మానవ పతాక మాధవ ప్రతీక జిల్లెళ్లమూడి అమ్మ

సర్వజీవ కారుణ్యం, సర్వత్రా అనురాగం, సర్వసామర్థ్యం, సర్వజ్ఞత్వం, లోకాతీత సౌందర్యం, నిరవధిక వాత్సల్యాలు మానవాకృతి ధరిస్తే.. ఆ ముగ్ధ మనోహర స్నిగ్ధ ప్రేమైకమూర్తే అమ్మ.

Updated : 23 Feb 2023 03:38 IST

సర్వజీవ కారుణ్యం, సర్వత్రా అనురాగం, సర్వసామర్థ్యం, సర్వజ్ఞత్వం, లోకాతీత సౌందర్యం, నిరవధిక వాత్సల్యాలు మానవాకృతి ధరిస్తే.. ఆ ముగ్ధ మనోహర స్నిగ్ధ ప్రేమైకమూర్తే అమ్మ.

లోకంలో సిద్ధయోగులు సాధ్యయోగులు అని రెండు రకాలున్నారు. జిల్లెళ్లమూడి అమ్మ సిద్ధ యోగి. సాధ్యయోగుల జీవితంలో సాధన ఉంటుంది. దాని ద్వారా వారు లోకంలో ఎక్కువ ప్రసిద్ధిని పొందుతారు. కానీ సిద్ధయోగులు జన్మతః యోగులు. వారి జీవితంలో సాధన కనిపించదు. అందుకని లోకంలో సాధ్యయోగులకు ఉన్నంత ప్రచారం సిద్ధయోగులకు కనిపించదు.

‘సంభవామి యుగేయుగే..’ అని భగవంతుడు రాముడిగా, కృష్ణుడిగా అవతరించినట్లే.. ఆధ్యాత్మిక రంగంలో సామ్యవాదాన్ని ప్రవేశపెట్టి సకల జీవ రాశులనూ కన్నబిడ్డల్లా ఆదరించిన వాత్సల్యవర్షిణి జిల్లెళ్లమూడి అమ్మ.

నేను ప్రేమించాలి!

గుంటూరు జిల్లా మన్నవలో 1923 చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జన్మించిన అమ్మలో సహజం గానే ఆధ్యాత్మిక చింతన ఉండేది. ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధులైన వాసుదాస స్వామి వారికి ఐదేళ్ల వయసులో ఉన్న అమ్మను ‘తల్లి లేని బిడ్డ’గా పరిచయం చేశారు. ఆయన నవ్వుతూ ‘అందరూ నిన్ను ప్రేమించేలా దీవించనా?’ అంటే.. ‘నన్నెవరు ప్రేమించినా, ప్రేమించకున్నా అందరినీ నేను ప్రేమించేట్లు దీవించండి స్వామీ’ అందామె. పుడుతూనే పరిమళించడమంటే ఇదేగా!

వివాహానంతరం జిల్లెళ్లమూడి గ్రామంలో అడుగుపెట్టిన అమ్మ తన ఇంటిని అందరిల్లుగా చేసింది. కన్నతల్లిలా లోకులందరినీ ప్రేమగా ఆదరించిన అపరిమిత మమకారం అమ్మది. ఆ వాత్సల్యాన్ని గుర్తించి వచ్చినవారికి అమ్మ స్వయంగా వండిపెట్టేది. కానీ యాత్రికుల సంఖ్య వేలకు చేరడంతో 1956లో ‘అన్నపూర్ణాలయం’ స్థాపించారు. 1973లో లక్షమందికి ఒకే పంక్తిన భోజనం పెట్టారు. మాతృశ్రీ విద్యాసంస్థల ద్వారా అర్ధ శతాబ్దంగా వేలాది మంది విద్యార్థుల జ్ఞానతృష్ణను తీరుస్తున్నారు. ఇదంతా అమ్మకు ఒక పార్శ్వం. అమ్మ జ్ఞానస్వరూపిణి. ఆమె అనుభవం అపారం, మేధ సునిశితం, వాక్కు సరళం, హృదయం దయార్ద్రం.

సిసలైన కారుణ్యం

నిరతాన్నదానం చేస్తున్న ఆశ్రమంలో డబ్బు దండిగా ఉంటుందని ఒకసారి నక్సలైట్లు దాడి చేశారు. తర్వాత పోలీసులు వాళ్లని అమ్మ దగ్గరకు తీసుకురాగా ‘మీ నుంచి తప్పించుకునే కంగారులో వాళ్లు తిన్నారో లేదో! ముందు అన్నం పెట్టండి’ అంది. ‘అంత అరాచకం చేసిన వాళ్లకు అన్నం పెట్టాలా?’ అనడిగితే ‘ఒక తల్లికి ముగ్గురు బిడ్డలుంటే ఒకడు ఇస్తే తీసుకుంటాడు, మరొకడు అడిగి తీసుకుంటాడు, ఇంకొకడు ఆగడం చేసి తీసుకుంటాడు. వీళ్లు మూడో రకం నాన్నా’ అంటూ బదులిచ్చిన కరుణామూర్తి.

విజ్ఞానగని

అమ్మ ప్రేమమూర్తిగా, దయామయిగా అందరికీ సుపరిచితమే కానీ జ్ఞానసింధువుగా కొందరికే తెలుసు. ‘అహం బ్రహ్మాస్మి’, ‘తత్త్వమసి’, ‘అయమాత్మా బ్రహ్మ’, ‘ప్రజ్ఞానం బ్రహ్మ’- అంటూ మహర్షులు మనకందించిన ఈ వేదవాక్యాలు తత్వసార మందిరానికి నాలుగు వాకిళ్లు. వీటి సారాన్ని తేలికైన మాటలతో అందరికీ అర్థమయ్యేలా చెప్పడాన్ని బట్టి ఆమె లోతైన విజ్ఞానగని అని స్పష్టమవుతుంది.

వేద సాక్షాత్కరణ

‘నేను నేనైన నేను’ అన్న అమ్మ మాట విశ్వతాదాత్మ్య స్థితికి అక్షరరూపం. పండితులు, పామరులు, ధనికులు, పేదలు.. అందరిలో నేనుగా వెలుగొందుతున్న చైతన్యం అంతా తానేనని చెప్పిన అమ్మ మాటల్లో స్ఫురించేది ‘అహం బ్రహ్మాస్మి’యే. ఓ భక్తుడు అమ్మ పాదాల వంక చూస్తూ ‘అమ్మా! బ్రహ్మ కడిగిన పాదాలు ఇవేనా?’ అంటే.. ‘మీరంతా బ్రహ్మలే కద నాన్నా’ అని బదులిచ్చింది. ఒకరు ‘మీది అమ్మవారి అవతారమా?’ అంటే ‘మీరు కానిది నేనేదీ కాదు’ అంది. ‘తత్త్వమసి’కి నిలువెత్తు నిదర్శనం ఈ భావన.

వివేకానందుడికి రామకృష్ణ పరమహంస చూపి నట్లు తనకు దైవాన్ని చూపమని ఒకరడిగితే ‘కనిపించేదంతా అదే అయినప్పుడు ప్రత్యేకంగా దేన్ని చూపించమంటావు నాన్నా?!’ అనడంలో ‘అయమాత్మా బ్రహ్మ’ అన్న వేద వాక్యమే స్ఫురిస్తుంది. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అన్న సంప్రదాయ భావనతో అమ్మ ఏకీభవించలేదు. ఆమె హృదయం మరింత విశాలమై, దృష్టి మరింత తేజోవంతమై, బోధ మరింత సంపన్నమై ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరింపచేసింది. జ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానమూ బ్రహ్మేనని, ఆనందో బ్రహ్మ అంటే బాధ కూడా భగవంతుడేననీ ప్రవచించింది.

ఆదిశక్తే అమ్మగా..

సంప్రదాయ వేదాంతం సృష్టిలోని సగభాగాన్ని సత్తుగా, మిగిలిన సగాన్ని అసత్తుగా వివరిస్తే ‘సృష్టిలో అసత్తు, జడం లేవు.. అంతా చైతన్యమే’ అంటూ ఆధ్యాత్మికతకు పూర్ణత్వాన్ని చేకూర్చింది అమ్మ. అందుకే భౌతిక శాస్త్రవేత్త, తత్వవేత్త శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ‘ఆధ్యాత్మిక గగనంలో నెలవంకలనే చూస్తాం. కానీ జిల్లెళ్లమూడిలో పూర్ణచంద్రుణ్ణి దర్శించగలం’ అన్నారు.

అమ్మ మాటలు నేల విడిచి సాము చేసినట్లు ఉండవు. ‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పంచు’ అన్నది ఆమె సందేశం. ఇంత కంటే ప్రబోధ ఇంకేముంటుంది? అమ్మ జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆమెలో అంతులేని వాత్సల్యం, అపార విజ్ఞానం సాధనతో సంక్రమించలేదు, జన్మతః కలిగినవే అని అర్థమవుతుంది. ఆదిశక్తి అయిన పరమేశ్వరి లీలావిలాసంగా మన మధ్య మానవియై మెలిగేందుకు ధరాతలానికి విచ్చేసిన అవతారమూర్తి జిల్లెళ్లమూడి అమ్మ. ఆమె శత జయంతి సంవత్సరం ఇది. ఆ ప్రబోధాలను స్మరించే సమయమిది.

డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని