మీరు తేనెటీగలు!

ఓ భక్తుడు కొన్నాళ్లు రమణాశ్రమంలో గడిపాడు. సెలవు తీసుకుంటూ ‘మీ నుంచి ఎంతో దూరం వెళ్తున్నాను. నాకు మీ సన్నిధిలోనే గడపాలని ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతల వల్ల సాధ్యపడటం లేదు

Updated : 23 Mar 2023 03:53 IST

ఓ భక్తుడు కొన్నాళ్లు రమణాశ్రమంలో గడిపాడు. సెలవు తీసుకుంటూ ‘మీ నుంచి ఎంతో దూరం వెళ్తున్నాను. నాకు మీ సన్నిధిలోనే గడపాలని ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతల వల్ల సాధ్యపడటం లేదు. ఆశ్రమంలో మీతోబాటే ఉండే భక్తులు ఎంత భాగ్యవంతులో! మాలాంటి వాళ్లకు అంత అదృష్టం లేదు. కానీ ఎప్పటికైనా నేను కూడా ఇక్కడ మీతోనే ఉండిపోయేలా అనుగ్రహించండి’ అంటూ నమస్కరించాడు. అప్పుడు రమణ మహర్షి తమ సహజమందహాసంతో ‘ఇక్కడ ఉండే భక్తులకు ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం ఉందని చాలామంది భ్రమపడతారు. అటువంటి పక్షపాతం ఏదీ లేదు. చెంతనున్న వారి కన్నా దూరంగా ఉన్న వారికే ఆ అనుగ్రహం అధికంగా ఉంటుంది. భగవంతుడు మన మనసులో సంతోషం కంటే వ్యాకులతనే చూస్తాడు. కొలనులో తామరపువ్వుకి దగ్గరగా ఉన్నంతలో కప్పలు మకరందాన్ని ఆస్వాదించలేవు. దూరం నుంచి వచ్చి కూడా తేనెటీగలు ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తాయి. అలాగే సమీపంలోనే ఉండి గురువును సాధారణంగా భావించే వ్యక్తుల కన్నా దూరంగా ఉన్నప్పటికీ గుర్తించేవారే ధన్యులు. అందుకే మీరు తేనెటీగల వంటివారు. అలాగే కొనసాగండి. నేను భౌతికంగా ఇక్కడున్నా, నా చూపు మీ వైపే ఉంటుంది’ అంటూ ఆశీర్వదించారు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని