స్తుతి స్తోత్రాలతో ఆశీర్వాదం

ఎవరైనా మేలు చేస్తే కృతజ్ఞతలు చెప్పినట్లే దేవుడు చేసిన ఉపకారాలకు స్తోత్రం చెల్లించేందుకు బద్ధులమై ఉండాలి. అందుకు కొన్ని ఉదాహరణలు..

Updated : 25 May 2023 00:41 IST

ఎవరైనా మేలు చేస్తే కృతజ్ఞతలు చెప్పినట్లే దేవుడు చేసిన ఉపకారాలకు స్తోత్రం చెల్లించేందుకు బద్ధులమై ఉండాలి. అందుకు కొన్ని ఉదాహరణలు..

ఇజ్రాయిల్‌ దేశస్థులు తమ యెరికో పట్టణాన్ని ఆక్రమిస్తారేమో ననే భయంతో అక్కడివారంతా కోటలోంచి బయటకు రావడానికే వెనకాడుతున్నారు. దుర్భేద్యమైన కోట తలుపులను అన్యులు ప్రవేశించకుండా మూసేశారు. కానీ యెహోవా ఆ పట్టణాన్ని ఇజ్రాయిలువారికే ఇవ్వాలనుకున్నాడు. వాళ్లు కోటలోకి వెళ్లే మార్గం లేక బాధపడుతూ మొరపెట్టుకోగా యెహోవా కోట చుట్టూ కొమ్ముబూరలతో పెద్దగా ఊదుతూ స్తోత్రం చేయమన్నాడు. అలా పలుమార్లు స్తుతి, స్తోత్రం చేయగా (జోషువ 6:20) గోడలు కూలిపోయాయి. వాళ్లు సంతోషంగా లోనికి ప్రవేశించారు.

ఒక సందర్భంలో శత్రువులు దండెత్తిరాగా యూదు రాజు నిరాశతో యెహోవాకి తన అశక్తతను వ్యక్తపరిచాడు. అనుయాయులతో కలిసి దేవునికి స్తోత్రం చెప్పుకుని యుద్ధానికి బయల్దేరాడు. ప్రభువు అతడికి విజయాన్ని ప్రసాదించాడు.

అలాగే అపొస్తలులైన శిష్యులు సువార్త చెబుతున్న సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తున్న యూదులు కుట్రతో వారిని జైలుపాలు చేశారు. అప్పుడు పౌలు, సీలలు పాటలతో స్తుతి గానాలతో ప్రభువును ప్రార్థించగా జైలు తలుపులు బద్దలై, సంకెళ్లు ఊడిపోయాయి. కనుక మనం వేకువనే మేల్కొని మరో రోజును మనకు అనుగ్రహించిన ప్రభువును మనసా వాచా కర్మణా స్తుతిస్తోత్రాలతో ఘనపరచినప్పుడు నిస్సందేహంగా ఆశీర్వదిస్తాడు.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని