సేవతో తరించాలి

కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే మానవ జన్మ ప్రాప్తిస్తుందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

Published : 19 Jan 2023 00:14 IST

కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే మానవ జన్మ ప్రాప్తిస్తుందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పుట్టింది మొదలు మట్టిలో కలిసే వరకు సమాజం మీద ఆధారపడి జీవిస్తున్నాం. దీన్నే సంఘ రుణమంటారు. అది తీర్చుకోవలసిన బాధ్యత ఉంది. అందుకుగానూ సేవాగుణం, సత్ప్రవర్తన అవసరం. ‘విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత’- అన్నట్టు భక్తితో చేసిన సేవ కొంచెమైనా కొదువ కాదు. మనం తీర్చుకోవాల్సిన రుణాల్లో ముఖ్యమైంది తల్లి దండ్రుల రుణం. వారికి వృద్ధాప్యంలో అన్నవస్త్రాలు ఇచ్చినంతలో సరిపోదు. మనోవాక్కాయకర్మలతో తల్లిదండ్రులపట్ల భక్తి ప్రపత్తులు చూపించాలి. మాంసం అమ్మి బతికే ధర్మవ్యాధుడు, తన వృద్ధికి కారణమైన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో చేసిన సేవ కౌశిక మహర్షికి కనువిప్పు కలిగించింది. సమాజంలో అనాథలు, అభాగ్యులు, రోగులు వంటి విధివంచితుల సేవ మన కర్తవ్యమని తుకారాంజీ జీవిత చరిత్ర బోధపరుస్తుంది. అందరూ అసహ్యించుకున్న కుష్ఠురోగికి దయతో సేవ చేసిన గాంధీ మహాత్ముడు మనకు ఆదర్శప్రాయం. ఇదంతా భక్తితో చేయాల్సిన సేవ. దైవంగా భావించి తరించాలి. అందుకే మానవ సేవే మాధవసేవ అంటారు. పురాణేతిహాసాలు కూడా అదే నిజమని నిరూపిస్తున్నాయి.

బెహరా ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని