Updated : 24 Nov 2022 05:01 IST

మహీదేవదేవం మహావేదభావం

నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్ఠి

మహా మహిమాన్వితుడు ఆ మయూర వాహనుడు. తేజోస్వరూపుడు, కరుణాసముద్రుడు, శివపార్వతుల శక్తిసంపత్తులు పుణికిపుచ్చుకున్న కార్తికేయుడు. దశదిశలా అజ్ఞానతిమిరాన్ని హరించి షణ్ముఖుడిగా పూజలందుకుంటున్నాడు.

తంజావూరు సమీపంలో నివసించే పరమధార్మికులు రామస్వామి దీక్షితులు, సుబ్బమ్మలకు పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. శివ భక్తులైన ఆ దంపతులు ఓ సిద్ధపురుషుడి సూచన మేరకు దగ్గరలోని వైద్యనాథ క్షేత్రాన్ని సందర్శించారు. భౌతిక వ్యాధులకే కాదు భవరోగాలకూ వైద్యుడైన ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆ ఆలయానికి అనుబంధంగా ఉన్న ముత్తుకుమారస్వామి కోవెలలో పూజలు నిర్వహించారు. 40 రోజులపాటు కుమారస్వామిని ధ్యానిస్తూ ఆలయ ప్రాంగణంలో నిష్ఠగా గడిపారు. ఫలితంగా అసాధారణ ప్రతిభావంతుడైన పుత్రుడు జన్మించాడు. కుమారస్వామి వరప్రసాదంగా కలిగిన ఆ కుమారుడే కర్ణాటక సంగీత మూర్తిత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు. కుమారస్వామి భక్తుల అభీష్టాలను తీర్చే దయామయుడని భక్తుల విశ్వాసం.

ఆ పేరు పెట్టింది అగస్త్యుడే

కార్తికేయుణ్ణి కీర్తించటానికే ముత్తుస్వామి దీక్షితులు తిరుత్తణి క్షేత్రంలో ‘శ్రీసుబ్రహ్మణ్యాయ నమస్తే నమస్తే.. మనసిజ కోటికోటి, లావణ్యాయ, దివ్యశరణ్యాయ..’ వంటి కీర్తనలతో నలభై రోజుల పాటు స్వరాంజలి ఘటించారు. ఆ తర్వాతే తన సంగీత ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆదిశంకరుల ఆరాధనలు అందుకున్న మూర్తీభవించిన బ్రహ్మజ్ఞానం. తనకు బ్రహ్మతత్వం ప్రబోధించిన కుమారస్వామిని అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్యుడని సంబోధించడంతో ఆ పేరు స్థిరపడింది. అలాగే తాంత్రికశాస్త్రంలో ఈ స్వామి కుండలినీశక్తికి ప్రతీక. కుండలిని అంటే పాము. కుమారస్వామి మయూర వాహనుడు. నెమలి ప్రణవం లేదా ఓంకారానికి చిహ్నం. ప్రణవాన్ని అధిష్ఠించి స్కందుడయ్యాడు. ‘సేనాధిపతుల్లో స్కందుడిని నేను’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటించటం విశేషం. జ్ఞానం, వైరాగ్యం, శక్తి, యశస్సు, ఐశ్వర్యం, దైవత్వాలకు ప్రతీకలైన ఆరుముఖాలతో షణ్ముఖుడు, మేలుకొలుపునకు మూలమైన కుక్కుటాన్ని(కోడి) ధ్వజంగా కలిగి కుక్కుట ధ్వజుడయ్యాడు.  కార్తికేయుణ్ణి ఆరాధిస్తే పారమార్థిక, ప్రాపంచిక జ్ఞానానికి కొదవ ఉండదు.

సుబ్రహ్మణ్యుడు కొలువైన మనోహర క్షేత్రం తమిళనాడులోని తిరుచ్చెందూరు. పరివ్రాజక సన్యాసిగా ఆదిశంకరాచార్యులు ఒకసారి కార్తికేయుణ్ణి దర్శించి..

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారి దేహం మహచ్ఛిత్త గేహమ్‌
మహీదేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలమ్‌

అంటూ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆశువుగా పలికారు. ‘నెమలిని అధిష్ఠించినవాడు, తత్వజ్ఞానాన్ని నిగూఢ వాక్యంగా కలిగినవాడు, మనోహర దేహం కలవాడు, మహాత్ముల చిత్తంలో వసించువాడు, బ్రహ్మజ్ఞానుల ఆరాధనలు అందుకునేవాడు, వేదాలు స్తుతించేవాడు, సాక్షాత్తూ మహాదేవుడికే పుత్రుడై లోకాన్ని పాలించే సుబ్రహ్మణ్యస్వామిని సేవిస్తాను’ అనేది భావం. సముద్రమంతటి సంసారాన్ని దాటించ గలనని అభయం ఇమివ్వటానికే స్వామి సాగరతీరంలో కొలువయ్యాడని ఆదిశంకరులు శ్లాఘించారు. చెప్పినట్లు ఆ క్షేత్రం ఎంతో మాహాత్మ్యం కలిగి ఉందనటానికి నిదర్శనాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకు సునామీ వల్ల తీరంలోని ప్రాంతాలు కొట్టుకుపోయినా తిరుచ్చెందూరు సుబ్రహ్మణ్య క్షేత్ర సమీపంలో మాత్రం సముద్రం మైలు దూరం వెనక్కి వెళ్లిందట.

ఆరోగ్యప్రదాత ఆ ఆరుముఖాల దేవుడు

తారకాసురుణ్ని సంహరించేందుకు అవతరించిన కుమారస్వామి ఆరోగ్యదేవుడు కూడా. దేవసేనకు, దేవతాశక్తులకు అధినాయకుడు. అందుకే షణ్ముఖారాధనతో సర్వ దేవతల అనుగ్రహం భక్తులపై ప్రసరిస్తుంది. బిల్వదళాలు, తెల్లజిల్లేడు, ఎర్రనిపూలతో పూజిస్తే కుమారస్వామి ప్రసన్నుడవుతాడని, స్వామి కటాక్షంతో గ్రహబాధలు తొలగిపోతాయని నమ్ముతారు. తెలుగునాట కుమారస్వామిని సర్పాకారంలోనూ పూజించటం ఆచారం.

కార్తికేయునికి కావడి మొక్కులు

తమిళనాట కుమారస్వామికి కావడి మొక్కులు సమర్పిస్తారు. నెమలీకలు, వెదురుదబ్బలు, పూలు అలంకరించిన కావడులతో స్వామిని దర్శిస్తారు. అక్కడ కావడిని ‘కవాడి’ అంటారు. అంటే ‘శరణాగతులమైన మమ్మల్ని రక్షించు’ అని అర్థం. అహాన్ని వదిలి శరణు వేడటమే కావడిసేవ పరమార్థం.      


పంచారామాలు ఆయన అనుగ్రహమే

తారకాసురుణ్ణి కార్తికేయుడు సంహరించాక ఆ రాక్షసుడి కంఠంలోని అమృతలింగం అయిదు ఖండాలై, పంచారామాలుగా ప్రతిష్ఠితమయ్యాయి. అలా అమరావతిలో అమరేశ్వరుడిగా, దాక్షారామంలో భీమేశ్వరుడిగా, సామర్లకోట కుమారారామంలో కుమారభీమేశ్వరుడిగా, పాలకొల్లు క్షీరారామంలో క్షీరరామలింగేశ్వరుడిగా, భీమవరంలో సోమారామంలో సోమేశ్వరుడిగా పార్వతీశుడు పూజలందుకుంటున్నాడు. తమిళనాట తిరుప్పరకుండ్రం, తిరుచ్చెందూరు, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళముదిరిచోళై క్షేత్రాల్లో కొలువుతీరి ఉన్నాడు. తెలుగునాట మోపిదేవి, కర్ణాటకలో కుక్కిక్షేత్రం సుబ్రహ్మణ్యుడి ఆరాధనతో అజరామరమై భాసిస్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆవిర్భవించింది మార్గశిరమాస శుద్ధ షష్ఠి, ధనిష్ఠా నక్షత్రయుక్త వృశ్చికలగ్నం తెల్లవారు జామున- అని పురాణాలు స్పష్టం చేశాయి. తారకాసురుణ్ణి షష్ఠి రోజునే అంతమొందించటం మరింత విశేషం.

- చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts