సిరుల తల్లికి స్వర్ణకోవెల

‘పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థానాంచైవ’ అంటాం... సుకుమారమైన పద్మంలో కొలువైన సిరుల తల్లికి కట్టిన బంగరు కోవెల శ్రీ లక్ష్మీ నారాయణీ స్వర్ణదేవాలయం. చెన్నై నగరానికి 150

Updated : 05 Aug 2021 04:48 IST

‘పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థానాంచైవ’ అంటాం... సుకుమారమైన పద్మంలో కొలువైన సిరుల తల్లికి కట్టిన బంగరు కోవెల శ్రీ లక్ష్మీ నారాయణీ స్వర్ణదేవాలయం. చెన్నై నగరానికి 150 కి.మీ.లు, తిరుపతికి 108 కి.మీ.ల దూరంలోని వేలూరులో తిరుమలైకోడి ప్రాంతానికి దగ్గర్లో వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. నక్షత్ర ఆకారంలో ఉన్న ఈ ఆలయ వాస్తుశిల్ప సౌందర్యం అపూర్వం.

పూర్వం మునులు తపస్సు చేసిన పవిత్రప్రాంగణం ఇది. మూడువైపులా నీరు ఒకవైపు మాత్రమే ద్వారం ఉంటుంది. అష్టకోణాల నక్షత్రాకారంలో 100ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. శిల్పాలు, ప్రాకారాలు అన్నీ బంగారుపూతతో ప్రకాశిస్తాయి. కృష్ణశిలామూర్తిగా మూలవిరాట్టు శోభిస్తోంటే, సప్త కలశ యుక్తంగా గోపురాలు తమిళ సంప్రదాయపు నాగరశైలితో అలరిస్తాయి. ఉపమందిర దేవతా శిల్పాలు కూడా ఇదే శిల్ప రీతిలో ఉంటాయి. 1.5 మెట్రిక్‌టన్నుల బంగారంతో గర్భగుడి నిర్మించారు. గుడిలోకి ప్రవేశించే దారికి ఇరువైపులా భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌, గురుగ్రంథ్‌ సాహిబ్‌ల నుంచి సేకరించిన శ్లోకాలను భక్తుల దృష్టినాకర్షించేలా ఏర్పాటు చేశారు. ఆలయంలో దేవి అలంకారం అపూర్వం. పూజలు అపురూపం. ముఖ్యంగా శుక్రవారాలు పండుగ వాతావరణమే. ఆగమ శాస్త్ర రీతిలో కాకుండా శ్రీవిద్య పూజావిధానంలో అమ్మవారికి అర్చనలు చేస్తారు. ప్రదక్షిణా మార్గంలో 108 ఉపమందిరాలు ఉంటాయి. వాటిని దర్శించుకుంటూ గర్భాలయం వైపుకి సాగాలి.

ఈ క్షేత్రానికి వచ్చినవారు 16వ శతాబ్దపు వేలూరుకోట, ఆ కోటలో ప్రతిష్టితుడైన జలకండేశ్వరస్వామిని దర్శించుకుంటారు. రత్నగిరిపై ఉన్న బాలమురుగన్‌ దేవాలయం, కాట్పడి సుబ్రహ్మణ్య కోవెల, శ్రీ సెల్వ వినాయగర్‌ ఆలయాలను సందర్శించుకుంటారు. తమిళనాడు ప్రభుత్వ పురావస్తుశాఖ ఆధ్వర్యంలోని సెయింట్‌ జాన్‌ చర్చి, టిప్పు మహల్‌, హైదర్‌ మహల్‌, కాండీ మహల్‌ వంటి చారిత్రక ప్రదేశాలను చూస్తారు. తిరుపతి నుంచి కాణిపాకం మీదుగా తీర్థక్షేత్రాలను దర్శించుకుంటూ ఈ వేలూరు స్వర్ణ కోవెలకు చేరుకోవచ్చు. అటు చెన్నై, ఇటు బెంగళూరుల నుంచి విమాన, రైలు, రోడ్డు మార్గాలలో కాట్పడి చేరుకుని అక్కడి నుంచి కూడా వెళ్లొచ్చు.

- ఉదయశంకర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని