Updated : 05 Jan 2023 00:28 IST

అరటితో పరిపూర్ణఫలం

ఓ సాయంసంధ్య వేళ దుర్వాసుడు ఆదమరచి నిద్రపోతున్నాడు. సంధ్యావందన సమయం మించిపోతోందని భార్య కదళి నిద్రలేపింది. ఉలిక్కిపడి లేవడంతో దుర్వాసుడి కళ్లలోంచి కోపాగ్ని వెలువడి ఆమె భస్మమైంది. కొన్నాళ్లకు మామగారు ఇంటికొచ్చారు. ఆయనకు కోపం రాకుండా తన భార్య కదళిని శుభకార్యాల్లో వినియోగించేలా వరమిచ్చాడు. అప్పటి నుంచి కదళీఫలం శుభసూచకమైంది. మరో కథ ప్రకారం సావిత్రి అనే శక్తిదేవత తన అందానికి గర్వించడం చూసి విరాట్‌ స్వరూపుడు ఆమెను భూలోకంలో బీజం లేని చెట్టుగా జన్మించమని శపించాడు. తన తప్పు తెలుసుకున్న సావిత్రి శాపవిముక్తి కోసం తపస్సు చేయగా కదళీ ఫలంగా మాధవసేవలో తరించమని వరమిచ్చాడు. అలా ఆశీర్వదించిన పర్వదినమే మాఘకృష్ణ చతుర్దశి లేదా అరటి చతుర్దశి. అరటిపండు పూర్ణఫలం. అరటి ఎంగిలి విత్తనాలతో కాకుండా పిలకలతో విస్తృత మవుతుంది. అలా దేవుడికి నివేదించే శ్రేష్ఠత పొందింది. అరటాకులో తినడం ఆరోగ్యదాయకం. భోజనంలో విషం ఉంటే ఆకు నల్లబడుతుంది. రామాయణంలో అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని భరద్వాజుడు సీతారాములకు వివరించాడు. ఆ మహర్షి ఇంట భోజనానికి ఉపక్రమించి నప్పుడు మారుతికి అరటాకు తక్కువైంది. రాముడు ఆంజనేయుణ్ణి తనకు కుడివైపున కూర్చోమన్నాడు. భరద్వాజుడు కాదనలేక ఒకే ఆకులో ఇద్దరికీ వడ్డించాడు. ఆనాడు రాముడు ‘అరటాకులో అరటిపండ్లను నివేదించిన వారికి మా ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి’ అన్నాడు. అరటిచెట్టును దేవగురువు బృహస్పతిగా భావిస్తారు. అరటి విష్ణువుకు అత్యంత ప్రీతికరం. గురువారం అరటిచెట్టును పూజించేవారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మాంగళ్యదోష నివారణకు శ్రేష్ఠం. ఆధ్యాత్మికంగానే కాదు ఆహారానికి, ఔషధానికీ పనికొచ్చే పెరటి సిరి అరటి.

 ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని