అలా ప్రేమిద్దాం!

కోసలరాజు ప్రసేనుడు ఒకరోజు గౌతమ బుద్ధుణ్ణి దర్శించుకునేందుకు కుటీరానికి వెళ్లాడు. మహారాజును సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు గౌతముడు. కొద్దిసేపయ్యాక ‘మహానుభావా! ఈ లౌకిక ప్రేమలన్నీ దుఃఖమయమని ప్రబోధించారని విన్నాను.

Published : 23 May 2024 00:19 IST

నేడు బుద్ధ పూర్ణిమ

ప్రేమ, దయ, కరుణ మూర్తీభవించిన మహాప్రవక్త గౌతమ బుద్ధుడు. మండుటెండల్లో కష్టపడుతున్న కర్షకులు కంట పడితే ఆ విశ్వకారుణ్యమూర్తి దిగులుతో తలవంచుకునేవాడు. ధరించేందుకు వస్త్రాలు లేక అవస్థ పడుతున్న పేదవారిని చూస్తే బాధతో నిట్టూర్చేవాడు. ఎవరైనా నిర్దాక్షిణ్యంగా పూలు కోస్తుంటే కదిలిపోయి కన్నీళ్లు కార్చేవాడు. చేతులు కాయలు కాసేలా కార్మికులు కష్టపడుతుంటే.. బాధతో కరిగి నీరయ్యేవాడు. 

కోసలరాజు ప్రసేనుడు ఒకరోజు గౌతమ బుద్ధుణ్ణి దర్శించుకునేందుకు కుటీరానికి వెళ్లాడు. మహారాజును సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు గౌతముడు. కొద్దిసేపయ్యాక ‘మహానుభావా! ఈ లౌకిక ప్రేమలన్నీ దుఃఖమయమని ప్రబోధించారని విన్నాను. అంటే మనుషుల మధ్య ప్రేమ అసాధ్యమని మీ ఉద్దేశమా?’ అనడిగాడు ప్రసేనుడు. బుద్ధుడు తన సహజ నిర్మల మందహాసంతో బదులిస్తూ- ‘రాజా! ప్రేమ ప్రాణ సమానం. అయితే అది రెండు రకాలు. వాంఛ, వివక్ష, బంధం, పక్షపాతం, ఉద్రేకం- ఈ లక్షణాలతో కూడింది మొదటిరకం. దీని పర్యవసానం దుఃఖం. రెండోది నిస్వార్థం. ఇది కరుణ, వాత్సల్యం, ఇవ్వటమే తప్ప ఆశించకపోవటం- అనే లక్షణాలతో కూడింది. ఈ రకం ప్రేమలో దుఃఖానికి తావే లేదు. తల్లిదండ్రులు, దంపతులు, కుటుంబసభ్యుల మధ్య ఉండేది మొదటి రకం ప్రేమ. సొంతవారిపై అమిత ఆపేక్ష, పరాయివారిపై వివక్ష దుఃఖహేతువులు అవుతాయి. కానీ రెండో ప్రేమలో నిరాశ, నిర్వేదాలకు అవకాశమే ఉండదు. అది జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ఆధ్యాత్మికోన్నతికి దారితీస్తుంది. అలాంటి ప్రేమ లేని జీవితం శూన్యం’ అంటూ వివరించాడు.

ఆయన అవతరణం లోకానికి ఆశాదీపం

క్రీస్తు పూర్వం 623లో ప్రస్తుత నేపాల్‌ ప్రాంతమైన లుంబినీలో జన్మించిన గౌతముడు లోకానికి ఆశాదీపమై నిలిచాడు. ముప్పై అయిదేళ్ల వయసులో బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్లాడు. భర్త వియోగంతో అతని భార్య యశోధర కూడా నారవస్త్రాలు ధరించి, ఆభరణాలు త్యజించి, ఒంటి పూట భుజిస్తూ, నేలపైనే పవళించేది. గౌతముడు తన ప్రస్థానంలో ఎండిన రొట్టెలు తిన్నాడు. అంబలి తాగాడు. రాజ్యాన్ని వదిలేసి, ప్రజల హృదయాలను ఏలాడు. బోధివృక్షం కింద తీవ్ర ధ్యానంచేసి మహాజ్ఞాని అయ్యాడు. కాశీకి కొంత సమీపంలో ఉన్న గయలో సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకొని హరిణవనానికి చేరుకున్నాడు. అక్కడ అయిదుగురు శిష్యులకు తన సందేశాన్ని వినిపించాడు. దాదాపు 80 ఏళ్లు జీవించాడు. తర్వాత మూడు వందల సంవత్సరాల పాటు శక్తిమంతమైన బుద్ధుని సందేశం సజీవంగా నిలిచి ఉంది. అశోక చక్రవర్తి అంతటివాడు గౌతమ బుద్ధుని ప్రబోధలకు ప్రభావితుడయ్యాడు. యుద్ధాల వలన జరిగే హింసకు తట్టుకోలేక, మానసిక పరివర్తన చెంది బౌద్ధం స్వీకరించాడు. 

మేలుకొలిపే పలుకులు 

‘ఎన్ని గ్రంథాలు చదివినా.. అవి జీవితానికి అన్వయించుకోకుంటే వృథాయే. విజ్ఞానాన్ని ప్రవర్తనలో ప్రతిఫలింపచేసినప్పుడే సార్థకత. ఆచరణలో పెట్టకుండా పవిత్రగ్రంథాలు వల్లెవేస్తే ప్రయోజనం లేదు. అలాంటి వారు ఇతరుల గోవులను లెక్కపెట్టే గోపబాలుర లాంటివాళ్లు. వారెన్నటికీ జీవితసత్యాన్ని తెలుసుకోలేరు’ అనేవాడు గౌతముడు. ‘అన్నిటికీ ప్రభావితం కావటం కూడా అవివేకమే. ఎవరో, ఏదో చెప్పినంతలో అంగీకరించకు. ఏది మంచో, ఏది చెడో నీ బుద్ధితో నిర్ధరించుకో. నేను చెప్పినా గుడ్డిగా అంగీకరించాల్సిన పనిలేదు’ అని ఉద్ఘాటించాడు. తానొక బోధకుడు, దేవదూత, అవతారపురుషుడు- అంటూ ఆయన ఎన్నడూ ప్రకటించుకోలేదు. ‘మీకు మీరే దీపాలు. దేవుడు, గురువు, శాస్త్రం తదితర సహాయాలేవీ లేకుండా తన ఉన్నతికి తానే పాటుపడాలి. సత్యాన్ని తనే కనుక్కోవాలి’ అంటూ వివరించేచాడు. ‘నేను చెబుతున్న ధర్మమే శ్రేష్ఠమైంది అనను. ఇతర ధర్మాల గురించి విచారించండి. ఏ ధర్మం అత్యుత్తమమైంది- అనిపిస్తే దాన్నే అనుసరించండి’ అని తనను ఆశ్రయించిన శిష్యులకు హితవు చెప్పేవాడు.


కారుణ్యానికి ప్రతీరూపం

మానవీయ లక్షణాలతో మహోన్నతమైన పారమార్థిక ప్రగతికి మార్గం చూపిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు. జీవకారుణ్యానికి, త్యాగజీవనానికి ప్రతిరూపం ఆ తథాగతుడు. జీవుల దుఃఖానికి కారణాన్ని అన్వేషిస్తూ త్యాగం, తపస్సులతో ఆ వేదనకు నివారణా మార్గాన్నీ, ఆనందం సంప్రాప్తించే విధానాన్నీ ఆవిష్కరించిన యుగపురుషుడు గౌతముడు. ‘నా యవ్వనం, రాజ్యం, భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, భోగభాగ్యాలు, సుఖసంతోషాలు, ప్రశాంతమైన పగటివేళలు, ఆహ్లాదాలు పంచే వెన్నెల రాత్రులు, సుందరమైన జీవితం.. సర్వస్వాన్నీ పక్కన పెట్టేసి.. ఒక్క నీ కోసమే బయల్దేరుతున్నాను’ అంటూ సత్యాన్ని అన్వేషిస్తూ గౌతముడు ఇల్లు వదిలాడు. శతాబ్దాలుగా ఎందరో ఆచార్యులు, ప్రవక్తలకు దీపగోపురంగా నిలిచాడు. అందుకే- ‘ప్రపంచంలో ఇంతవరకు అవతరించిన ధర్మప్రచారకుల్లో మహోన్నతుడు, మహాసాహసి గౌతమ బుద్ధుడు. ఆయనను శ్రీహరి అవతారంగా పూజిస్తున్నాం. తన బోధనలను ఆచరణలో పెట్టటం ఎలాగో చూపించటానికి ఆ శ్రీకృష్ణభగవానుడే బుద్ధుడిగా అవతరించాడు’ అన్నారు స్వామి వివేకానంద. 


మైత్రి బలమే రక్షణ

గౌతముడు పర్వత సానువుల్లో, గుహల్లో, అడవుల్లో సంచరిస్తున్నప్పుడు ఆయన హృదయమైత్రి వల్ల సింహాలు, పులులు కూడా ఆదరంగా దగ్గరకు వచ్చేవి. క్రూరమృగాలుగా భావించే జంతుజాలం మధ్య కూడా నిశ్చలంగా ఉండేవాడు. ఆయన వల్ల వాటికి, వాటి వల్ల ఆయనకు ఏ ఉద్వేగమూ, భయమూ కలిగేవి కావు. ‘మైత్రి బలమే నా రక్షణ కవచం’ అనేవాడు గౌతముడు. అన్ని జీవుల్లో తనను, తనను అన్ని జీవుల్లో చూసుకోగలిగితే ఎలాంటి భయం ఉండదని నిరూపించాడు. సమాజం పతితులని ముద్రవేసిన వారు కూడా సిద్ధార్థుడి పరమ కరుణా కిరణ ప్రసార ఫలితంగా పునీతులుగా మారిపోయేవారు. ఆయన ధన్యచరితకు, దయాస్వభావానికి ప్రభావితులైన జంధ్యాల పాపయ్యశాస్త్రి గౌతమ బుద్ధుడిపై హృద్యంగా కావ్యం రచించారు.


నిందాస్తుతులకు స్పందన ఎందుకు? 

ఒకరు నిందించినా, స్తుతించినా సమంగా స్వీకరించాలనేవాడు గౌతమ బుద్ధుడు. ‘ఎక్కువ మాట్లాడితే నిందిస్తారు. తక్కువ మాట్లాడినా నింద తప్పదు. మౌనంగా ఉన్నా తప్పుపడతారు. లోకంలో నింద పడనివారు ఎవరూ ఉండరు’ అని తేల్చిచెప్పాడు. వ్యర్థం, నిరర్థకం అయిన సంగతుల్ని పట్టుకుని వేళ్లాడకూడదు. నిరంతరం భయం వద్దు. అల్పం, స్వల్పం అయిన జీవితాన్ని అర్థవంతం చేసుకోవాలి. అశాశ్వత విషయాల నుంచి బయటపడమని జాగృతం చేస్తూ- ‘మీకు మీరే మార్గదర్శకులు కండి’ అని మేల్కొలిపిన మహాప్రవక్త. ‘మరణానంతరం స్వర్గప్రాప్తి సంగతి అలా ఉంచి.. జీవించి ఉండగానే పరిసరాలను స్వర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. నైతిక ప్రవర్తన, ధర్మాచరణ, దయ, దానగుణాలే స్వర్గంతో సమానమైన సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తాయి. చేసిన పాపపుణ్యాలే మరుజన్మను నిర్ణయిస్తాయి’ అంటూ చరమ సందేశాన్ని అందించి, మహానిర్వాణం పొందాడు గౌతమ బుద్ధుడు. 

బి.సైదులు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు