మనసుకు ప్రతిబింబం...

ఇద్దరు వ్యక్తులు జెన్‌ గురువు దగ్గరికి వెళ్లారు. ఒకవ్యక్తి ‘గురువర్యా! నాది వేరే ఊరు. ఈ పట్టణానికి మారదామని అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉంటుంది?’ అని అడిగాడు. దానికి ఆ గురువు, ‘ఇప్పుడు నువ్వుంటున్న ఊరు ఎలాంటిది?’ అని ప్రశ్నించాడు.

Updated : 12 Aug 2021 03:42 IST

ఇద్దరు వ్యక్తులు జెన్‌ గురువు దగ్గరికి వెళ్లారు. ఒకవ్యక్తి ‘గురువర్యా! నాది వేరే ఊరు. ఈ పట్టణానికి మారదామని అనుకుంటున్నాను. ఇక్కడ ఎలా ఉంటుంది?’ అని అడిగాడు. దానికి ఆ గురువు, ‘ఇప్పుడు నువ్వుంటున్న ఊరు ఎలాంటిది?’ అని ప్రశ్నించాడు. ‘అబ్బో, దాని గురించి ఎందుకు అడుగుతారులెండి. చాలా దారుణమైన ఊరది. అందరూ పచ్చి స్వార్థపరులు. దుర్మార్గులు. నాకు ఆ ఊరంటేనే పరమ అసహ్యం’ అని వెగటుగా ముఖంపెట్టి చెప్పాడు ఆ వ్యక్తి. వెంటనే ఆ జెన్‌ గురువు ‘ఈ ఊరు కూడా అచ్చం అలాంటిదే. నువ్విక్కడికి రాకుండా ఉండటమే మంచిది’ అన్నాడు. తర్వాత రెండో వ్యక్తి కూడా ఆ ఊరికి తాను మారదామనుకుంటున్న విషయం చెప్పాడు. మళ్లీ ఆ గురువు ప్రస్తుతం అతనుంటున్న ఊరు ఎలాంటిదని అడిగాడు. ‘చాలా మంచి ఊరండీ. అందరూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. నాకు ఆ ఊరంటే చాలా ఇష్టం. ఇది కొంచెం పెద్ద పట్టణం కదా. ఇక్కడుంటే పిల్లలకి బాగుంటుందని మారదామనుకుంటున్నాను’ అని చెప్పాడు. అందుకు ఆ గురువు ‘ఈ ఊరు కూడా అలాంటిదే. నిరభ్యంతరంగా నువ్విక్కడికి మారొచ్చు’ అని చెప్పాడు. సమాజం మన మనసుకు ప్రతిబింబమే. అది ఎలా చూస్తే అలా కనిపిస్తుందంతే!

- శేషుకుమారి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని