అమ్మా బైలెల్లినాదో...

శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పండుగ మహంకాళి మహోత్సవం. ప్రకృతిశక్తికి ప్రతిరూపంగా అమ్మవారిని పూజించే పర్వదినం ఇది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఆరాధనోత్సవం. మహిమగల మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించి.. ‘అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..’ లాంటి జానపదగీతాలతో జగన్మాతను ఊరేగించటం ఉత్సవానికే ఓ ఊపునిస్తుంది.

Updated : 07 Jul 2024 09:34 IST

జులై 7 బోనాలు ప్రారంభం 

శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పండుగ మహంకాళి మహోత్సవం. ప్రకృతిశక్తికి ప్రతిరూపంగా అమ్మవారిని పూజించే పర్వదినం ఇది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఆరాధనోత్సవం. మహిమగల మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించి.. ‘అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో..’ లాంటి జానపదగీతాలతో జగన్మాతను ఊరేగించటం ఉత్సవానికే ఓ ఊపునిస్తుంది.

తెలంగాణ భక్త ప్రజానీకం ఆరాధించే సప్త మాత్రికలు.. అంటే ఏడుగురు గ్రామదేవతలూ అక్కచెల్లెüఅని భక్తుల విశ్వాసం. ఆ దేవతా మూర్తులే పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ.  బ్రోచే అమ్మ అంటే కాపాడే అమ్మ. అదే క్రమేణా ‘పోచమ్మ’గా; ఎల్లరను కాపాడే అమ్మ ‘ఎల్లమ్మ’గా పరిణమించాయి. తక్కినవీ ఇలా వచ్చినవేనన్నది పరిశోధకుల విశ్లేషణ. సోదరుడు పోతురాజు వీరికి రక్షగా ఉంటాడు. గ్రామ దేవతల ఆరాధన, పూజా విధానాల ప్రస్తావన ‘క్రీడాభిరామం’ గ్రంథంలో ఉంది. అలాగే ‘దేవీ భాగవతం’లో అమ్మవారి అనేక రూపాల వర్ణన చూస్తాం. ఆ మూర్తుల్లోని కొన్ని స్వరూపాలే గ్రామదేవతలని పండితుల భావన. 

ఆషాఢం పంటలకు అనుకూలమైన మాసం. ఈ కాలంలో వర్షాలు కురవటానికి, పంటలు సమృద్ధిగా పండటానికి, ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ఉండటానికి దేవతా మూర్తులను పూజించటం గ్రామీణుల ఆచారం. 

ఘటం.. బోనం.. రంగం..

బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మ ప్రసాదించిన ఆహారాన్ని అమ్మకే ప్రేమగా నివేదించటం బోనాల సంప్రదాయం. తాము తినే పదార్థాలే అమ్మవారికి సమర్పించటం ఆచారంగా వస్తోంది. పిల్లలను ఆక్షేపించని కన్నతల్లిలా, మహంకాళి కూడా తమ నివేదనల్ని తృణీకరించదనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. జగన్మాత ఉత్సవంలో ఘటం, బోనం, రంగం- అంటూ మూడు అంకాలుంటాయి. అన్నింటిలో స్త్రీలదే ప్రధాన పాత్ర. శక్తి పూజకు స్త్రీమూర్తులే ప్రధానమైన భూమికను పోషించటం బోనాల ప్రత్యేకత. ‘ఘటం’ అంటే కుండ. కొత్త కుండకి కింది నుంచి సగం వరకూ సున్నం, పైభాగానికి నూనెతో రంగరించిన పసుపు రాసి, కుంకుమ అద్దుతారు. చందనం చల్లుతారు. వరి లేదా జొన్న అన్నంతో నింపిన ఘటానికి మామిడాకులు, వేపరెమ్మల దండ కడతారు. దీపం వెలిగించటానికి అనుకూలంగా కుండపైన మట్టి మూకుడు పెడతారు. అలా ఘటాలను అలంకరించి.. నలుగురితో కలిసి వెళ్లి, అమ్మ వారికి బోనాలు సమర్పిస్తారు. ఇక్కడికి ఘటం, బోనం ఏర్పాట్లు పూర్తయినట్లే! ఇక మూడో అంశం రంగం. దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తిని పోతురాజుగా ముందు నిలబెడతారు. అన్ని ఇళ్ల నుంచి బోనాన్ని సేకరించటం పోతురాజు బాధ్యత. బోనాల సమర్పణకు ముగింపుగా ఆ ఏటి భవిష్యత్తును ప్రకటించటమే ‘రంగం’. ఓ భక్తురాలే ఆ భవిష్యవాణిని వినిపిస్తుంది.

తొలిపూజ అక్కడే..

ప్రతీ సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే బోనాల వేడుకలు తొలి ఆదివారం గోల్కొండ జగదంబిక(ఎల్లమ్మ) ఆలయంలో ప్రారంభమవుతాయి. రెండో ఆదివారం ఆ పరిసర ప్రాంతాల్లో, మూడో ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, నాలుగో ఆదివారం లాల్‌దర్వాజ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. తమ ఇళ్లల్లోని స్త్రీమూర్తుల్లోనూ, ఎల్లెడలా కనిపించే మహిళల్లోనూ తనను దర్శించుకోమని జగన్మాత ఈ పండుగ రూపంలో ప్రబోధిస్తుంది. వారి ఆకలి తీర్చితే తనకు బోనం సమర్పించినంత సంతృప్తిచెందుతానని చెప్పకనే చెబుతోంది. 

చైతన్య 


ఆషాఢ జాతర..

బోనాల సంప్రదాయం భక్తిభావనను పెంచడమే కాదు, ప్రజల మధ్య సఖ్యతను, స్నేహానురాగాలను పెంపొందిస్తుంది. మన జీవనశైలిలో ఆధునిక పోకడలు వ్యాపిస్తున్న ఈ రోజుల్లో కూడా బోనాలు, బతుకమ్మ లాంటి ఉత్సవాలు సంస్కృతీ సంప్రదాయాల శోభను ఇనుమడిపజేస్తున్నాయి. ఈ పండుగను ‘ఆషాఢ జాతర’ అని కూడా పిలుస్తారు. తెలంగాణ ప్రాంతాల్లో కాకతీయులు బోనాలు నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. తానీషా కాలంలో ఆయన దగ్గర పనిచేసే అక్కన్న, మాదన్నలు గోల్కొండ కోటలో మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ముస్లిం పాలకులు కూడా భక్తి ప్రపత్తులతో బోనాల్లో పాల్గొనేవారని, అక్కడి నుంచే జాతర నగరమంతా విస్తరించిందని చెబుతారు. 


సికింద్రాబాద్‌కు తరలివచ్చిన ఉజ్జయిని మహంకాళి

బిడ్డలకు ఆపద వస్తే అమ్మ దూరభారాన్ని లెక్క చేయదు- అనటానికి ఉజ్జయిని మహంకాళి అమ్మ వారే సాక్ష్యం. సుమారు 200 ఏళ్ల క్రితం నాటి మాట.. సికింద్రాబాద్‌కు చెందిన కొందరు సైనికులు ఉద్యోగవిధుల్లో భాగంగా ఉజ్జయిని వెళ్లారు. అదే సమయంలో భాగ్యనగరంలో కలరా వ్యాధి ప్రబలి ఎందరో కన్నుమూశారు. ఇది తెలిసి ఉజ్జయినిలో ఉన్న భాగ్యనగర సైనికులు, కలరా మహమ్మారి నుంచి తమ ప్రాంతాన్ని కాపాడమని అక్కడి మహంకాళిని ప్రార్థించారు. ఆ వెంటనే హైదరాబాద్, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో కలరా తగ్గుముఖం పట్టింది. అమ్మవారు తమ మొర ఆలకించిందన్న నమ్మకంతో.. ఉజ్జయిని అమ్మవారి మూర్తిని సికింద్రాబాద్‌లో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఉజ్జయినిలోనే కాదు సికింద్రాబాద్‌లోని కోవెలలోనూ కరుణాకటాక్షాలను కురిపిస్తోంది మహంకాళీ దేవి. భక్తులు సమర్పించే బోనాలను మనసారా స్వీకరిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని