నారదముని దర్శించిన ఆలయం

సర్వజనులకు దేవుడొక్కడే అని చాటి చెప్పడమే శివతత్వం. ఆ తత్వాన్ని సర్వవ్యాప్తం చేసే అష్టాదశ పీఠాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక సోమేశ్వరాలయం ఒకటి.

Published : 10 Nov 2022 00:36 IST

సర్వజనులకు దేవుడొక్కడే అని చాటి చెప్పడమే శివతత్వం. ఆ తత్వాన్ని సర్వవ్యాప్తం చేసే అష్టాదశ పీఠాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక సోమేశ్వరాలయం ఒకటి. దక్షిణ కాశీగా ప్రసిద్ధమైన ఈ పుణ్య క్షేత్రంలో ఎటు చూసినా శివలింగాలు దర్శనమిస్తూ దివ్యభావన కలిగిస్తాయి.

క్షేత్ర చరిత్ర
ఒక శాసనంలో కొల్లిపాకగా ప్రస్తావించిన కొలనుపాకను విజయనగర రాజుల కాలంలో కొల్పాక్‌గా పిలిచారు. స్వయంభువుగా పరమశివుడు వెలసిన ఈ క్షేత్రానికి కోటి లింగాలు అని కూడా పేరు.
ఇది వీరశైవ సిద్ధ క్షేత్రం. శైవ మత స్థాపకుడు శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది, వెయ్యి సంవత్సరాలు భూమండలం మీద శైవ మతప్రచారం చేసి, మళ్లీ ఇక్కడే లింగైక్యమైనట్లు సిద్ధాంత శిఖామణి గ్రంథం వివరిస్తోంది.

ఆలయ విశేషాలు
వీరభద్రుడు క్షేత్రపాలకుడిగా, అమ్మవారు చండికాంబగా దర్శనమిచ్చే ఈ ఆలయానికి రెండు వేల ఏళ్ల చరిత్ర ఉంది. కల్యాణి చాళుక్యుల కాలంలో ఆరంభమైన ఆలయ నిర్మాణం కాకతీయుల కాలంలో పూర్తయి నట్లుగా చరిత్ర చెబుతోంది.
చంద్రుడు శాప విముక్తి కోసం ఈ స్వామిని ఆరాధించాడని, అగస్త్య, నారద మునీంద్రులు ఈ ఆలయాన్ని దర్శించు కున్నారని.. తెలియజేసే పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. సోమేశ్వరాలయానికి అనుబంధంగా భైరవ, మల్లిఖార్జున స్వామి ఆలయాలున్నాయి.
హైదరాబాదుకు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సులో సులువుగా వెళ్లొచ్చు. రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే ఆలేరులో దిగి అక్కడి నుంచి బస్సులో చేరుకోవచ్చు.

- బొగ్గరపు వెంకటేష్‌ ఎమ్‌.ఎన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని