!
ఒకసారి బాలకృష్ణుణ్ణి నిద్రపుచ్చటానికి ఊయల్లో ఊపుతూ రామకథ ఆలపిస్తూ జోలపాడుతోంది యశోదమ్మ. ‘రాముడనే      రాజు ఉంటాడు. అతడి భార్య సీతని రావణుడు అపహరించాడు’ అనగానే నిద్రలోకి జారుకుంటున్న పసివాడు ‘లక్ష్మణా! విల్లందుకో!’ అంటాడు. మనసెంత స్వచ్ఛంగా లేకపోతే ఆ విధమైన ప్రతిస్పందన ఉంటుంది?! కొంచెం పెరిగాక కొంటెతనం నేర్చిన తర్వాత వేషాలు మరో రకంగా ఉంటాయి.

- డాక్టర్‌ అనంతలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని