ఆధ్యాత్మిక సాధనకు సేవ

గౌతమ బుద్ధుడికి తిస్సడు అనే శిష్యుడుండేవాడు. అతడు సిద్ధార్థుడి మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించాడు.

Published : 11 Jul 2024 00:22 IST

గౌతమ బుద్ధుడికి తిస్సడు అనే శిష్యుడుండేవాడు. అతడు సిద్ధార్థుడి మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించాడు. కానీ, తిస్సడు దీర్ఘకాల వ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ వ్యాధి వల్ల శరీరమంతా పుండ్లు పడి, అవి పగిలి దేహం, వస్త్రాలు దుర్గంధపూరితమయ్యేవి. సాటి సాధకులు తిస్సడికి దూరంగా ఉండేవారు. శిష్యుడి దురవస్థను బుద్ధ భగవానుడు గమనించాడు. స్వయంగా నీళ్లు కాచి అతడికి స్నానం చేయిస్తుంటే, శిష్యులు పరుగున వచ్చారు. బుద్ధుడి సూచన మేరకు తిస్సడి ఒళ్లంతా శుభ్రం చేసి, కొత్త వస్త్రాలు ధరింపచేశారు. చివరి ఘడియల్లో మంచంపై కొన ఊపిరితో ఉన్న తిస్సడి తలను సిద్ధార్థుడు తన తొడపై ఉంచుకుని, శాంతి వచనాలు పలికాడు. శిష్యుడి మరణానంతరం దహన సంస్కారాలు పూర్తయ్యాక భిక్షువులు ‘గురువర్యా! తిస్సడు గొప్ప సాధకుడు కదా! మరి అన్ని శారీరక అవస్థలు ఎందుకు అనుభవించాడు?’ అని ప్రశ్నించారు. గౌతముడు బదులిస్తూ ‘అతడు పూర్వజన్మలో వేటగాడు. పక్షులను వలలో బంధించి హింసించేవాడు. రెక్కలు విరిచేవాడు. ఆ క్రూరత్వం వల్లనే ఈ జన్మలో ఇన్ని కష్టాలు’ అన్నాడు. కొద్ది క్షణాలాగి... ‘మీకు సేవలు చేయడానికి మీకిక్కడ తల్లిదండ్రులు లేరు కదా! మీరు ఒకరికొకరు ఉపచారాలు చేసుకోకపోతే ఎవరు చేస్తారు? సేవ కూడా ఆధ్యాత్మిక సాధనలో భాగమే! వ్యాధి పీడితులు, బాధితులకు సేవ చేయడమంటే... ఆ ఉపచారం నాకు చేస్తున్నట్లే అని గ్రహించండి’ అని ప్రబోధించాడు. 

శ్రీశారద 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని