పుణ్యప్రదం పుష్కర స్నానం

కృష్ణా, కావేరి, భీమా, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత తదితర పన్నెండు నదులు.. పన్నెండేళ్లకోసారి పుష్కరాలు.. నదీస్నానాలు, పితృకార్యాలతో కిక్కిరిసిపోయే పుష్కర ఘాట్‌లు.. ఇప్పుడిక తడిసి తరించేందుకు పావనగంగ  పుష్కర వైభవాలు.

Published : 20 Apr 2023 00:42 IST

కృష్ణా, కావేరి, భీమా, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత తదితర పన్నెండు నదులు.. పన్నెండేళ్లకోసారి పుష్కరాలు.. నదీస్నానాలు, పితృకార్యాలతో కిక్కిరిసిపోయే పుష్కర ఘాట్‌లు.. ఇప్పుడిక తడిసి తరించేందుకు పావనగంగ  పుష్కర వైభవాలు.

ప్రకృతిని దైవంగా ఆరాధించటం మన సంప్రదాయం. నదిని ప్రాణదాతగా సేవిస్తాం. పుష్కర శబ్దానికి పద్మం, పర్వతం, దేవతా కిరీటం, నదీజలం తదితర అర్థాలు ఉన్నప్పటికీ పన్నెండేళ్లు అనే అర్థంలో ఎక్కువగా ఉపయోగిస్తాం.

పూర్వం తన తీరంలో తపస్సు చేస్తున్న బృహస్పతికి నదీమ తల్లి అతిథి మర్యాదలు చేయలేదు. కోపించిన బృహస్పతి పవిత్రతను కోల్పోతావంటూ శపించాడు. ఆ పవిత్రత ఎలా వస్తుందని నది ప్రశ్నిస్తే ‘నా స్పర్శతోనే వస్తుంది, మూడున్నర కోట్ల నదులు నాలో లీనమౌతాయి. నువ్వూ నా వెంట రా’ అన్నాడు బృహస్పతి. సరేనంది నది. అలా బృహస్పతి ఆ సంవత్సరం ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరం వస్తుంది.

పుష్కర అంటే పుష్టినిచ్చేది. నదీజలానికి, అందులో స్నానం ఆమాచరించిన వారికి, ఆ నీటితో పండిన పంటలు అనుభవించిన వారికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి.. ఈ పన్నెండింటికీ పుష్టినిస్తుంది. తుందిలుడు తపస్సుతో శివుణ్ణి మెప్పించి అష్టమూర్తుల్లో ఒకటైన జలంలో తాను శాశ్వతంగా ఉండే వరంతోబాటు పుష్కర నామాన్ని పొందాడు. సృష్టికార్యంలో జలం అవసరమైనప్పుడు బ్రహ్మదేవుడి కమండలంలో చేరాడు. బృహస్పతి రమ్మని పిలిచినప్పుడు తనతో బ్రహ్మ కూడా రావాలని పంతంపట్టి, నెరవేర్చు కున్నాడు. ఆయా జీవనదులకు పుష్కరాలు జరిగే సంవత్సరంలో మొదటి పన్నెండు రోజులు, చివరి పన్నెండు రోజులు, ప్రతిరోజూ అపరాహ్ణంవేళ బృహస్పతితో పాటుగా మూడున్నరకోట్ల తీర్థాలు, పుష్కరుడు(తుందిలుడు), సర్వ దేవతలు, రుషులు, పితృదేవతలు నదిలో ప్రవేశిస్తారు. కనుక ఆ సమయాల్లో నదీస్నానం చేస్తే 128 జన్మల పాపాలు నశిస్తాయి. దానానికి లక్షరెట్లు ఫలితం. జపాలు, తర్పణాలు అంతులేని ఫలితాన్నిస్తాయి. పుణ్యం మాటెలా ఉన్నా ప్రవహించే నీటిలో స్నానంవల్ల బలం, ఉత్తేజం కలుగుతాయి. నీళ్లలో అంతర్లీనంగా ఉన్న విద్యుచ్ఛక్తిలానే నీటి విలువ పెంచే పుష్కరశక్తిని గుర్తించటం కష్టం.

ఆధ్యాత్మికత.. ఆత్మీయత

ఒక నది ఘనతను, పవిత్రతను పుష్కరాల సందర్భంగా గుర్తుచేసుకుంటాం. దాంతో నది మీద గౌరవం, భక్తి పెరుగుతాయి. అప్పుడు నదిని కలుషితం చేయడానికి, దుర్వినియోగ పరచడానికి భయపడతాం. ఆ విషయం మరుగున పడకుండా ప్రతి పన్నెండేళ్లకీ పుష్కరాల పేరుతో గుర్తుచేసినట్లవుతుంది.

 పుష్కర నదితోపాటు, సమీప దేవాలయాలను స్మరించుకుంటాం, దర్శించుకుంటాం. నదీ తీరాన ఉన్నవారు పుష్కర విధులను నిర్వర్తించేందుకు బంధుమిత్రులను ఆహ్వానించటం, ఏర్పాట్లు చేయటంతో ఆధ్యాత్మికత, ఆత్మీయత వృద్ధిచెందు తాయి. కుంభమేళాకి వెళ్లలేనివారు ఉన్నచోటే పుణ్యం పొందుతారు. మూడున్నరకోట్ల తీర్థాలతో కూడి బ్రహ్మాదులతోపాటు పుష్కరుడు మన సమీప నదిలో ప్రవేశించి అనుగ్రహిస్తాడన్నమాట.

బృహస్పతి ప్రవేశించిన రాశి అధిపతిగా కలిగిన జీవనది పుష్కరవైభవాన్ని సంతరించుకుంటుంది. మేషంలో గంగ, వృషభంలో నర్మద, మిథునంలో సరస్వతి, కర్కాటకంలో యమున, సింహరాశిలో గోదావరి, కన్యారాశిలో కృష్ణానది, తులారాశిలో కావేరి, వృశ్చికలో భీమ, ధనుస్సులో తపతి, మకరరాశిలో తుంగభద్ర, కుంభరాశిలో సింధు, మీనంలో ప్రాణహిత నదులకు పుష్కరవైభవం కలుగుతుంది.

సహస్రముఖాల గంగ

విష్ణువు పాదాల నుంచి పుట్టిన గంగ హిమవంతుడి పుత్రికగా భూలోకంలో అవతరించింది. పార్వతి సోదరి, మైనాకుడు సోదరుడు. దేవతల కోరికపై గంగ పాయ ఒకటి దేవ లోకం వెళ్లింది. భగీరథుడి తపో ఫలంగా ఒక పాయ శివుడి శిరస్సుపై పడి, భగీరథుడి వెంట వచ్చి భూమిని పావనం చేసి, పాతాళంలో సగర పుత్రుల భస్మం మీద ప్రవహించి వారికి సద్గతులను ప్రసాదించింది. దేవ, భూ, పాతాళ.. మూడు లోకాల్లో ప్రవహించినందున త్రిపథగ. ఇక భగీరథుడు తెచ్చినందున భాగీరథి. జహ్ను మహర్షి చెవులలోంచి రావడాన జాహ్నవి. అందరినీ పునీతం చేస్తుంది కనుక పరమపావని.. ఇలా అనేక నామాలతో ప్రఖ్యాతమైంది. ఏప్రిల్‌ 22న బృహస్పతి మేషరాశిలో ప్రవేశించటంతో గంగా పుష్కరాలు ప్రారంభమై 30న ముగుస్తాయి. గంగోత్రిలో పుట్టిన గంగ సహస్రముఖాలుగా వెళ్లి సముద్రంలో కలుస్తుంది. దేవప్రయాగ, కర్ణప్రయాగ ప్రాంతాల్లో ఎన్నో నదులను కలుపుకుంటూ ప్రయాగ నుంచి కాశీ వెళ్తుంది. ఉత్తరాన పుట్టి, తూర్పుగా ప్రవహిస్తున్న గంగ కాశీలో ఉత్తర వాహిని.. పరమ పవిత్రం. సర్వ పాపాలనూ పోగొడుతుంది. 4 వేల మైళ్లున్న గంగాతీరంలో ఎక్కడైనా పుష్కర కార్యక్రమాలు చేపట్టవచ్చు.

స్నానాలూ.. శ్రాద్ధకర్మలూ..

పుష్కరాల్లో స్నాన జపాలే కాదు పితృకార్యాలూ ఆచరించాలి. కనీసం పిండప్రదానాలు, తర్పణాలు వదలాలి. ఆ నదిలో పితృదేవతలు కూడా ఉంటారు. వారి అనుగ్రహంతోనే శ్రేయస్సు లభిస్తుందని గుర్తుంచుకోవాలి.

డాక్టర్‌ అనంతలక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని