కష్టజీవులే దేవుళ్లు

శ్రమలో కష్టం ఉంటేనేం.. ఆ స్వేద బిందువులు మేధో జల్లులు కురిపిస్తాయి. సంతోష కుసుమాల్ని, సంతృప్తి ఫలాల్నీ అందిస్తాయి. వేదాల నుంచీ పురాణేతిహాసాల వరకూ అదే చెబుతున్నాయి. సృష్టిలో శ్రమ, సాయం, కృతజ్ఞత.. ఇదే మహనీయుల ఉద్ఘాటనా సారాంశం

Published : 27 Apr 2023 00:39 IST

మే 1 కార్మిక దినోత్సవం

శ్రమలో కష్టం ఉంటేనేం.. ఆ స్వేద బిందువులు మేధో జల్లులు కురిపిస్తాయి. సంతోష కుసుమాల్ని, సంతృప్తి ఫలాల్నీ అందిస్తాయి. వేదాల నుంచీ పురాణేతిహాసాల వరకూ అదే చెబుతున్నాయి. సృష్టిలో శ్రమ, సాయం, కృతజ్ఞత.. ఇదే మహనీయుల ఉద్ఘాటనా సారాంశం

ర్మసంబంధమైంది కార్మికం, శ్రమ సంబంధమైంది శ్రామికం. ఈ రెండూ ధర్మబద్ధం, ధార్మికం అన్నారు ఆధ్యాత్మికవేత్తలు. ఈ కోణంలో చూస్తే శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది మరేదీ లేదన్న శ్రీశ్రీ నినాద ప్రతిజ్ఞ అక్షరాలా వేదవాక్కే. ‘కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ..’ అంటూ ఆ మహాకవి చేసిన స్వస్తివాక్య సంధానం, స్వర్ణవాద్య సంరావం భావివేద జీవనాదమే. ఆ జీవనాదాన్ని ఆలకిస్తే కష్టజీవులైన కర్మవీరులు దైవ స్వరూపాలుగా కనిపిస్తారు.

ఆదిత్యులంతా శ్రామికులే

ఇందులో అతిశయమే లేదు, ఇది అక్షరాలా నిజం. మనకు ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతారు. ఆయా ఆకృతులు కూడా పురాణాల్లో వర్ణితమై ఉన్నాయి. ఆ రూప విశేషాలను తెలుసుకోవటం అవసరమే. భగవంతుణ్ణి ఆరాధించేవారికి దైవ తత్వమేంటో తెలుసుకునే ఆసక్తి కూడా ఉండాలి. అప్పుడే భక్తిభావం సంపూర్ణంగా వృద్ధి చెందుతుంది.

వేదాలు, పురాణాల్లో దైవ స్వరూప వర్ణనలో అంతర్లీనంగా ఉన్నదంతా చైతన్య సందేశమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శక్తి.. ఇలా మనకెందరో దేవుళ్లున్నారు. ఎవరి అవకాశం, నమ్మకాలను బట్టి ఆయా దేవుళ్లను ఆరాధిస్తుంటారు. తమ కోరికలేవో విన్నవించు కుంటారు. నివేదనలు సమర్పిస్తారు. అసలు పూజ సమయంలో దైవ స్వరూపాన్ని గమనిస్తే శ్రమ శక్తిని గౌరవించాలన్న సందేశం అందితీరుతుంది. సోమరిగా కదలకుండా ఓ చోట కూర్చుని ఎవరినో ఏదో ఇవ్వ మని అడిగే కన్నా మన ఆరాధ్యదైవంలా కష్టపడి పనిచేద్దాం, ఫలితాన్ని పొందుదాం.. అనే స్ఫురణ కలుగుతుంది. ‘కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం/ జాలరి పగ్గం, సాలెల మగ్గం/ శరీరకష్టం స్ఫురింపజేసే/ గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి..’ ఇలా సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలూ దేవతల్లో కనిపిస్తాయి.

దేవలోకంలో పని విభజన

త్రిమూర్తుల వరుసలో ముందుగా ప్రజాపతి చతుర్ముఖుణ్ణి గమనిస్తే.. శ్రమజీవన చిహ్నాలన్నీ ఆయన దగ్గర కనిపిస్తాయి. అలుపెరగని శ్రామికుడిలా నిరంతరం సృష్టి చేస్తూనే ఉంటాడు. విశ్వకర్మ ఆది కార్మికుడని, దేవతల కోసం స్వర్గం, ద్వారక, లంక, హస్తిన, మయసభ సృష్టించాడు. అంతేకాదు.. సుదర్శన చక్రం, త్రిశూలం, ఇంద్రరథం తయారుచేసింది విశ్వకర్మేనని పురాణ కథలు చెబుతున్నాయి. అలాగే పంచబ్రహ్మ సిద్ధాంతాన్ని అనుసరించి 1.మను బ్రహ్మ వంశీయులు ఇనుప వస్తువులు తయారుచేయడాన్ని, 2.మయబ్రహ్మ వంశీయులు కొయ్య వస్తువులు చేయడాన్ని, 3.త్వష్టబ్రహ్మ వంశీయులు రాగి, కంచుతో వస్తువులు రూపొందించడాన్ని, 4.బ్రహ్మ వంశీయులు శిలా వస్తువులు, ప్రతిమలను చేసే పనిని, 5.విశ్వజ బ్రహ్మవంశీయులు సువర్ణ ఆభరణాలను రూపొందించడాన్ని వృత్తులుగా నిర్వహించినట్లు రుగ్వేదంలో ఉదాహరణలు ఉన్నాయి.

ఆయుధాలే సంకేతం

ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు చిహ్నం విష్ణువు. ధనాన్ని గౌరవిస్తూ భద్రంగా చూసుకునే ధన, సంపద సంబంధ ఉద్యోగులందరికీ లక్ష్మీపతి ఆదర్శం. అలాగే విష్ణు తత్త్వం సముద్రం, నదులు, అడవులు, వ్యవసాయ భూములు పచ్చిక బయళ్లు, ఉద్యానవనాలతో ముడిపడి ఉంటుంది. రైతులు, నేత కార్మికులు, రంగులద్దే కార్మికులు విష్ణు తత్త్వ సంబంధంగా ఉన్నారన్నది భారత భాగవతాది కథల్లో కనిపించే అంశం. కృష్ణుడు పశువుల కాపరిగా, పశుపోషణతో ముడిపడినట్లుగా దర్శనమిస్తాడు. బలరాముడి ఆయుధం నాగలి. అది వ్యవసాయ కార్మికుడి చిహ్నం. పరశురాముడి ఆయుధం గొడ్డలి. ఇదీ కష్టజీవుల ఆయుధ గుర్తే. త్రినేత్రుడి త్రిశూలమూ శ్రమజీవుల సంకేతమే.

అచ్చోసిన ఆబోతు..

మహాశివుడు నిర్జనమైన పర్వతాలు, గుహలు, శ్మశానవాటికలతో సంబంధం వున్న ఓ సర్వ సాధారణ వృత్తి నిర్వాహకుడిగా కనిపిస్తాడు. ఆయన దగ్గరుండే వృషభవాహనం లేదా ఆబోతు గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద వృద్ధి నిర్వహణ వృత్తికి నిదర్శనం. వృషోస్సర్జనం లేదా వృషోస్సర్గం అనే ప్రక్రియనే అచ్చోసిన ఆబోతును విడవటం అంటారు జనవ్యవహారంలో. ఇది మహా పుణ్య ప్రదమని నమ్ముతారు. శివుడి చెంతనుండే బసవన్న రూపానికి అంత పవిత్ర అర్థముంది.

త్రిమూర్తులయ్యాక శక్తి పూజ ప్రధానంగా కనిపిస్తుంది. శక్తి ఆరాధన, దశమహావిద్యల ఉపాసన సమయంలో ఆయా దేవతా రూపాల్లో కొడవలి లాంటి పనిముట్లు, ధాన్యపు కంకులు ఆ తల్లి చేతుల్లో కనిపించటం శ్రమశక్తికి గుర్తే. పూజ నీయ భావంతో చూడాలే కానీ ప్రతి కార్మికుడూ ఒక దేవుడిగానే కనిపిస్తాడు. ప్రతి కర్మ లేదా ప్రతి వృత్తీ దైవత్త్వంగానే దర్శనమిస్తుంది. అందుకే కార్మిక శక్తిని గౌరవించాలి. శ్రామికులను ప్రేమించాలి. ఆదరిస్తూ, అభిమానించాలి.

 డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జున రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని