108 ప్రదక్షిణలతో సర్వదోష నివారణ

ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో ఉంది.

Updated : 10 Dec 2022 19:38 IST

ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో ఉంది. ప్రచారంలో ఉన్న కథలను అనుసరించి పూర్వం ఇక్కడ మహర్షులు తపస్సు చేసేవారు. శ్రీకృష్ణదేవరాయల గురువైన శ్రీవ్యాసరాయలు సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. 2008లో శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని గణపతి సచ్చిదానంద దర్శించి జీర్ణోద్ధణకు పూనుకుని శివపార్వతుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మూలవిరాట్టులో 5 రూపాలు స్ఫురిస్తాయి. పైభాగంలో సింహధ్వజం, నరసింహావతారం, విష్ణుతత్వం, కృష్ణదేవరాయల రాజముద్ర, మధ్యభాగంలో లింగాకృతిలో స్వామివారు దర్శనమిస్తారు. కింద భాగాన పార్వతీదేవిని సూచించే చక్రం కనిపిస్తుంది. శివుడి పరివారమంతా ఒకే విగ్రహంలో కనిపించడం విశేషం.

ఈ ఆలయంలో ఆది, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తే నాగదోషం, కాలసర్పదోషం, రాహుకేతుదోషాలు తొలగడంతో పాటు కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయం అనంతపురం నుంచి కల్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో కొలువై ఉంది. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.
పి.పవన్‌ కుమార్‌ రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని