సమాజమే ఆలయం సంస్కరణే నివేదన

దేవుడెక్కడుంటాడు? ఉంటే ఎలా పూజించి అనుగ్రహం పొందాలి?- అనే సందేహాలు మనలో కలుగుతుంటాయి. మనిషి మహోన్నతుడిగా ఎదిగే క్రమంలో ప్రశ్నించే తత్వం అలవడుతుంది. అది  చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తుందన్నది వేదాల సారం. ఇలా నడిచి మనకు దిశానిర్దేశం చేసిన జ్ఞానమూర్తి స్వామి దయానంద సరస్వతి.

Updated : 09 Feb 2023 02:05 IST

 

ఫిబ్రవరి 12  స్వామి దయానంద సరస్వతి జయంతి

దేవుడెక్కడుంటాడు? ఉంటే ఎలా పూజించి అనుగ్రహం పొందాలి?- అనే సందేహాలు మనలో కలుగుతుంటాయి. మనిషి మహోన్నతుడిగా ఎదిగే క్రమంలో ప్రశ్నించే తత్వం అలవడుతుంది. అది  చీకటి నుంచి వెలుగు వైపు నడిపిస్తుందన్నది వేదాల సారం. ఇలా నడిచి మనకు దిశానిర్దేశం చేసిన జ్ఞానమూర్తి స్వామి దయానంద సరస్వతి.

యానంద సరస్వతి మహోన్నత జీవిత ప్రస్థానం ప్రశ్న నుంచే ప్రారంభమైంది. తండ్రి అడుగుజాడల్లో వైదిక విద్యలు నేర్చుకున్నా రాయన. అసలు పేరు మూశంకర్‌. సంధ్యావందనం, పూజలు, ఉపవాసాలు, వేద, స్తోత్ర పారాయణలతో కాలం గడిచేది. ఇంతలో కలరా మహమ్మారి తానెంతగానో ప్రేమించే చెల్లిని, మేనమామను పొట్టన పెట్టుకుంది. ఆ దుఃఖంలోంచి.. ఈ మరణమేంటి? దీన్ని జయించలేమా? చనిపోకుండా ఉండే వీల్లేదా- అనే ప్రశ్నలు ఎంత కుదిపేసినా.. బహుశా బాల్యం కారణంగా ఎవరికీ చెప్పలేకపోయారు.

ఎలుక తిప్పిన మలుపు

ఓ శివరాత్రి నాడు పూజ చేసి ఉపవాసం ఉన్నారు. జాగరణ చాలామంది మొదలుపెట్టారు కానీ కొంతసేపటికి అంతా నిద్రపోయారు. కానీ స్వామి మాత్రం అటూఇటూ తిరుగుతూ, నీళ్లతో ముఖం తుడుచుకుంటూ నిద్రను ఆపుకుంటున్నారు. అర్ధరాత్రి పూజగదిలో శబ్దమైతే తొంగి చూశారు. ఓ ఎలుక శివలింగం మీద గెంతుతుంటే ఆశ్చర్యపోయారు. శివుడంటే దేన్నయినా శాసించగలవాడు కదా! కానీ ఇదింత నిర్లక్ష్యంగా తనమీద ఎక్కి దూకుతుంటే పట్టించుకోడేంటి? అసలు శివుడున్నాడా, ఉంటే ఎక్కడ ఉంటాడు- అనే ప్రశ్నలు ఆయన్ను నిలవనీయలేదు. అంతే... ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. అలా 1845లో ఇంటి నుంచి బయల్దేరిన దయానంద సరస్వతి దాదాపు పాతికేళ్లు సత్యాన్వేషణలోనే జీవితం గడిపారు. అడవులు, హిమాలయాలు, ఉత్తరభారతంలోని పుణ్యక్షేత్రాలు, యాత్రాస్థలాల్లో ఉన్న యోగులను కలుసుకుంటూ తన ప్రశ్నలకు సమాధానం కోసం అంతటా గాలించారు.

ఎదురుచూసిన గురువు.. కర్తవ్య బోధ

ఈ అన్వేషణ కాలంలోనే అనేక యోగాలను అభ్యసించారు. చివరికి మంచి శిష్యుడి కోసం చూస్తున్న విరాజానంద దందీషాకి శిష్యుడయ్యారు. ఆ గురువు ఇచ్చిన సమాధానాలు తృప్తినిచ్చాయి. ఆయన వేదోపనిషత్తులు, సనాతన ధర్మ విశేషాలు బోధించారు. హిందూ మత ప్రత్యేకతను, మనదేశం ప్రపంచానికి దారిదీపంగా నిలవడాన్ని వివరించారు విరాజానంద. అలాగే హిందూమతం చారిత్రక మూలాల నుంచి దూరమైందని, కొన్ని పద్ధతులు అపవిత్రంగా మారాయని.. తాను గమనించిన అంశాలను విశ్లేషించి శిష్యుడికి కర్తవ్యదీక్ష బోధించారు. ఆయన పెట్టిన పేరే దయానంద సరస్వతి. ఆ పేరుతోనే దేశోద్ధరణకు, ఆధ్యాత్మిక సంస్కరణకు పూనుకున్నారు. హిందూ విశ్వాసంలో వేదాలకు సరైన స్థానాన్ని కల్పించేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తానన్న మాటనే గురుదక్షిణగా సమర్పించి ముందుకు కదిలారు.

సంఘసంస్కరణ

గురువు చెప్పినట్టే నాటి సమాజం మతమౌఢ్యంతో, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలతో కనిపించింది. వేదోపనిషత్తులకు వక్రభాష్యాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేవారితో దేశం నిండిపోయింది. ముందుగా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని వర్గాల వారిని కలిసి స్నేహపూర్వకంగా చర్చించారు. మెల్లగా మార్పు రావటం కనిపించింది. వేదాలు విజ్ఞాన గనులంటూ వివరించి... వాటిని ఏ విధమైన వివక్ష లేకుండా అందరూ చదవొచ్చని ప్రతిపాదించారు. సాంఖ్య, వైశేషిక, న్యాయ, తదితర దర్శనాలు, పతంజలి యోగ సూత్రాలు, పూర్వమీమాంస, ఐతరేయ, శతపథ, సామ, గోపథ తదితర బ్రాహ్మణాల్లోని విజ్ఞానాంశాలను వివరించి చైతన్యపరిచారు. పరమాత్మ, జీవాత్మ, సృష్టి ఈ మూడు అస్తిత్వాలే శాశ్వతమనే సత్యాన్ని, సచ్చిదానంద తత్త్వాన్ని బోధించారు.

సామాజిక రుగ్మతలపై సమరం

వేదాల స్ఫూర్తికి విరుద్ధమైన కులం, పురుషాధిక్యం, లింగవివక్ష, సతీసహ గమనం, విగ్రహారాధన, బాల్య వివాహం.. తదితర దురాచారాలను ఖండిస్తూ ఉద్యమం సాగించారు. జగత్‌ సత్యాన్ని బోధిస్తూ 14 అధ్యాయాల సత్యార్థ ప్రకాశ్‌ గ్రంథం రాశారు. ఇందులో పరమేశ్వరుడి నామాల వ్యాఖ్య, సంతానం, బ్రహ్మచర్యం, సత్యాసత్య విశేషాలు, వివాహం, గృహస్థాశ్రమం, వానప్రస్థ సన్యాసాశ్రమ విధులు, రాజధర్మాలు, వేద సంగతులు, జగత్తు ఉత్పత్తి, స్థితి ప్రళయాలు, విద్య, అవిద్య, బంధ మోక్షాల వ్యాఖ్య, ఆచార అనాచారాలు, ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు తదితర అంశాలున్నాయి.

ఆర్యసమాజ స్థాపన

తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా, సంఘసంస్కరణకు పునాదిగా, 1875 ఏప్రిల్‌ 10న ముంబయి నగరంలో ఆర్యసమాజం ఆరంభించారు. ఇది నేటికీ మహర్షి బోధనలకు అనుగుణంగా పనిచేస్తోంది. హిందూధర్మ పునరుద్ధరణ అన్న పిలుపుకు స్వామి నాంది పలికారు. అంతేకాదు మనదేశం పరాయి పాలన నుంచి విముక్తి పొందాలని మొదట గొంతెత్తిన దయానంద ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు మార్గదర్శకుడు. ఆయన 1883 అక్టోబరు 30న మూఢుల విషప్రయోగంతో ప్రాణాలు కోల్పోయినా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నారు. దయానంద చెప్పినట్లు సమాజమే దేవాలయం, సంస్కరణే పూజా విధానమని ఇప్పటికీ అనుసరిస్తున్నారు శిష్యకోటి.

డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు