అన్ని మంత్రములు ఇందె ఆవహించెను..

అన్నమయ్య పదాలు అచ్చమైన తేనెపాకం. ఆ భక్తి పారిజాత పరిమళం. ఆ కీర్తనల్లోని శక్తి మధురాభివ్యక్తి. తెలుగు తీయందనాన్ని భక్తి రసామృతంపై తెట్టెలు కట్టించిన వాగ్విలాపి అన్నమయ్య.

Published : 04 May 2023 00:12 IST

మే 6 అన్నమయ్య జయంతిమే 6 అన్నమయ్య జయంతి

న్నమయ్య పదాలు అచ్చమైన తేనెపాకం. ఆ భక్తి పారిజాత పరిమళం. ఆ కీర్తనల్లోని శక్తి మధురాభివ్యక్తి. తెలుగు తీయందనాన్ని భక్తి రసామృతంపై తెట్టెలు కట్టించిన వాగ్విలాపి అన్నమయ్య. మధురభక్తి మణితోరణంగా నిలిచిన పదకవితాపితామహుడి సంకీర్తనలెన్నో! భారతీయ ఆధ్యాత్మిక సారస్వతానికి మూలాలైన వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాల్లోని ధర్మసూత్రాలను వెలికి తీసి అలతి పదాలతో పదకవితలను ఆవిష్కరించిన అపరవ్యాసుడు అన్నమాచార్య. ఆధ్యాత్మకీర్తనలైనా, శృంగార పదాలైనా అసమాన ప్రజ్ఞతో రచించి, తదనంతర సాహితీమూర్తులను ప్రభావితం చేశాడు. బాల్యంలోనే వేంకటేశ్వరుడి దివ్యమంగళ రూపాన్ని సాక్షాత్కరింప చేసుకుని పరవశుడయ్యాడు. ఆ అనుభూతితోనే ఆళ్వారుల మార్గాన్ని అనుసరించాడు. విష్ణుమహిమలను కీర్తిస్తూ జీవితం గడిపాడు. రోజూ ఒక్క కీర్తనైనా రచించి శ్రీనివాసుడికి అర్పించేవాడు. అలా పదహారేళ్ల ప్రాయం నుంచి స్వామిని నుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించి, ఆలపించాడు. ‘దాచుకో నీ పాదాలకు తగ నే జేసిన పూజలివి..’ అన్నాడు.

 పారమార్థిక సత్యాలనూ, ప్రాపంచిక ప్రబోధాలనూ కూడా తన పదకవితల్లో ప్రతిఫలింపజేసిన అభ్యుదయవాది అన్నమయ్య. అంటరానితనం వంటి మూఢనమ్మకాలనూ, ఛాందసభావాలనూ నిరసించటమే కాదు పాటలుగా పాడి జనావళిని మేల్కొలిపిన వైతాళికుడాయన. భక్తుడు భగవంతుడికే తప్ప మరెవరికీ దాసుడు కాడంటూ మహారాజుల ఆధిపత్యాన్ని ధిక్కరించిన ధీమంతుడూ, సంక్తీరనాచార్యుడూ అన్నమయ్య. ఏడుకొండల వేంకటేశ్వరుడికి ఆత్మీయభక్తుడై, అజరామర పదామృతాన్ని కురిపించినా ఎంతో వినయాన్నీ, అణకువనూ చాటుకున్నాడు. నిరంతర దైవ చింతనలోనే నిమగ్నుడై, శ్రీనిలయుడికి కైంకర్యం చేసినందున అన్నమయ్యకు కొన్ని దివ్యశక్తులు అలవడ్డాయంటారు. అందుకే ఆయన కీర్తనల్లో ప్రతి పదం ఓ మంత్రరాజమైంది. ‘అన్ని మంత్రములు ఇందె ఆవహించెను..’ అన్నట్లు మహిమాన్విత మంత్రాలన్నీ అన్నమయ్య కీర్తనల్లో ఒదిగిపోయాయి.

 చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని