నాన్నమాట కటువు నాన్నమనసు వెన్న

సంతాన ప్రాప్తి కలిగినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. వంశాభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించినందుకు పితృదేవతలు సైతం ఆ తండ్రిని అభినందిస్తారన్నది శాస్త్ర వచనం. పురుషుడు భార్య గర్భంలో ప్రవేశించి.. మరలా బిడ్డ రూపంలో జన్మిస్తాడని వేదం చెబుతోంది.

Published : 13 Jun 2024 00:46 IST

జూన్‌ 16  పితృదినోత్సవం

సంతాన ప్రాప్తి కలిగినప్పుడు తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. వంశాభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించినందుకు పితృదేవతలు సైతం ఆ తండ్రిని అభినందిస్తారన్నది శాస్త్ర వచనం. పురుషుడు భార్య గర్భంలో ప్రవేశించి.. మరలా బిడ్డ రూపంలో జన్మిస్తాడని వేదం చెబుతోంది. బిడ్డలో తన రూపాన్ని చూసుకొని తండ్రి సంబరపడతాడు. తన సంతానం సంతోషంగా జీవించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తాడు. అందుకుగాను నిరంతరం శ్రమించే నాన్న.. మనకు జన్మతః దక్కిన పెన్నిధి.

విష్ణువు శ్రీకృష్ణుడై పుట్టినప్పుడు వసుదేవుడి రూపంలో యమునా నది దాటించి కాపాడింది ప్రాణానికంటే మిన్నగా బిడ్డను ప్రేమించే నాన్న. శ్రీమహాలక్ష్మి నాగటి చాలులో దొరికినా ఆప్యాయంగా పెంచి పెద్ద చేసి శ్రీరాముడితో పరిణయం జరిపించిన జనకుడు బాధ్యతలు గుర్తెరిగిన తండ్రి. ధర్మరాజును వివిధ సందర్భాల్లో కఠిన పరీక్షలకు గురిచేసి అతడెంత గొప్పవాడో లోకానికి తెలియజేసిన ధర్మ దేవత- నిరంతరం పిల్లల అభ్యున్నతి కోరుకునే తండ్రికి ప్రతిరూపం. మనిషికి జీవితం అన్ని దశల్లోనూ నాన్న ప్రభావం అమూల్యమైనది.

మరణించిన పుత్రుణ్ణి దక్కించుకున్నాడు

విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న బలరామ కృష్ణులు తమ గురువు సాందీపునికి గురుదక్షిణ ఇవ్వాలనుకున్నారు. అది తెలిసి సాందీపమహర్షి.. మరణించిన తన కుమారుడి ప్రాణాలను అర్థించాడు. మృత్యుపాశానికి బంధితుడై ప్రాణాలు పోగొట్టుకున్న కొడుకు తిరిగిరాడనే చిన్న సంగతి రుషిత్వాన్ని పొందిన సాందీపుడికి తెలియనిది కాదు. కానీ అపరిమితమైన పుత్రవాత్సల్యం శ్వాస ఉన్నంతవరకూ ఏ తండ్రినీ విడిచి పెట్టవు కాబట్టే శిష్యులను అలాంటి కోరిక కోరాడు. ఆ శిష్యులిద్దరూ దైవాంశ సంభూతులు అయినందున మృత్యుగతుడైన చిరంజీవిని తీసుకొచ్చి సాందీప మహర్షికి అందజేశారు. మృతుడైన సత్యవంతుడి ప్రాణాలను సావిత్రి కాపాడుకున్నట్లే, మరణించిన పుత్రుడి ప్రాణాలను దక్కించుకోగలిగాడు సాందీపుడు.

శిక్ష కాదు శిక్షణ

నాన్నంటే మందలింపులు, దండనలు ఉంటాయి. ఆ క్షణంలో అవి బాధ కలిగించినా శిక్షించేందుకు తనెంతగా మథనపడ్డాడో ఆలోచిస్తే.. ఆయనపై కోపం రాదు, ప్రేమ కలుగుతుంది. పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు, ఉన్నత వ్యక్తిత్వాల కోసం తండ్రి విధించే శిక్ష- శిక్షణే అవుతుంది. పిల్లలు పుట్టినప్పటి కంటే వాళ్లు ప్రయోజకులైనప్పుడే తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుంది- అన్నాడు సుమతీశతక కర్త. పిల్లలు చెడు మార్గంలో పయనిస్తే.. తండ్రికి అపకీర్తే తప్ప ఒరిగేదేమీ లేదు. సజ్జనులై నలుగురికి తోడ్పడితేనే ఏ తండ్రి అయినా సంతోషిస్తాడు.

ప్రతి తండ్రీ దశరథుడే

తండ్రి ప్రేమకు నిదర్శనం చూపాలంటే.. తొలుత గుర్తొచ్చేది దశరథ మహారాజు. కుమారుడి ఎడబాటు సహించలేక ప్రాణత్యాగం చేశాడంటే.. ఆయనకు బిడ్డ పట్ల ఉన్న వాత్సల్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. దశరథుడిలా ప్రాణార్పణ చేయకున్నా.. ప్రతి తండ్రీ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తాడు. వారిని తనకంటే ఉన్నత స్థానంలో చూసుకోవాలని కలలు కంటాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తాడు. స్వసుఖాలను ఎన్నింటినో త్యాగం చేస్తాడు. తాను నిచ్చెనై.. పిల్లలను మోస్తూ విజయ శిఖరాలకు చేరుస్తాడు.

ఏ రూపమైనా.. ఏ చోటుకైనా..

ఎర్రటి సూర్యబింబాన్ని ఫలంగా భావించి మింగబోయాడు ఆంజనేయుడు. అది చూసిన దేవేంద్రుడు దవడలపై వజ్రాయుధంతో దండించాడు. ఆ దెబ్బకు తాళలేక బాలాంజనేయ స్వామి స్పృహ తప్పి పడిపోయాడు. తన వర ప్రభావంతో జన్మించిన పిల్లవాడి కష్టం చూడలేకపోయాడు పవన దేవుడు. ఆగ్రహించి వాయుప్రసారాన్ని మందగింపజేశాడు. అతడి నిర్ణయంతో దేవతలందరూ దిగివచ్చి పిల్లవాడికి ప్రాణదానం చేశారు. అంతేకాదు, సామాన్యుల ఊహకు అందని కామరూప, కామగమన (కోరుకున్న రూపాన్ని దాల్చే, వెళ్లాలనుకున్న చోటుకు వెళ్లగలిగే) వరాన్ని ఇచ్చారు. ‘భవిష్య బ్రహ్మ కాగలడు’ అని దీవించి చిరంజీవిని చేశారు. బిడ్డకు కష్టం కలిగితే తండ్రి ఎంత తెగువ ప్రదర్శిస్తాడో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది.

బావిలో దూకబోయిన శ్రీనాథుడు

నిరంతరం బిడ్డల క్షేమాన్ని కోరుతుంది తండ్రి హృదయం. వారికి ఏ చిన్న కష్టం కలిగినా అది తనకే జరిగినట్లు అల్లాడిపోవడం ఆయన నైజం. ఒకరోజు దగ్గరి బంధువైన పోతనను చూసేందుకు వచ్చాడు శ్రీనాథుడు. పరస్పర యోగక్షేమాలు తెలుసుకోవటం పూర్తయ్యాక.. ఇద్దరూ సాహిత్య గోష్టిలోకి వెళ్లారు. పోతన రాసిన భాగవతం ఎంతో బాగుందంటూ ప్రశంసించాడు శ్రీనాథుడు. గజేంద్రమోక్షంలో ఏనుగు మొర విన్న విష్ణుమూర్తి.. గజేంద్రుణ్ణి రక్షించేందుకు వెళ్తూ రిక్తహస్తాలతో పరుగులెత్తడం మాత్రం వాస్తవికతకు కొంచెం దూరంగా ఉందన్నాడు. చేతిలో ఆయుధాలు లేకుండా వెళ్తే.. ఎలా కాపాడగలడన్నది శ్రీనాథుడి సందేహం. పోతన వాదించలేదు, నవ్వి ఊరుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలయ్యాక శ్రీనాథుడి కుమారుణ్ణి తీసుకుని పెరట్లోకి వెళ్లాడు పోతన. కొంత సేపయ్యాక పిల్లవాడు బావిలో పడిపోయాడంటూ బిగ్గరగా అరిచాడు. నిద్రకు ఉపక్రమిస్తున్న శ్రీనాథుడు- ఆ కేకలు విని.. ఒక్క ఉదుటన పెరట్లోకి వచ్చాడు. దుఃఖతప్త హృదయంతో శోకిస్తూ.. పుత్రుణ్ణి ఎలాగైనా కాపాడుకోవాలని బావిలో దూకబోయాడు. పోతన చెయ్యి పట్టి ఆపాడు, ఓదార్చాడు. ‘బిడ్డ బావిలో పడితే.. పరుగున వచ్చావు కానీ రక్షించేందుకు తాడు తీసుకురావా?’ అన్నాడు. విషయం అర్థం చేసుకున్నాడు శ్రీనాథుడు. పిల్లలు ఆపదలో ఉండే తండ్రి పడే తపనను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది- విస్తృత ప్రచారంలో ఉన్న ఈ కథ.

నాన్నే ఆదర్శం

బిడ్డకు తండ్రే తొలి స్నేహితుడు. చేయిపట్టి నడిపిస్తాడు. వెన్ను తట్టి ధైర్యం చెబుతాడు. కబుర్లతో నవ్వించి, కథలతో తీర్చిదిద్దుతాడు. కష్టం రాకుండా కాపలా కాస్తాడు. ఇన్ని చేసే తండ్రి పట్ల బిడ్డ ఎనలేని మమకారాన్ని పెంచుకుంటుంది. వెనుక నాన్న ఉన్నాడనే ధైర్యంతో నిబ్బరంగా ఉంటుంది. ఆ  స్థైర్యమే బిడ్డ భవిష్యత్తుకు శ్రీరామరక్ష. తాను పడిన కష్టాలేవీ పిల్లలు అనుభవించకూడదని అనుక్షణం వారిని జాగృతం చేస్తాడు. అలాంటి తండ్రినే తొలి ఆదర్శంగా తీసుకుంటారు పిల్లలు. చిన్నారికి జన్మనిచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దడం సృష్టిలో మరే ప్రాణికి దక్కని వరం. ‘పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమున్నత స్థానంలో నిలపాలి. ఆ బాధ్యత నెరవేర్చని తండ్రి వ్యర్థజీవి’ అంటారు పండితులు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు.. ఆదర్శనీయ స్థానంలో ఉన్న తండ్రి ప్రవర్తన పిల్లల మనసుపై ప్రభావం చూపిస్తుంది. కనుక దురలవాట్లు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటేనే.. తండ్రిగా మరో మెట్టు పైన ఉండటం సాధ్యమవుతుంది.

రామచంద్ర, కనగాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని