భజే బ్రహ్మతేజం!

రామనామాన్ని స్మరించినంతలో- ఆ రామునికన్నా ముందుగా ఆంజనేయుడు పలుకుతాడని నమ్ముతారు భక్తులు. ‘రామభక్త హనుమాన్‌’ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. తమను సర్వదా రక్షిస్తాడని నిండైన భక్తితో ఆరాధిస్తారు.

Updated : 01 Jun 2024 09:06 IST

జూన్‌ 1 హనుమజ్జయంతి

రామనామాన్ని స్మరించినంతలో- ఆ రామునికన్నా ముందుగా ఆంజనేయుడు పలుకుతాడని నమ్ముతారు భక్తులు. ‘రామభక్త హనుమాన్‌’ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. తమను సర్వదా రక్షిస్తాడని నిండైన భక్తితో ఆరాధిస్తారు.

క్తి నవవిధాలు. అందులో స్మరణ భక్తికి, దాస్యభక్తికి ఆంజనేయుడు ప్రబల ప్రతీక. అంజనీదేవి పుత్రుడు కనుక ఆంజనేయుడని; వాయుదేవుని అంశతో పుట్టినవాడు కనుక మారుతి, పావని అని; హనువు (దవడ) దెబ్బతిన్న కారణంగా హనుమంతుడని ఆ పవనతనయుడికి ఎన్ని పేర్లో! హనుమంతుడు జన్మతః- వానరం (కోతి). పరమశివుని మరో రూపమైన రుద్రుని అంశతో, అగ్నితేజంతో, వాయుబలంతో జన్మించినవాడు. పసివాడుగానే ఆకాశంలోకి ఒక్క ఎగురు ఎగిరి, భానుడి వద్దకు వెళ్లాడు.. ఏకంగా 14 లోకాలను తల్లడిల్ల చేయగల మహోగ్ర తేజోసంపన్నమైన సూర్యబింబాన్నే మింగబోయాడు మహాశక్తిమంతుడైన ఆంజనేయుడు. జ్ఞానం, బలం, ధైర్యం, వీరం, సాహసం, యోగం, వేగం, భక్తి, శక్తి- ఇలా అన్నిటినీ కలిగి ఉన్న పరాక్రమశాలి హనుమంతుడు. లోకైక శక్తికి ఏకైక ప్రతీక హనుమ. అందుకే దైహిక శక్తినిచ్చే వ్యాయామ శాలలకు ‘హనుమాన్‌’ అని పేరు పెట్టుకుంటారు.

భవిష్యత్తులో బ్రహ్మదేవుడు

భక్తి అంటే ఆంజనేయుడు, ఆంజనేయుడంటేనే భక్తి- అనే ఖ్యాతిని పొందాడు. హనుమంతుడు రామభక్తి పరాయణుడు. రోమ రోమంలో రామనామాన్ని లిఖించుకున్న భక్తి తత్పరుడు. రామబంటుగా పేరు పొందాడు. జన్మతః వానరం కనుక జంతుశక్తి; మానవ అవతారం దాల్చిన శ్రీరామచంద్రుణ్ణి సేవించడం వలన నరశక్తి; రుద్రాంశ, వాయు అంశలతో జన్మించినందున దైవశక్తి కలిగిన మహావీర పరాక్రమశాలి మారుతి. ఆ సమ్మిళిత రూపుడైన ఆంజనేయుడే రాబోయే కల్పంలో బ్రహ్మదేవుడు. అందుకే ‘భవిష్యత్‌ విధాతా’ అంటూ హనుమను ఆరాధిస్తున్నాం.

అందరికీ ఆరాధ్యుడే

ద్వాపర యుగంలో భీమునికి తన విశ్వరూపాన్ని చూపించి, అధిక బలసంపన్నుడయ్యేలా అనుగ్రహించాడు. అర్జునుడి ధ్వజంపై నిలిచి పాండవుల విజయానికి తోడ్పడ్డాడు. అందువల్లే అర్జునుడికి కపిధ్వజుడు అనే పేరు వచ్చింది. శివరూపం, విష్ణునామం, బ్రహ్మశక్తి, వాయుతేజం కలగలసిన శక్తిస్వరూపుడు హనుమంతుడు. హనుమ- పంచముఖుడు. ఆ ముఖాలన్నీ మహోజ్వలమైనవే. ఆంజనేయుడు, నరసింహుడు, గరుడుడు, వరాహస్వామి, హయగ్రీవుడు.. ఇవే హనుమంతుని పంచముఖాలు. ఆంజనేయుని ముఖం రుద్రాంశ. తక్కిన నాలుగూ విష్ణ్వంశలే. శైవులు, వైష్ణవులు, అద్వైతులు.. అనే భేదం లేకుండా అËందరికీ ఆరాధ్యుడయ్యాడు పవనతనయుడు.

భయాన్ని పోగొట్టే అభయాంజనేయుడు

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః
కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః

అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసమహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు (ద్రోణుడి కంటే ముందు కౌరవుల అస్త్ర గురువు), పరశురాముడు- ఈ ఏడుగురూ చిరంజీవులు. వీరిని తలచుకుంటే చాలు సర్వవ్యాధులూ నశిస్తాయి. ముఖ్యంగా నిద్రించే ముందు ఎలాంటి భయాలకూ లోనవకుండా, పీడకలలు రాకుండా ఉండటానికి ఆంజనేయుని స్మరించుకుంటాం. 

రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం
శయనేయః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి

అన్నారు. అంటే పడుకునే ముందు రాముడు, కుమారస్వామి, హనుమంతుడు, గరుడుడు, భీముడు- వీరిని ప్రతిరోజూ నిద్రించే ముందు ప్రార్థించినట్లయితే చెడు కలలు రావు- అనేది ఈ శ్లోకానికి భావం. అప్పుడిక ప్రశాంతంగా నిద్రించవచ్చు. ఏమాత్రం భయం కలిగినా, ఉలిక్కిపడినా, కలవరపాటు చెందినా - వెంటనే ఆంజనేయుని తలచుకోమని పెద్దలు చెబుతుంటారు. సర్పదోష, గ్రహదోష.. విశేషించి శనిదోష నివారణకు ఆంజనేయుని స్తుతిస్తాం. ‘సకల భూత ప్రేత పిశాచ మండలోచ్చాటనాయ’ అని తలచుకుని ధైర్యంగా ఉంటాం. అంటే ఎలాంటి భయాలనైనా హనుమ సమూలంగా పోగొడతాడన్నమాట. 

సర్వసమర్థుడు పవనతనయుడు

హనుమంతుడు సకల శాస్త్రాలూ తెలిసిన పండితోత్తముడు. సూర్యదేవుని ప్రియ శిష్యుడు. నిరంతరం సంచరిస్తూనే ఉన్న సూర్యుని వద్ద విద్యలు అభ్యసించడానికి తూర్పుకొండ మీద ఒక పాదం, పశ్చిమకొండ మీద మరో పాదం స్థిరంగా మోపి- సర్వవిద్యా కోవిదుడయ్యాడు. అంతటి శక్తియుతుడైన ఆ బ్రహ్మచారి- తన శరీరాన్ని ఆకాశమంత ఎత్తు పెంచగలడు, అతి చిన్ని రూపాన్ని దాల్చగలడు. వానర రూపంలో ఉన్నప్పటికీ.. గాలిలో ప్రయాణించగలడు, గగనంలోకి ఎగరగలడు. అంతేనా.. సముద్రాన్ని దాటాడు. లోహనిర్మిత లంకానగరాన్ని దహించాడు. సంజీవని మహాపర్వతాన్నే పెకలించి తెచ్చి, లక్ష్మణుని బతికించాడు. ఆ పర్వతాన్ని నేలమీద ఎక్కడా పెట్టకుండా మోస్తూనే నిలబడిన మహా బలశాలి. సీతాదేవి దీవెనలు అందుకుని చిరంజీవిగా నిలిచిన ధన్యుడు.

మంగళ, శనివారాలు.. 

ఆంజనేయునికి ప్రీతికరమైందని మంగళవారం నాడు ఆరాధిస్తాం. అలాగే శనివారం నాడు పూజిస్తే- శనిదేవుడు పీడించకుండా అనుగ్రహిస్తాడు. ఇది ఆంజనేయుడు మనకిచ్చిన వరం. రామభక్తుడైన హనుమంతుడు స్వయంగా రామాయణాన్ని రచించాడు. అదే హనుమద్రామాయణం. కానీ ఆ గ్రంథం మనకు అందుబాటులో లేదు.

హనుమలో ఎన్ని సద్గుణాలో!

హనుమ మాతృభక్తి పరాయణుడు. మనం ఆ సుగుణాన్ని అలవరచుకుంటే వృద్ధాశ్రమాలే ఉండవు. పావని ప్రభుభక్తిపరుడు. ప్రభువంటే రాజు, యజమాని. హనుమకి ప్రభువు సుగ్రీవుడు. సుగ్రీవాజ్ఞకు తిరుగులేదు. సీతజాడ కనిపెట్టమని ఆదేశించగా.. ఆంజనేయుడు సముద్రాన్ని దాటి, సీతమ్మ జాడ కనిపెట్టాడు. అటు రామకార్యాన్ని, ఇటు రాజాజ్ఞను నెరవేర్చాడు. ఆ కార్యదీక్షను, ధైర్యసాహసాలను అలవరచుకోవాలి. ఆంజనేయస్వామి- స్వామిభక్తి ప్రపూర్ణుడు. స్వామి అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీరాముడు. తన వినయం, విధేయత, భక్తి, సేవలతో స్వామిని అలరించాడు. ఆంజనేయుడిపట్ల అంత నమ్మకం ఉన్నందునే తన అంగుళీయకాన్ని ఇచ్చి పంపాడు రాముడు. అతడే కార్యసాధకుడన్న మహావిశ్వాసం రాముడిది. అడుగడుగునా ఎదురైన ఆటంకాలన్నిటినీ అధిగమించాడు. సీతా మహాసాధ్విని కలిసి, ఆనవాలును చూపాడు. ఆ తల్లిని ఓదార్చాడు. తిరిగి రాముని చేరుకుని, ధైర్యం చెప్పి, రావణ సంహారంలో ఎన్నో విధాల సహకరించాడు.  సీతారాములను కలిపాడు. అంతేనా! వారిని తన హృదయంలో స్థిరపరచుకున్న భక్తాగ్రేసరుడు అంజనీపుత్రుడు. పరోపకారానికి, లోకశ్రేయస్సుకి మరో రూపం ఆంజనేయుడు. లక్ష్మణుని బతికించడానికి ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు. దుష్టసంహారం చేసి, జగత్తుకు ఎనలేని మేలు చేకూర్చాడు. నిత్యం రామనామ స్మరణతో భూలోకాన్నే పునీతం చేశాడు. రామభక్త హనుమంతుని ఆరాధనతో ఇన్ని సద్గుణాలు అలవడతాయి.

రామ మందిరం లేని ఊరుండదు, హనుమ లేని రామ మందిరం ఉండదు. రాముడెక్కడ ఉంటే, ఆంజనేయుడు అక్కడే ఉంటాడు మరి. అంతేకాదు, ఆంజనేయుడికి ప్రత్యేక ఆలయాలు కూడా వేలాదిగా ఉన్నాయి. పంచముఖ ఆంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, భక్తాంజనేయుడు, అభయాంజనేయుడు, బడా హనుమాన్, వీరాంజనేయుడు, శయనాంజనేయుడు- ఇలా అనేక నామాలు, రూపాలతో మందిరాలున్నాయి. మనదేశంలోనే కాదు, జపాన్, చైనా, కంబోడియా, థాయిలాండ్, అమెరికా, ఇండోనేషియా, మలేషియా, రష్యా, శ్రీలంకల్లో హనుమంతుడికి ఆలయాలు ఉన్నాయి. అనేక చోట్ల భారీ విగ్రహాలూ ఉన్నాయి. అంతటి ఆంజనేయస్వామిని నిరంతరం స్మరిస్తూ శక్తిని, యుక్తిని, అభయాన్ని, ఆరోగ్యాన్ని, విద్యను, భక్తి తత్త్వాన్ని పొంది తరిద్దాం.

డా.పి.లలితవాణి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని