యద్భావం తద్భవతి

ఓ బాటసారి నీరసంగా చెట్టు కింద కూర్చుని ‘మంచి ఆహారం దొరికితే బాగుణ్ణు.. నా ఆకలి తీరుతుంది’ అనుకున్నాడు.

Published : 13 Apr 2023 00:24 IST

ఓ బాటసారి నీరసంగా చెట్టు కింద కూర్చుని ‘మంచి ఆహారం దొరికితే బాగుణ్ణు.. నా ఆకలి తీరుతుంది’ అనుకున్నాడు. వెంటనే రుచికరమైన ఆహారం వచ్చింది. తృప్తిగా తినడంతో నిద్ర ముంచుకొచ్చింది. మంచం ఉంటే బాగుండు అనుకున్నాడు. పట్టు పాన్పు ప్రత్యక్ష మయ్యింది. ఆత్మీయనేస్తం చెంతనుంటే బాగుంటుంది అనుకున్నాడు. అది కూడా నెరవేరింది. ‘ఇదేం మాయ? కోరుకున్నవన్నీ లభిస్తున్నాయి. ఈమె మంచిదేనా? దెయ్యమై నన్ను భయపెడితే?!’ అనుకున్నాడు. అంతే.. అందాకా స్నేహంగా ఉన్న స్త్రీ కాస్తా వికృతంగా మారడంతో వణికిపోయాడు. నిజానికి అతడు సేదతీరిన చెట్టు ఆశలు తీర్చే కల్పవృక్షం. అది తెలియక ప్రాణం కోల్పోయాడు.

కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ వెళ్లనవసరంలేదు. మనసులో స్థిరంగా ఉంటే ఆశలు  రూపుదాలుస్తాయి, అదే కల్పవృక్షం- అన్నారు మహర్షులు. బలమైన భావ తరంగాలకు అనంత శక్తి ఉంటుందని శాస్త్రవేత్తలూ చెబుతున్నారు. మన ఆలోచనలు మంచిగా ఉంటే పాజిటివ్‌ ఎనర్జీ, చెడుగా ఉంటే నెగెటివ్‌ ఎనర్జీ. మనమంతా కావలసిన దానికోసం ఆశపడతాం. కానీ అది దక్కుతుందా లేదా అనే భయం, అపనమ్మకం కలుగుతుంటాయి. వ్యతిరేక భావాలను పారదోలి అనుకూలతను పెంచుకుంటే.. అవి గొప్ప శక్తినిస్తాయి. అందుకే నిరంతరం మంచి పనులే చేయాలి. సద్భావనలను సదా ధ్యానించాలి. దైవమనే భావన కల్పితం కాదు. అది ఆశలకు స్ఫూర్తి కేంద్రం. మనోసీమలను చైతన్యపరిచే వెలుగు. దైవాన్ని మదిలో నిలుపుకుంటే చెడుకు తావుండదు.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని