Updated : 05 Aug 2021 04:51 IST

ఆనందోబ్రహ్మ

ఆ క్షణం భృగు మహర్షికి చెప్పలేనంత ఆనందంగా ఉంది. హాయి గొలిపే ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. గంగానది గలగలలు, నీటి తరగలపై వీస్తున్న గాలులు, తూర్పు కొండల్లోంచి పైకి లేస్తున్న సూర్యుడు, పూలూ పండ్లతో కళకళలాడుతున్న పరిసరాలు ఆయన మనసును ఉల్లాసపరుస్తూ ఉత్సాహాన్ని చేకూరుస్తున్నాయి. ఆ పారవశ్య స్థితిలో భృగు మహర్షి ఆలోచనలు పరతత్త్వం వైపు మళ్లాయి. బ్రహ్మం అంటే ఏమిటి? ఒక్క ముక్కలో బ్రహ్మం గురించి ఎలా చెప్పాలి?- అని తనలో తాను తర్కించుకున్నాడు. సమాధానం దొరకలేదు. వెంటనే తండ్రిగారైన వరుణ మహర్షిని అడిగాడు.

‘ఇది ఇతర శాస్త్ర చర్చల లాంటిది కాదు. ఆత్మానుభూతికి సంబంధించిన ప్రశ్న. ఎవరో సిద్ధం చేసిన పక్వాన్నంలా కాకుండా దీని సమాధానాన్ని ఎవరికి వారే తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా గ్రహించాలి. ఇందుకు తపస్సు చేయాలి’ బదులిచ్చాడు వరుణ మహర్షి.

భృగువు తపస్సుకు వెళ్ళాడు. బ్రహ్మం గురించి తర్కించాడు. తీవ్రంగా ధ్యానించాడు. ప్రాణులకు ఆహారమే మూలం. అదే బ్రహ్మం అని లోపల నుంచి సమాధానం వచ్చింది. సంతోషంగా తండ్రి వద్దకు వెళ్లి ‘అన్నమే బ్రహ్మం’ అన్నాడు. తండ్రి నవ్వాడు. తపస్సు కొనసాగించమని సూచించాడు.

రెండోసారి దీక్షలో కూర్చున్నాడు భృగువు. ‘ఆహారం అవసరమే. కానీ, శవానికి అన్నం పెడితే లేచి కూర్చోదు కదా! కనుక ప్రాణం ఉండాలి. అందువల్ల ప్రాణమే బ్రహ్మం’ అని సమాధానం వచ్చింది. చెప్పేందుకు తండ్రి వద్దకు వెళ్ళిన భృగువుకు ఈసారి కూడా తపస్సు కొనసాగించమనే సమాధానం వచ్చింది. మూడోసారి తపస్సులో ‘బుద్ధి’ అని జవాబు వచ్చింది. తండ్రి ఇంకోసారి తపస్సు చెయ్యమన్నాడు. భృగువు నిరాశ చెందలేదు. బ్రహ్మం ఏదో నిర్దుష్టంగా తెలుసుకునే వరకు పట్టు సడలించలేదు.

నాలుగోసారి తపస్సును తీవ్రతరం చేశాడు. ఆహారం ఎందుకు తీసుకోవాలి? ప్రాణం ఎందుకు ఉండాలి? బుద్ధి వల్ల చేకూరే జ్ఞానం దేనికి?- అంటూ ఒక్కో అంశం గురించి పునరాలోచించాడు. వాటి అంతిమ ప్రయోజనం ఏమిటన్న మౌలిక చింతనలోకి వెళ్ళాడు. ఆలోచనల దారానికి కొస దొరికినట్లయింది. ఉన్నట్టుండి ‘ఆనందం.. అవును వాటి ప్రయోజనం ఆనందం. అవన్నీ ఆనందం కోసమే. అందువల్ల ఆనందమే బ్రహ్మ’ అంటూ సమాధానం వచ్చింది. పరుగున తండ్రి వద్దకు వెళ్ళాడు భృగువు. ‘నీ తపస్సు ఫలించింది’ అంటూ ప్రసన్నంగా చూశాడు వరుణ మహర్షి!

- శ్రీవత్స


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని