బ్రహ్మచర్య ప్రభావం

సంవర్తుడు బృహస్పతి తమ్ముడు. జ్ఞాని, మంచివాడు. ఆ తమ్ముడంటే బృహస్పతికి అసూయ. సోదరుడు తెచ్చిపెట్టే ఉపద్రవాలకి తట్టుకోలేక సంవర్తుడు పిచ్చివాడిలా నటించే వాడు.

Updated : 10 Dec 2022 19:41 IST

సంవర్తుడు బృహస్పతి తమ్ముడు. జ్ఞాని, మంచివాడు. ఆ తమ్ముడంటే బృహస్పతికి అసూయ. సోదరుడు తెచ్చిపెట్టే ఉపద్రవాలకి తట్టుకోలేక సంవర్తుడు పిచ్చివాడిలా నటించే వాడు. ఇక్ష్వాకు వంశస్థుడైన మరుత్తు యాగం చేయదలచి బృహస్పతిని ఆధ్వర్యం వహించమన్నాడు. ఆ యాగం చేస్తే మరుత్తు మహిమాన్వితుడవుతాడని బృహస్పతి ఒప్పుకోలేదు. సంవర్తుణ్ణి అడిగితే అంగీకరించాడు. బృహస్పతి అసూయతో రగిలిపోయి ఇంద్రుడి సాయం అడిగాడు. ఇంద్రుడు అగ్ని దేవుణ్ణి పిలిచి, మరుత్తు యాగాన్ని ఆపమన్నాడు. అగ్ని తనవద్దకు రావటం చూసి మరుత్తు ఆనందపరవశుడై అర్ఘ్య, పాద్యాదులు సమర్పించాడు. అప్పుడు అగ్ని సంవర్తుణ్ణి వదిలిపెడితే బృహస్పతిని తీసుకొస్తానని ఆశపెట్టాడు. సంవర్తుడు అది తప్పని, ఇంకా కోపం తెప్పిస్తే కంటిమంటతో భస్మీపటలం చేస్తానన్నాడు. అగ్నిదేవుడు భయపడి మరుత్తు వెనుక దాక్కుని బయటపడ్డాడు. ఇంద్రుడది నమ్మలేదు. అప్పుడు అగ్ని బ్రహ్మచర్యానికి అంత మహత్తు ఉందని చెప్పాడు. ఇంద్రుడు సంవర్తుణ్ణి వదలమంటే... అది మిత్రద్రోహం అవుతుందన్నాడు మరుత్తు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించగా మరుత్తు భయపడి పోయాడు. సంవర్తుడు రాజుని ధైర్యంగా ఉండమని తన తపోబలాన్ని ప్రయోగించాడు. సంవర్తుడి బ్రహ్మచర్య వ్రతమహిమ వల్ల యుద్ధానికి సిద్ధపడిన ఇంద్రుడు కాస్తా శాంతించాడు. బ్రహ్మచర్యమే కాదు, ఏ నియమం అయినా నిష్ఠగా పాటిస్తే అపూర్వ ఫలితాన్నిస్తుందని తెలిపే ఉదంతమిది.

- తుషార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని