హజ్‌ ఇలా చేయాలి

ఓ రోజు హజ్రత్‌ జునైద్‌ బగ్దాదీ (రహ్మలై) వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతను కాబా యాత్ర (దైవగృహం) నుంచి తిరిగొచ్చాడు. కానీ అతడి మీద హజ్‌ ప్రభావం కనిపించకపోవడంతో ‘ఎక్కణ్ణుంచి వస్తున్నావు?’ అనడిగారు హజ్రత్‌.

Updated : 01 Jun 2023 00:32 IST

రోజు హజ్రత్‌ జునైద్‌ బగ్దాదీ (రహ్మలై) వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతను కాబా యాత్ర (దైవగృహం) నుంచి తిరిగొచ్చాడు. కానీ అతడి మీద హజ్‌ ప్రభావం కనిపించకపోవడంతో ‘ఎక్కణ్ణుంచి వస్తున్నావు?’ అనడిగారు హజ్రత్‌. ‘హజ్‌ చేసి వస్తున్నాను’ బదులిచ్చాడతను. ‘నిజంగానా?’ అన్నారు హజ్రత్‌. అవునన్నాడతను. ‘హజ్‌ కోసం బయల్దేరే టప్పుడు చేసిన పాపాలను మన్నించమని దేవుణ్ణి వేడుకున్నావా? మరెన్నడూ అలా చేయనని తీర్మానించుకున్నావా?’ అడిగారు హజ్రత్‌. ఆ వ్యక్తి అమాయకంగా చూస్తూ ‘దాని గురించి ఆలోచించ లేదండీ’ అన్నాడు. అప్పుడాయన ‘అయితే నువ్వు హజ్‌కు బయల్దేరనే లేదు’ అని క్షణమాగి ‘హజ్‌ ప్రయాణంలో ఎన్నో మజిలీలు దాటి ఉంటావు. మరి దైవసాన్నిధ్య మజిలీ దాటావా?’ అనడిగారు. లేదన్నాడతను. ‘అయితే నువ్వు కాబా దిశగా వెళ్లలేదు. అసలా మార్గంలో ఏ మజిలీ దాటలేదు. పోనీ, ఇహ్రామ్‌ (హజ్‌ వస్త్రం) ధరించినప్పుడు రోజువారీ దుస్తులను వదిలేశావుగా, దాంతోపాటు నీ దుర్గుణాలు, దురలవాట్లను కూడా వదిలావా?’ అన్నారు హజ్రత్‌. ‘అది నాకు తోచలేదండీ’ అన్నాడతను. ‘అయితే నువ్వు ఇహ్రామ్‌ పూననే లేదు. ఒకవేళ అరఫాత్‌ మైదానానికి వెళ్లుంటే అక్కడేమైనా జ్ఞానోదయం కలిగిందా?’ అడిగారు హజ్రత్‌. ‘మీరేమంటున్నారో అర్థం కాలేదండీ’ అన్నాడతను. ‘అక్కడ ప్రభువు కళ్లముందే ఉన్నాడని, ఆ దర్శనభాగ్యాన్ని చవిచూస్తున్నానని అనిపించిందా అనడుగుతున్నా’ అన్నారాయన. ‘ఉహూ అలాంటి ఆలోచన కలగ లేదండీ’ చెప్పాడు. ‘అయితే నువ్వు అరఫాత్‌ మైదానానికైనా వెళ్లలేదు.

ఒకవేళ ముజ్దలిఫా వెళ్లుంటే, అక్కడ నీ మనోవాంఛల్ని వదిలావా, లేదా?’ అన్నారు హజ్రత్‌. దానికతను ‘నా దృష్టి అటువైపు పోలేదండీ’ అన్నాడు. ‘నువ్వు ముజ్దలిఫా కూడా పోలేదు. పోనీ కాబా ప్రదక్షిణం చేశావా? అక్కడ దేవుడి లీలలేమైనా కనిపించాయా?’ అన్నారు హజ్రత్‌. అతడు లేదని చెప్పగా ‘నీవు తవాఫ్‌ (ప్రదక్షిణలు) కూడా చేయలేదు. పోనీ, బలి ప్రదేశానికి వెళ్లి నీ మనోవాంఛల్ని బలిచేశావా? లేక కోర్కెల గుర్రాలను గాలికొదిలేసి బలిపశువును మాత్రమే జిబహ్‌ చేసి వచ్చావా?’ అనడిగారు. ఆ వ్యక్తి బిత్తరచూపులు చూస్తూ ‘అయ్యా! నేను పశువును ఖుర్బానీ చేశాను. అంతే గానీ కోర్కెల గుర్రాల గురించి ఆలోచించ లేదు’ అన్నాడు. అప్పుడు హజ్రత్‌ జునైద్‌ (రహ్మలై) ‘అయితే నువ్వు ఖుర్బానీ కూడా ఇవ్వలేదన్నమాట. వెళ్లు నాయనా! మళ్లీ హజ్‌ చెయ్యి. హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (అలై)తో సంబంధం ఏర్పడినట్లుగా హజ్‌ చెయ్యి. ఆయన గుణగణాలను దృష్టిలో ఉంచుకుని మరీ హజ్‌ చెయ్యి. ఎంతో విశ్వసనీయత సర్వసమర్పణ భావం ఉట్టిపడేలా హజ్‌ చేసిరా. అప్పుడే ఫలితం సిద్ధిస్తుంది’ అంటూ ఉపదేశించారు.

హజ్‌ అంటే ఇలా ఉండాలి. ధార్మిక స్పృహతో, భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో హజ్‌ చేసినప్పుడే శారీరకంగా, మానసికంగా ఆ ప్రభావం ఉంటుంది. అప్పుడే జీవితంలో విప్లవం వస్తుంది. హాజీలో అలాంటి స్పృహ లేనట్లయితే ఆ హజ్‌ నిస్తేజం, నిర్వీర్యం. పరలోకంలో ఏ ప్రయోజనమూ లభించదు.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని