ప్రకృతి పరవశం.. ఉగాది సంబరం
నేడు ఉగాది
తెలుగు సంవత్సరాది ఉగాది. జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలూ, మమతల పరిమళాలు పంచే ప్రసూనాలతో ఆహ్లాద వాతావరణం. కష్టాల వడగాడ్పులకు చలించక చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం. ఒక్కోసారి ఆశల ఆకులు రాలినా మళ్లీ చిగురు తొడుగుతుందనే ధీమా. నవ జీవితానికదే నాంది, మరెన్నో ఉగాదులకు పునాది.
చైత్ర మాసంలో ప్రకృతి సప్త వర్ణ శోభితం అవుతుంది. మోడువారిన తరువులు చిగురాకుల చీరలు చుట్టి హొయలుపోతాయి. అందాకా మూగబోయిన కోకిల గొంతు సవరించుకుని కిలకిలరావాలు పలికిస్తుంది. పల్లవాలు సోయగాలు పోతే మల్లెలు మధుర పరిమళాలు వెదజల్లుతాయి. ఎటు చూసినా ఆనందాలూ ఆహ్లాదాలతో హృద్యంగా ఉంటుంది. చైత్ర మాసాన్ని మధుమాసంగానూ పిలుచు కుంటాం. మధువు అంటే తేనె. జీవితం తేనెలా అమృతతుల్యం కావాలనేది ఆంతర్యం. పురాణాలను అనుసరించి బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించాడు. అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం ఆనవాయితీ.
అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్లఘృతైర్యుతం
భక్షితం పూర్వయామే తు తద్వర్షే సౌఖ్యదాయకం
శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం
ఉగాది రోజున మన శక్తికి తగ్గట్టుగా పూర్ణ కుంభదానం చేయడం శ్రేష్ఠం. వెండి, రాగి లేదా మట్టి పాత్రను నీళ్లతో నింపుతారు. అందులో గంధం, పూలు, అక్షతలు, మామిడి, వేప, మోదుగ, నేరేడు, అశోక తదితర పత్రాల చిగుళ్లు వేసి పూజిస్తారు. ఆ కుండను గురువులకు కానీ పెద్దలకు కానీ ఇంటి పురోహితుడికి గానీ ఇచ్చి వారి ఆశీస్సులను పొందుతారు.
చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని
శుక్లపక్షే సమగ్రం తు తదా సూర్యోదయే సతి
శ్రీమహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అంద జేశాడు. ఆ శుభదినమే ఉగాది అనే కథనమూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉగాదిని మత్స్య జయంతిగా వేడుక చేసుకునే ఆచారం ఉంది.
ఉగాది నాడు ఏం చెయ్యాలి?
ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమైన ఆ ప్రసాదం సేవించడం తోపాటు ఆచరించాల్సిన శాస్త్రోక్త విధులున్నాయి.
నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ప్రతి గృహ ధ్వజారోహణం
నింబ పత్రాశనం వత్సరాది శ్రవణం నవరాత్రారంభః
నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవత్ కీర్తనలు పాడుకుంటూ కాలక్షేపం చెయ్యాలి. ద్వారాలను తోరణాలతో అలంకరించాలి. తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు కలగలసిన పచ్చడిని ఆస్వాదించాలి. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే. ముఖ్యంగా వేపపూత శరీరంలో చేరిన క్రిములను నశింపచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనేందుకు ప్రతీకగా షడ్రుచులతో మిశ్రితమైన ఉగాది పచ్చడి సేవిస్తారు. ఎలాంటి అనుభవం ఎదురైనా స్థిరచిత్తంతో ఎదుర్కోవాలనే హితబోధ ఇందులో ఉంది. దాన్ని ఆరగించేముందు..
శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ఠ వినాశాయ నింబకం దళ భక్షణం
అనే శ్లోకం పఠించాలి. ఉగాది పచ్చడి సేవనంతో వజ్ర సమానమైన దేహం, దీర్ఘాయుష్షు లభిస్తాయన్నారు మహర్షులు.
ఆధ్యాత్మిక కోణం
బంధుమిత్రులతో జీవితాన్ని నిత్య నూతనంగా మలచుకోవడమే పర్వదినాల అంతరార్థం. ఉగాది కూడా అందరితో కలిసి వేడుకలా జరుపుకోవాలి.
అబ్దాదౌ బంధుసంయుక్తౌ మంగళస్నానమాచరేత్
వస్త్రై రాభరణై ర్దేహమలంకృత్య తత శ్శుచిః
ఉగాది కాల సంబంధమైన పర్వం కనుక ఆదిత్యుణ్ణి, విశ్వసృజనకు ఆరంభ దినం కాబట్టి సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాలి. అలాగే ఇష్టదేవతలను పూజించి, పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. శ్రీరామనవమిని తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించడం ఆచారం. దానికి ఆరంభదినం ఉగాదే.
రాబోయే సంవత్సరంలో ఎలాంటి మంచి చెడులు జరగబోతున్నాయో తెలుసుకునేందుకు ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేయడం పరిపాటి. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలనే ఐదింటి కలయిక. బ్రహ్మదేవుడి ఐదు ముఖాల్లో తూర్పు ముఖం నుంచి తిథి, దక్షిణ ముఖం నుంచి వారం, పశ్చిమ ముఖం నుంచి నక్షత్రం, ఉత్తర ముఖం నుంచి యోగం, ఊర్ధ్వముఖం నుంచి కరణం అనే ఐదు అంగాలు ఉద్భవించాయి.
పంచాంగం ఎలా పుట్టిందో తెలియజేసే మరో శ్లోకం కూడా ఉంది..
తిథిప్రోక్తం మనుబ్రహ్మ వారస్య మయసంభవం
నక్షత్రం త్వష్టృ రూపంచ శిల్పయోగం తదైవచ
దైవజ్ఞం కరణంచైవ ఇత్యేతత్ అంగలక్షణం
దీన్ని బట్టి తిథిని మను బ్రహ్మ, వారాన్ని మయబ్రహ్మ, నక్షత్రాన్ని త్వష్టృబ్రహ్మ, యోగాన్ని శిల్పిబ్రహ్మ, కరణాన్ని విశ్వజ్ఞబ్రహ్మ- ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారని అర్థమవుతోంది. ఈ పంచ బ్రహ్మలనే సనాతన బ్రహ్మలని పిలుస్తారు.
పంచాంగ శ్రవణం ఎందుకు?
తిథౌశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్థనం
నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం
కరణా త్కార్యసిద్ధిస్తు పంచాంగ ఫలముత్తమం
కాలా విత్కర్మకృత్ ధీమాన్ దేవతానుగ్రహం లభేత్
మనం ఏం చేసినా సత్ఫలితాలను ఆశిస్తాం. అందుకే పంచాంగ శ్రవణానికీ ప్రయోజనాలను కల్పించారు మహర్షులు. తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు, వార శ్రవణంతో దీర్ఘాయుష్షు, నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణం, యోగ శ్రవణమూలంగా రోగ నివారణ, కరణ శ్రవణ ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయన్నారు. కనుకనే ఉగాదినాడు పంచాంగ శ్రవణంతో తరిస్తారు.
తెలుగు వత్సరాల పేర్లకు తగిన ఫలితం ఆ ఏడాది లోకంలో ప్రతిఫలిస్తుందంటారు. మనమిప్పుడు ‘శోభకృత్’ నామ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. శోభకృత్ అంటే ప్రకాశాన్ని కలిగించేదని అర్థం. ఈ ఉగాది సార్థక నామధేయమై అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిద్దాం.
రామచంద్ర, కనగాల
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!