Updated : 15 Dec 2022 16:08 IST

13 శ్లోకాలతో పథనిర్దేశం

శంకరాచార్యులవారు జీవించింది 32 ఏళ్లే అయినా ఆసేతు హిమాచలం పర్యటించారు. ఆయన కాశీలో సంచరిస్తుండగా, ఒక వృద్ధపండితుడు వ్యాకరణ సూత్రాలు వర్ణించటం చూసి ఆశ్చర్యపోయారు. మనని రక్షించేది వ్యాకరణ సూత్రాలు కాదు, గోవిందుని స్మరణమే కైవల్యానికి మార్గమంటూ భజగోవిందం చెప్పారు.
ప్రాపంచిక వ్యామోహంలో చిక్కుకున్న ప్రజలను నిద్రమత్తు నుంచి మేలుకొలిపేందుకు 13 శ్లోకాలు చెప్పారు. తొలి శ్లోకంలో భగవత్‌ చింతన తప్ప ఇతర చింతలు తరింప చేయవన్నారు. అలా ఒక్కో శ్లోకంలో ఒక్కో అంశాన్ని చెప్పారు. ధనార్జన ఆలోచన విడిచి దైవాన్నే చింతిస్తూ ఉన్నదాంతో తృప్తి చెంది ఆనందించాలి. కామపూరిత వ్యామోహాన్ని త్యజించాలి. తామరాకు మీది నీటి బిందువులా జీవితం అనిశ్చితం. లోకంలో రోగం, మోసం తదితర దుఃఖాలు నిండి ఉన్నాయి. ధనం, బలం ఉన్నంతవరకు ఆత్మబంధువులు అంటిపెట్టుకుని ఉంటారు. వృద్ధాప్యంలో ఎవరూ బాగోగులు పట్టించుకోరు. శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు తనవారి యోగక్షేమాల గురించి భయపడతారు. బాల్యం ఆటపాటలతో యవ్వనం భార్య సరససల్లాపాలతో గడిచిపోతుంది. వృద్ధాప్యం చింతలతో నిండి ఉండటాన దైవచింతనకు సమయం ఉండదు. భార్యాపుత్రులు ఎవరు? నువ్వెవరికి చెందుతావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇవన్నీ ఆలోచించి సత్యాన్ని గ్రహించు. సజ్జనులతో స్నేహం అనుబంధ రాహిత్యానికి, దాని భ్రాంతి నుంచి స్వేచ్ఛకు, ఆ స్వేచ్ఛ నిర్వికార నిత్య సత్యానుభూతికి, చివరికి జీవన్ముక్తికి దారితీస్తుంది. యవ్వన దశ గతించిన తర్వాత శక్తి తగ్గి కామకలాపాలకు అవకాశం ఉండదు. నిత్యమైన పరబ్రహ్మం గురించి తెలుసుకున్న తర్వాత సంసార విషయమై పరితపిస్తారా? ధనమదం పనికిరాదు. క్షణకాలంలో హరించే ఇలాంటివాటికోసం తపించక బ్రహ్మానంద స్థితిలో ప్రవేశించటానికి ప్రయత్నించు. కాలచక్రభ్రమణంలో ఆయుర్దాయం తరిగినా ఆశలు, కోరికలు అంత్యదశలోనూ విడిపెట్టవు. కాంత, కనకాల గురించి ఆందోళన వద్దు. ఇది మానసిక శక్తులను బలహీనపరుస్తుంది. సంసార సాగరాన్ని దాటించే నావ సజ్జన సాంగత్యమేనని అర్థంచేసుకోండి. ఇదీ 13 శ్లోకాల్లోని సందేశం, పథనిర్దేశం.  

- గోవిందం ఉమామహేశ్వర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు