‘జ్ఞాన పట్టణానికి ద్వారం’

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) తన బంధుమిత్రులందరినీ విందుకు ఆహ్వానించారు. భోజనాల తరువాత అతిథులందరికీ ఇస్లామ్‌ సందేశం...

Published : 29 Apr 2021 00:23 IST

రంజాన్‌ సందేశం
మే 3 షహాదతె హజ్రత్‌ అలీ (రజి)

కసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) తన బంధుమిత్రులందరినీ విందుకు ఆహ్వానించారు. భోజనాల తరువాత అతిథులందరికీ ఇస్లామ్‌ సందేశం వినిపించి, ‘ధర్మ మార్గంలో మీలో ఎవరైనా నాకు తోడ్పడేవారున్నారా?’ అని అడిగారు. అంతా మౌనంగా ఉండిపోయారు. బక్కపల్చగా ఉన్న ఓ పదేళ్ల బాలుడు పైకి లేచి, ‘దైవ ప్రవక్తా! నేను మీకు తోడ్పడతాను. మీరు తలపెట్టే మంచి పనిలో మీ వెన్నంటి నడుస్తాను’ అని ధైర్యంగా చెప్పాడు. ఆ బాలుడే హజ్రత్‌ అలీ (రజి). ‘నేను జ్ఞాన పట్టణమైతే; దానికి ద్వారం అలీ (రజి). అతణ్ని ప్రేమించిన వారు నన్ను ప్రేమించినట్లే’ అని స్వయంగా ప్రవక్త (స) ప్రశంసలు అందుకున్న హజ్రత్‌ అలీ స్వయానా ప్రవక్త (స)కు అల్లుడు. బాల్యం నుంచీ ప్రవక్త (స) సాంగత్యంలో పెరిగి పెద్దయ్యారు. ప్రవక్త (స)ను విశ్వసించి అనుచరులుగా మారిన అతి పిన్న వయస్కుల్లో హజ్రత్‌ అలీ మొదటి వారిగా ప్రసిద్ధికెక్కారు.
హజ్రత్‌ అలీ (రజి) సౌశీల్యం, ధైర్యసాహసాలకు మెచ్చి ప్రవక్త (స) తన తనయనిచ్చి వివాహం జరిపించారు. అలీ (రజి) ఖురాన్‌ పాండిత్యంలో ప్రసిద్ధులు. నమాజు చేస్తున్నప్పుడు దైవారాధనలో పూర్తిగా నిమగ్నమయ్యేవారు.
ప్రవక్త (స) తదనంతరం అరబ్బు సామ్రాజ్యాన్ని పాలించిన ఖలీఫాలలో హజ్రత్‌ అలీ (రజి) నాలుగో వారు. ఈయన పరిపాలన నీతి నిజాయతీలతో సాగింది.
‘ఆత్మ సంతృప్తి గలవారే ప్రశాంత జీవితం గడప గలుగుతారు. ఖురాన్‌ గ్రంథాన్ని పఠించి, అందులోని బోధనలు ఆచరణలో పెట్టేవాడే నిజమైన ధర్మవేత్త. అత్యాశ మనిషిని నీచుడిగా చేస్తుంది. విజ్ఞతకు మించిన మహాభాగ్యం లేదు’ అని బోధించేవారు అలీ (రజి).
రంజాన్‌ మాసంలో 21వ రోజున కూఫా అనే ప్రాంతంలోని జామె మసీదులో హజ్రత్‌ అలీపై ఓ దుండగుడు చాటుగా దాడిచేశాడు. ఆయన చనిపోయే రోజు రాత్రి తన అధీనంలో ఉన్న ప్రభుత్వ ధనాగారాన్ని ఎవరిది వారికి అప్పజెప్పారు. ఆ రోజును ‘షహాదతె హజ్రత్‌ అలీ (రజి)’గా జరుపుకుంటారు. ఆయన త్యాగాలు, బోధనల్ని మననం చేసుకుంటారు.

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని