సిరి ఉండే చోటు

ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి తదుపరి తనువు చాలించేందుకు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ‘భీష్ముడు సకల ధర్మాలూ తెలిసిన లోకజ్ఞాని, మహాత్ముడు.

Updated : 25 May 2023 03:54 IST

ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి తదుపరి తనువు చాలించేందుకు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ‘భీష్ముడు సకల ధర్మాలూ తెలిసిన లోకజ్ఞాని, మహాత్ముడు. రాజ్యపాలన ఎలా చేయాలో ఆయన్ను అడిగి తెలుసుకో’ అన్నాడు. ధర్మజుడు అలాగేనని వెళ్లి ‘తాతా! శీలం అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఎందుకిస్తారు?’ అనడిగాడు. ‘ధర్మజా! దీనికి సంబంధించిన త్రేతాయుగం నాటి ఓ ఉదంతం చెబుతాను. విని అర్థంచేసుకో! ప్రహ్లాదుడు మూడు లోకాలనూ జయించి అధిపతి అయ్యాడు. రాజ్యం కోల్పోయిన ఇంద్రుడు మళ్లీ తన పదవి ఎలా సంపాదించుకోవాలో తెలుసుకునేందుకు దేవతల గురువు బృహస్పతిని ఆశ్రయించాడు. అతడు ప్రహ్లాదుడి గురువైన శుక్రాచార్యుణ్ణి అడగమన్నాడు. ఆయనేమో ప్రహ్లాదుణ్ణే అడగమన్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో వెళ్లి ప్రహ్లాదుడికి శుశ్రూష చేస్తూ మెప్పు పొందాడు. ‘మహాత్మా! ముల్లోకాలనూ జయించి పరిపాలించే శక్తి మీకెలా వచ్చింది?’ అనడిగాడు. ‘నేనెన్నడూ గర్వించను. సకల లోకాలూ సుఖంగా ఉండాలని తమ తపస్సు ధారపోసే బ్రాహ్మణులను నొప్పించను. ఆ సచ్ఛీలతే ఇందుకు కారణం’ అన్నాడు. ‘అయితే మీ శీలం నాకు ప్రసాదించండి’ అని బతిమాలాడు. తన శీలం కోరుతున్నాడంటే ఇతడెవరో గొప్పవాడై ఉంటాడనే అనుమానం వచ్చింది. అయినా అడిగినవారిని కాదనకుండా తన శీలాన్ని దానం చేశాడు. వెంటనే ప్రహ్లాదుడి దేహం నుంచి శీలం, ధర్మం, సత్యం ఇలా తేజో దైవస్వరూపాలు ఒక్కొక్కటిగా బయటకు రాసాగాయి. చివరిగా పద్మ ముఖంతో మరో రూపం బయటికొచ్చింది. అందమైన ఆ రూపాన్ని చూస్తూ ‘అమ్మా! నువ్వెవరివి?’ అనడిగాడు ప్రహ్లాదుడు. అతడికేసి జాలిగా చూస్తూ. ‘నేను సిరిని. నీ శీలాన్ని దేవేంద్రుడికి దానం చేశావు కదా! శీలం ఉన్నచోట ధర్మం, ధర్మం దగ్గర సత్యం, అది ఉన్నచోట నడవడి, దాని వెంట బలం ఉంటాయి. ఇవన్నీ కలిసి ఉన్నచో సిరిని నేనుంటాను. నీ నుంచి శీలం తొలగిపోగానే ఒకరొకరుగా అందరూ వెళ్లారు. వారితోపాటు నేనూ వెళ్లిపోతున్నాను’ అంటూ సిరి వెళ్లి పోయింది. దేవేంద్రుడికి మళ్లీ అలా రాజ్యం వచ్చింది. కనుక సంపదలు కోరేవారికి శీలం ఉండితీరాలి. ఇదే శీల విశిష్టత’ అంటూ వివరించాడు భీష్మపితామహుడు.

సాయి అనఘ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని