అగ్ని ఆరాధకులు!

అగ్ని ఆరాధకులుగా జొరాస్ట్రియన్లు ప్రసిద్దులు. ‘మజ్‌ధయాస్నా’గా కూడా పిలిచే ఈ మతాన్ని క్రీ.పూ.ఆరో శతాబ్ధంలో ...

Published : 07 Jan 2021 01:19 IST

అగ్ని ఆరాధకులుగా జొరాస్ట్రియన్లు ప్రసిద్దులు. ‘మజ్‌ధయాస్నా’గా కూడా పిలిచే ఈ మతాన్ని క్రీ.పూ.ఆరో శతాబ్ధంలో జొరాస్టర్‌ అనే ప్రవక్త ప్రారంభించారు. ఇప్పటికీ ఉన్న అత్యంత ప్రాచీన మతాల్లో ఇదొకటి. ప్రస్తుతం ఇరాన్‌గా ఉన్న పర్షియాలో ప్రారంభమైన ఈ మతాన్ని అనుసరించేవారు ప్రారంభంలో బహు దేవతారాధన చేసేవాళ్లు.

ముఫ్పై ఏళ్ల వయసులో ఒక పరిశుద్ధీకరణ కార్యక్రమంలో జొరాస్టర్‌కి పరమాత్మ దర్శనమైనట్లు చెబుతారు. దేవుడు ఒక్కడే అని, ఆయన పేరు అహురా మజ్‌దా అని ఆయన ప్రకటించారు.ఆరాధనా విధానాలు వెల్లడించారు. జొరాస్ట్రియన్లకు అగ్ని ఆరాధన అత్యంత ముఖ్యం. అగ్నికి ఆలయాలు నిర్మించారు. పర్షియా పాలకులు జొరాస్ట్రియన్‌ న్యాయ సూత్రాలను అనుసరించేవారు. సత్యం, నిజాయతీలకు మార్గదర్శకం చేసే ఆషా సూత్రాలను అమలు చేసేవారు. పర్షియా రాజ్య స్థాపకుడైన సైరస్‌ జొరాస్ట్రియన్‌ మతాన్ని అనుసరించారు. తర్వాత ముస్లిం దండయాత్రల కారణంగా పర్షియాలో మూలమతం కనుమరుగైంది. చైనా సిల్క్‌రూట్‌ ద్వారా జొరాస్ట్రియన్లు ఆసియా దేశాలకు వలస వెళ్లారు. ఆ క్రమంలోనే భారతదేశంలో కూడా ఈ మతంవారు స్థిరపడ్డారు. వీరిని పార్సీలంటారు.

జొరాస్టర్‌ బోధలు
గొప్ప ఆదర్శాలను విను. నీ మార్గాన్ని నువ్వు నిర్ణయించుకో.
ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు, ఎక్కువ ధరల కోసం ధాన్యాన్ని నిల్వ చేయకు.
ఇతరులకు మేలుచేస్తే ఆనందం, ఆరోగ్యం వాటంతట అవే లభిస్తాయి.
ఒక మంచి పని వెయ్యి ప్రార్థనలకన్నా గొప్పది.
సత్యం, పవిత్ర జీవనం, దీక్షాదక్షతలే ఉత్తమ జీవితాన్ని ప్రసాదిస్తాయి.
సందేహం కలిగినప్పుడు ఆ పనిని విడిచిపెట్టు.

- కె. రాఘవేంద్రబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని