Updated : 05 Jan 2023 04:52 IST

హరిహర సుతయే శరణమయ్యప్ప

నల్లటి వస్త్రాలతో నలభై రోజుల దీక్ష. అయ్యప్ప గీతాలతో అలౌకికానందం. వీధివీధిలో పడిపూజలు. ఇంటింటిలో స్వామి భజనలు. శబరిమలై యాత్రలతో గురుస్వాముల సందడి. మకరజ్యోతిని దర్శించాలనే మనోవాంఛ.

ధనుర్మాసంలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన అయ్యప్ప స్వామి పందళదేశ రాజైన రాజ శేఖరుడికి అరణ్యంలో దొరికాడు. హరిహర సుతుడు అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం.. దీర్ఘకాలంగా సంతానం లేని రాజుకు సంతానం కలిగింది. కానీ మహారాణి లేనిపోని అనుమానాలతో తలనొప్పి నటించి పులిపాలు తీసుకురమ్మని అయ్యప్పను అరణ్యానికి పంపింది. కథ సాగుతూనే ఉంది.. మనసు మాత్రం మొదటి పదం దగ్గరే తచ్చాడుతోంది. హరిహరసుతుడా? ఎలా సాధ్యం? ఇద్దరు పురుషులకు సంతానం కలగడమేంటి? విష్ణుమూర్తి మోహినిగా మారాడు, సరే! కానీ కాముని కాల్చిన కామేశుడు కామపరవశుడై మోహని వెంట పడటమా? ఎంతమాట! ఇలా ఎన్నో సందేహాలు మేధను మథనం చేయడం సహజమే! కానీ, భగవంతుణ్ణి అర్థం చేసుకోవా లంటే తత్వపరంగా ఆలోచించాలే గానీ సామాన్యార్థంలో స్త్రీ పురుష పరంగా కాదు.

క్షీరసాగర మథనంలో విషాన్ని గ్రహించిన అనంతరం పరమశివుడు తిరిగి తపోనిష్ఠలోకి వెళ్లాడు. నారదుడి ద్వారా తర్వాత జరిగిన ఘటనలన్నీ తెలిశాయి. ప్రత్యేకించి నారాయణుడి మోహినీ అవతారం. లోక కంటకి మహిషి సంహారార్థం మోహిని తనను ఆకర్షించింది. అది అనివార్యమైనా అనైతికం కాకూడదనే శక్తిరూప మోహినిగా అవతరించాడు విష్ణుమూర్తి.

క్రోధేచ కాళీ సమరే చ దుర్గా

భోగే భవానీ పురుషేషు విష్ణుః

శక్తి పురుష రూపాన్ని ధరిస్తే విష్ణువు. విష్ణు మూర్తి మోహిని రూపం ధరిస్తే అది శక్తి. ఆ శివశక్తుల కలయికే హరిహరసుత అయ్యప్ప. ఈ అద్వైత వెలుగులో దర్శించినప్పుడు మన సందేహాలు పటాపంచలవుతాయి. జిల్లెళ్లమూడి అమ్మ చెప్పినట్టు రెండులా కనిపించినా, ఒకటిలా అనిపించడమే అద్వైతం. మరింత లోతుకు వెళ్తే శివకేశవులు కూడా ఒకే శక్తికి భిన్న రూపాలని అర్థమవుతుంది.

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే

శివస్య హృదయం విష్ణుః విష్ణుశ్చ హృదయం శివః

స్కందోపనిషత్‌లోని ఈ శివకేశవ అభేద రూపమే అయ్యప్ప అవతారం. భూతనాథోపాఖ్యానంలో మహిషి పూర్వజన్మ వృత్తాంతం కనిపిస్తుంది. బ్రహ్మ మహిషికి ప్రసాదించిన వరం ప్రకారం, రాజశేఖరుడికి పన్నెండేళ్లు పుత్రుడిగా సేవచేసి, తల్లి కోసం పులి పాలు తీసుకురావడమే కాదు పులిమీద స్వారీ చేశాడు అయ్యప్ప. తండ్రి రాజ్యం ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరించాడు. ఈ సంఘటనల వెనుకున్న అంతరార్థాన్ని గమనిస్తే తమోగుణానికి ప్రతీకైన మహిషిని సంహరించి, రజోగుణానికి ప్రతీకైన పులిపై పట్టు సాధించి, పాల వంటి స్వచ్ఛమైన సాత్వికమార్గంలో పయనించి, రాజ్యాన్ని తిరస్కరించి త్రిగుణాతీత స్థితికి చేరినవాడు అయ్యప్ప.

యోగిక రూపం

వీరాసనంలో కూర్చుని యోగపట్టం ధరిస్తాడు అయ్యప్ప. ఈ స్థితి యోగక్రియకు చాలా అనుకూలమైంది. మూలాధారం నేలను స్పృశిస్తూ సహస్రారం వరకు వెన్నెముక నిటారుగా ఉంటుంది. ఆసనంలో స్థిరత్వానికి యోగపట్టం సహకరిస్తుంది. ఇందులో చిన్ముద్ర తప్పితే ఆయుధధారణ ఉండదు.

నామవైశిష్ట్యం

ఆర్యన్‌ శబ్దానికి వికృతి రూపం అయ్య. అంటే తండ్రి, గురువు. అప్ప అన్నా తండ్రే. తల్లిదండ్రుల స్థానంలో ఇద్దరు తండ్రులను కలిగిన అయ్య-అప్ప కలిసి అయ్యప్ప. తల్లిలా లాలన పాలన, తండ్రిలా రక్షణ పోషణ బాధ్యతల్ని వహించేవాడు అయ్యప్ప స్వామి.

పూర్ణ - పుష్కల

నైష్ఠిక బ్రహ్మచారియైన అయ్యప్పకు పూర్ణ, పుష్కల అనే దేవేరు లున్నారనేది పురాణ కథనం. దీన్ని కూడా తాత్వికపరంగా అర్థం చేసుకోవాలి. భక్తులను పూర్ణంగా, పుష్కలంగా అనుగ్రహిస్తాడని భావం. బ్రహ్మచారి అయిన గణపతి భార్యలుగా సిద్ధి, బుద్ధిలకు మల్లేనే ఇది. మహిషి తన తామసత్వాన్ని విడిచి మాలికా పురతమ్మగా జన్మించి స్వామిని పెళ్లాడమని కోరినపుడు, కన్నె స్వాములు శబరిమలై రాని సంవత్సరం వివాహమాడుతానని అయ్యప్ప స్వామి వరమిచ్చాడట.

అయ్యప్ప దీక్షధారణ

అయ్యప్ప నడిచిన మార్గాల్లో నడవటమే అయ్యప్పదీక్ష. దీక్ష వహించేవారు సాక్షాత్తు భగవత్స్వరూపమే. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని ‘దీక్షిత’ నామంతో పూజిస్తాం. దీక్షా సమయంలో గ్రహదోషాలు తొలగడానికి నలుపు దుస్తులు, దేహాభిమానాన్ని పోగొట్టుకోవడానికి భస్మధారణ, భోగత్యాగం కోసం భూశయనం, నిర్మల చిత్తం కోసం సాత్వికాహారం, ఇంద్రియ నిగ్రహానికి బ్రహ్మచర్యం. ‘సమం సర్వేషు భూతేషు.. సర్వం బ్రహ్మమయం జగత్‌’ అనే భావన కోసం ‘స్వామి’ సంబోధన. ఐహిక, ఆముష్మిక సాధన కోసం బ్రహ్మరంధ్ర స్థానంలో ఇరుముడులను ధరించటం, శివకేశవులకు ప్రతీకగా భస్మధారణ చందన తిలకం. ఇక పంచతన్మాత్రలు, అష్టరాగాలు, త్రిగుణాలు, అవిద్య, విద్యలైన- ఈ పద్దెనిమిదింటిని జయించడానికి ప్రతీకగా 18 మెట్ల అధిరోహణం. వీటన్నింటినీ జీవితంలో భాగం చేసుకోవడానికి 40 రోజుల మండలదీక్ష. వెరసి జీవుడు దేవుడిగా పరిణామం చెందడానికి సాగించే ప్రయాణమే అయ్యప్పదీక్ష. సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తు చెబుతున్న ‘తత్త్వమసి’ వాక్యానికి క్రియా రూపమిది. ఈ ధర్మమార్గాన్ని శాసించినవాడు కాబట్టి అయ్యప్ప శాస్త, ధర్మ శాస్త, మహాశాస్త. కొందరు భావిస్తున్నట్లు అయ్యప్ప రూపం అర్వాచీనమైనదేమీ కాదు. స్వామి జన్మరహస్యం, తత్వచింతన, యోగమార్గ విశేషాలు. ఇవన్నీ బ్రహ్మాండ, స్కంద పురాణాల్లో, శివరహస్యాది గ్రంథాల్లో చూడొచ్చు. ఆధ్యాత్మిక చింతనతో సత్పవ్రర్తన వైపు నడిపించే ఐహిక ఆముష్మిక జ్యోతి దర్శనం అయ్యప్ప దీక్ష.

డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు