దేవదేవుని దివ్యశోభ పూరీ జగన్నాథప్రభ

సకల లోకాలనూ పాలించే జగన్నాథుడు సాకారుడై కొలువైన పుణ్యస్థలి పూరీ దివ్యక్షేత్రం. శ్రీమహావిష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా అనుగ్రహిస్తున్న అద్భుత తీర్థం పూరీ జగన్నాథ ఆలయం.

Updated : 07 Jul 2024 08:23 IST

జులై 7 పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర

సకల లోకాలనూ పాలించే జగన్నాథుడు సాకారుడై కొలువైన పుణ్యస్థలి పూరీ దివ్యక్షేత్రం. శ్రీమహావిష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రునిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనమూర్తిగా అనుగ్రహిస్తున్న అద్భుత తీర్థం పూరీ జగన్నాథ ఆలయం. ఆషాఢశుద్ధ విదియ రోజున ఆ దివ్యమూర్తులను రథంపై ఊరేగించడమే జగన్నాథయాత్ర. 

అనంత తత్త్వానికి సంకేతమైన నలుపుదనమే జగన్నాథుని వర్ణం. శుద్ధ సత్వగుణమే బలభద్రుని తెల్లని ఛాయ. సుభద్రాదేవి పసుపురంగు ఐశ్వర్యశక్తికి సంకేతం. ఈ మూర్తులను చతుర్ముఖ బ్రహ్మ నృసింహ మంత్రాలతో ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల పూరీ క్షేత్రానికి నృసింహ క్షేత్రమని కూడా పేరు. అలాగే జగన్నాథుడు సామవేద, బలభద్రుడు రుగ్వేద, సుభద్ర యజుర్వేద, సుదర్శనం అథర్వణవేద స్వరూపులు. మనం పూరీ అని పిలుచుకునే ఈ పుణ్యతీర్థాన్ని పురాణాలు ‘పురి’ అని ప్రస్తావించాయి. సాగరతీరాన వెలసిన పూరీ ఆలయం, శ్రీకృష్ణ భక్తి ఉద్యమ ప్రచారకుడైన చైతన్యమహాప్రభువుకు ఆరాధ్యనీయమైన దివ్యధామం. భక్తజయదేవుడు తన ‘గీత గోవిందం’లో స్తుతించిన పరమ పురుషుడు పూరీ జగన్నాథుడే! ఈ క్షేత్రానికి పరమశివుడే క్షేత్ర పాలకుడు. ఎనిమిది లింగమూర్తులుగా వివిధ దిశల్లో కొలువయ్యాడు. ఈ క్షేత్రాన్ని ఆధారం చేసుకొని భక్తి, ఆధ్యాత్మికత వర్థిల్లాయి. 

ముక్తిక్షేత్రం.. దివ్యప్రసాదం

ఒరిస్సాలో పూరీ తీర్థానికి పురుషోత్తమ క్షేత్రమని కూడా పేరు. పూరీ ధామాన్ని ఆధారంగా చేసుకుని శిల్ప, చిత్ర, సంగీత, నృత్య, సాహిత్య రీతులెన్నో విలసిల్లాయి. ఆదిశంకరాచార్యులు ఈ కోవెలను దర్శించి, స్వామిని తన నయనాల్లో సంచరించమని కోరుతూ.. ‘జగన్నాథ స్వామీ! నయన పథగామీ’ అని కీర్తించటమే కాదు, తన నాలుగు మఠాల్లో ఒక మఠాన్ని ఇక్కడే ప్రతిష్ఠించటం విశేషం. పురాణకాలం నాటికే ఈ పుణ్యస్థలి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ‘నీలాచలం’ పేరుతో పవిత్రమైన కొండ ఉండేదని పురాణ కథనం. ‘నీల మాధవుడు’ అంటూ విష్ణుమూర్తిని ఆరాధించేవారు అనడానికి- రుషులు, దేవతలు, భక్తపుంగవుల స్తుతులెన్నో నిదర్శనంగా ఉన్నాయి. వ్యాసమహర్షి ఈ దివ్యధామాన్ని ‘ముక్తిక్షేత్రం’ అంటూ అభివర్ణించారు. ఈ ఆలయంలో నివేదించే వంటకాల్ని సాక్షాత్తూ మహాలక్ష్మి అదృశ్యంగా పర్యవేక్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే పూరీ జగన్నాథుని ప్రసాదాన్ని ‘దివ్యప్రసాదం’ అంటారు. రామకృష్ణ పరమహంస ఆ ప్రసాదాన్ని తమ వద్ద నిల్వ ఉంచుకుని.. ‘ఇందులో ప్రతీ మెతుకూ గోవిందుడే’ అంటూ రోజూ కాస్త స్వీకరించేవారట. 

విగ్రహాల విశిష్టత

శిల, లోహ విగ్రహాలకు భిన్నంగా పూరీ దేవాలయంలో దేవతామూర్తులు కర్రతో రూపుదిద్దుకోవటం విశేషం. దారువుతో (కొయ్య) తయారైనందువల్ల ఇక్కడి మూలమూర్తిని ‘దారుబ్రహ్మం’ అంటారు. అలాగే ఒకే దారువు సుదర్శనమూర్తితో కలిపి నాలుగు విగ్రహాలుగా అయ్యిందని పురాణోక్తి. ఈ విగ్రహాల శిల్పరీతి అపురూపం. ఇక్కడి దేవతలు వదన ప్రధాన దేవతలు. అంటే భావ ప్రకటనకు స్థానమైన ముఖాలే ప్రధానంగా ఉన్న విగ్రహాలు. ఈ ప్రతిమల్లో జ్ఞానేంద్రియాలే ప్రముఖంగా కనిపించటం విశేషం. వీటిని తొలుత చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠించాడన్నది పురాణ వచనం. ఆయన విధించిన నియమాల ప్రకారం- పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ప్రతి అధిక ఆషాఢంలో పూజారులకు కలలో కనిపించే విశేష దారువులు సేకరించి కొత్త విగ్రహాలను మలుస్తారు. పాత ప్రతిమల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించటం ఆనవాయితీ. ప్రధానమూర్తి నయనాలు గుండ్రంగా, రెప్పలు లేకుండా ఉంటాయి. ‘పరమాత్ముడు రెప్ప వేయకుండా అనుక్షణం కాపాడుతాడు’ అనటానికిది సాక్ష్యం. పూరీ జగన్నాథుడికి ‘చక్ర నయనుడు’ అని కూడా పేరు. నల్లని జగన్నాథుడు, తెల్లని బలభద్రుడు, పసుపుపచ్చని సుభద్రమ్మలతో పాటు స్తంభాకృతిలో ఉన్న మరో దారువుపై చక్రాయుధ దైవమైన సుదర్శనస్వామి ఈ ఆలయంలో దర్శనమిస్తాడు.

ప్రహ్లాద్‌


అద్భుతాల ఆలయం

పూరీ పుణ్యతీర్థంలో అబ్బురమనిపించే దృశ్యాలెన్నో! ఇక్కడ మూడుమూర్తుల విగ్రహాలు దారువుతో.. అంటే కర్రతో చేసినవి. ఈ మూలమూర్తులే ఉత్సవమూర్తులు కూడా కావటం ఇక్కడి విశిష్టత. గర్భగుడిలో నిత్యం ఆరాధించే జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఏటా రథోత్సవంలో ఊరిగేస్తూ భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు బృందావనం నుంచి రాధ, గోపికలు వచ్చారు. అప్పుడు రుక్మిణీ సత్యభామాదులు శ్రీకృష్ణుడి బాల్యలీలలు చెప్పమని రాధాదేవిని అడిగారు. అప్పుడే అటుగా వస్తున్న బలరామకృష్ణులు, వారి సోదరి సుభద్ర ద్వారం వద్దనే నిలబడి రాధ మాటలు వింటూ చిత్తరువుల్లా నిలబడిపోయారు. అంతలో వచ్చిన నారద మహర్షి వారికి నమస్కరించి.. ‘ఈ దివ్యమైన ఆకృతులతో కలకాలం ఆరాధనలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నాడు. ‘అటులనే!’ అని మునీశ్వరుడికి వరమిచ్చాడు కృష్ణుడు. ఆ వరానికి అనుగుణంగా.. ఆ రూపాల్లోనే వాసుదేవుడు తన సోదరుడు, సోదరితో పూరీ క్షేత్రంలో పూజలందుకుంటున్నాడు అనేది పురాణ కథనం. 


రమణీయం.. కమనీయం..

బ్రహ్మదేవుడే జేష్ఠపూర్ణిమ నాడు జ్యేష్ఠవ్రతాన్ని ఆచరించి, ఆషాఢశుద్ధ విదియ రోజు ఆ దివ్యమూర్తులను రథంపై ఊరేగించాడంటారు. ఆ పరంపర నేటికీ కొనసాగుతోంది. ఇది తొమ్మిది రోజుల ఉత్సవం. దీనికి ‘మహావేది మహోత్సవం’ అని కూడా పేరు. పరమాత్ముడు స్వయంగా జనావళి మధ్య సంచరించే ఈ రథయాత్రను చూసేందుకు దివి నుంచి దేవతలు దిగివస్తారని భక్తుల విశ్వాసం. 

రథయాత్ర తొలి రోజు ప్రధాన ఆలయం నుంచి స్వామివార్లను ఊరేగిస్తారు. అశేష భక్తజనావళి మధ్య సాయంత్రానికి సమీపంలోని గుండిచా మందిరానికి తరలిస్తారు. తిరిగి తొమ్మిదో రోజున తమ మందిరానికి స్వామి సపరివారంగా చేరుకుంటాడు. జగన్నాథుని రథాన్ని ‘నంది ఘోష’, ‘గరుడ ధ్వజ’ అని; బలభద్రుని రథాన్ని ‘తాళధ్వజ’ అని; సుభద్ర రథాన్ని ‘దర్పదళ’, ‘పద్మధ్వజ’ అని పిలుస్తారు. ఈ శరీరం రథం; ఇంద్రియాలు గుర్రాలు; శక్తియుక్తులు పగ్గాలు- అనేది జగన్నాథ రథయాత్రలో దాగి ఉన్న ఆధ్యాత్మిక ప్రబోధం. నడిచే ఈ రథంలో ఆత్మ స్వరూపంలో కొలువై ఉన్నవాడే పరమాత్మ. ఆయనే జగన్నాథుడు. చైతన్యకారకుడై ఆయన ముందుకు నడిపిస్తున్పప్పుడే.. దేహమనే రథానికి శోభ. జగతి రథాన్ని కదిలించే జగన్నాథుని స్మరిస్తూ తరించాలన్నదే ఈ రథయాత్రను దర్శించడంలోని ఆంతర్యం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని