అదే పరమాత్మ తత్త్వం!

ఉద్దాలక మహర్షి కొడుకు శ్వేతకేతుడు. శాస్త్రాలు చదువు కున్నందున అహంభావి కావడం చూసి ఉద్దాలకుడు బాధ పడ్డాడు. జ్ఞాన బోధ చేయాలనుకుని, ‘కుమారా! ఆత్మవిద్య నేర్చుకున్నావా? పరబ్రహ్మ గురించి నీకేం తెలుసు?’ అన్నాడు. శ్వేతకేతుడు వెనక్కి తగ్గాడు. ‘బోధించండి తండ్రీ!’ అన్నాడు. ఆ మార్పుకు తండ్రి ప్రసన్నుడై ఇలా అన్నాడు.  

Updated : 12 Aug 2021 05:41 IST

ఉద్దాలక మహర్షి కొడుకు శ్వేతకేతుడు. శాస్త్రాలు చదువు కున్నందున అహంభావి కావడం చూసి ఉద్దాలకుడు బాధ పడ్డాడు. జ్ఞాన బోధ చేయాలనుకుని, ‘కుమారా! ఆత్మవిద్య నేర్చుకున్నావా? పరబ్రహ్మ గురించి నీకేం తెలుసు?’ అన్నాడు. శ్వేతకేతుడు వెనక్కి తగ్గాడు. ‘బోధించండి తండ్రీ!’ అన్నాడు. ఆ మార్పుకు తండ్రి ప్రసన్నుడై ఇలా అన్నాడు.  
‘నాయనా! ఇంట్లో ఎన్నో పాత్రలున్నాయి. వాటి పేర్లు, రూపాలు, ప్రయోజనాలు వేరు. కానీ, వాటిని పగలగొడితే మిగిలే మట్టే మూలపదార్థం. అదే ‘సత్తు’. అంటే అదే నిజమైంది, శాశ్వతమైంది. మన సౌలభ్యం కోసం వివిధ రూపాలు సంతరించుకున్న వస్తుజాలమంతా ‘అసత్తు’. అంటే నిజం కానిది, అశాశ్వతమైంది. అలాగే నగలూ, బంగారం కూడా! ఇదే సూత్రాన్ని విశ్వానికి అన్వయించి చూడు. అనంతమైన నామ, రూప, ప్రయోజనాలతో కూడుకున్న ఈ సృష్టి మొత్తం ఒకే మూలం నుంచి రూపొందింది. సత్యమూ, శాశ్వతమూ అయిన ఆ ఒకేఒక్క మూలమే పరబ్రహ్మ! అది ‘సత్తు’ కాగా, ఈ సృష్టి ‘అసత్తు’. నువ్వు మౌలికమైన పరబ్రహ్మకు చెందినవాడివే తప్ప అశాశ్వతమైన ఈ రూపానికి పరిమితుడివి కాదని చెప్పేదే ఆత్మ విద్య. ఈ మూల తత్త్వానికి  పరిమితి  లేదు. అది పరమాణువు కన్నా చిన్నది. పరమోన్నతమైన దానికన్నా పెద్దది’ అంటూ వివరించాడు. ఒక నిమిషమాగి- పరమాణువు కన్నా చిన్నదైన మూల తత్త్వం నుంచి పరమోన్నతమైన సృష్టి ఎలా సాధమైందో బోధపరచేందుకు అతి చిన్నదైన మర్రి గింజను పగలగొట్టించి, అందులో ఏమీ లేదని చూపించి, ఆ శూన్యం నుంచి అతి పెద్దదైన మర్రిచెట్టు ఎలా పుడుతోందో చెప్పాడు. శూన్యంలో సైతం పరబ్రహ్మ తత్త్వం ఉందని నిరూపించేందుకు ఉదాహరణగా ఉప్పును నీటిలో కరిగించి, అది కనిపించకపోయినా లోపల దాగివుందని రుచి చూపించాడు. అలా పరమాత్మ తత్త్వాన్ని తేటపరచి, ‘అదే నువ్వు’ అంటూ ఉద్దాలకుడు కొడుకుకు తెలియజేశాడు. ఛాందోగ్య ఉపనిషత్తులోని ఆసక్తికర వృత్తాంతం ఇది.

- శ్రీవత్స


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని