చక్కని తల్లికి చాంగుభళా!

సర్వశుభాలకు అధిష్ఠాన దేవత మహాలక్ష్మి. శ్రీసూక్తంలో కీర్తించిన ఆ వైకుంఠపుర సమ్రాజ్ఞి, తిరుమల వేంకటేశ్వరుని అర్ధాంగిగా తిరుపతి సమీపాన తిరుచానూరులో కొలువై ఉంది.

Updated : 10 Dec 2022 19:46 IST

నవంబరు 19న అంకురార్పణ

ర్వశుభాలకు అధిష్ఠాన దేవత మహాలక్ష్మి. శ్రీసూక్తంలో కీర్తించిన ఆ వైకుంఠపుర సమ్రాజ్ఞి, తిరుమల వేంకటేశ్వరుని అర్ధాంగిగా తిరుపతి సమీపాన తిరుచానూరులో కొలువై ఉంది. కొంగుబంగారమైన ఆ కరుణాలయకు ఏటా కార్తికమాసంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. ఆమె మహాలక్ష్మి, జయలక్ష్మి, వరలక్ష్మి, వీరలక్ష్మి. తిరుచానూరులో ఆ అమ్మవారిని దర్శించుకోనిదే తిరుమల యాత్ర పూర్తి కాదని భక్తుల విశ్వాసం. తిరుమల శ్రీనివాసుడి నివాసం ‘ఆనందనిలయం’ అయితే తిరుచానూరులో శ్రీమహాలక్ష్మి ఆవాసం ‘శాంతినిలయం’. ఆయన ఆనంద ప్రదాయకుడైతే, అమ్మ శాంతి ప్రదాత్రి. అందుకే శాంతమైన మనసు కలిగి, ఆ ప్రశాంతతను నలుగురికి పంచేవారే పద్మావతి అమ్మవారి ప్రియభక్తులంటారు. ఆ దేవికి కార్తికమాసంలో జరిగే బ్రహ్మోత్సవం భక్తుల పాలిట నేత్రోత్సవం. భగవత్‌ ప్రార్థన, అంకురార్పణ, ధ్వజారోహణం మొదలుగా గల ఇరవై ఒక్క క్రియలున్నాయి. ఇవి తెప్పోత్సవం, హవిర్‌ నివేదనం, క్షమా ప్రార్థనలతో ముగుస్తాయి. తిరుమలలో జరిపినట్లుగానే తిరుచానూరులోనూ పుష్పయాగం నిర్వహించటం అనూచానంగా వస్తోంది.
బ్రహ్మోత్సవాలకు ముందురోజు అత్యంత వైభవంగా లక్షకుంకుమార్చన జరుగుతుంది. అష్టోత్తర, శతసహస్రనామాలతో, వేదమంత్రాలతో, అర్చకస్వాములతో ప్రతికుంకుమబొట్టుకు అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలిపే వేడుక ఇది. బ్రహ్మోత్సవాలు అవిఘ్నంగా జరగాలని అమ్మవారిని అర్థిస్తూ ఈ కుంకుమార్చన నిర్వహిస్తారు. అన్నమాచార్య ఆపదమొక్కులవాడికే కాదు అలమేలుమంగమ్మ ఉత్సవాల్లోనూ పాలుపంచుకున్నాడు. ‘చక్కని తల్లికి చాంగుభళా..’, ‘పరమాత్ముడైన హరి పట్టపురాణివి..’ అంటూ పరవశించి కీర్తించాడు. అమ్మవారి ద్వారా అయ్యవారి కృపాకటాక్షాలకు పాత్రుడయ్యాడు.           

 - బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని