చిన్నచేప.. పెద్దచేప

ఒక వేటగాడు చెరువులోకి గాలం విసిరాడు. ఎరను చూసి చిన్నచేప నోటకరవబోయింది. పెద్దచేప వారించింది. ‘గాలానికున్న ఎరను నీ నోట్లో వేసుకోగానే వేటగాడు నిన్ను ఒడ్డుకు లాక్కుని ముక్కలు చేస్తాడు.

Updated : 09 Sep 2021 00:36 IST

ఇస్లాం సందేశం

క వేటగాడు చెరువులోకి గాలం విసిరాడు. ఎరను చూసి చిన్నచేప నోటకరవబోయింది. పెద్దచేప వారించింది. ‘గాలానికున్న ఎరను నీ నోట్లో వేసుకోగానే వేటగాడు నిన్ను ఒడ్డుకు లాక్కుని ముక్కలు చేస్తాడు. నూనెలో వేయించి ఆరగిస్తాడు’ అంది. కానీ చిన్నచేపకు ఆ మాటలు జీర్ణం కాలేదు. చెరువంతా కలియతిరిగింది. ముసలిచేప చెప్పేవన్నీ పాతకాలపు మాటలని కొట్టిపారేసింది. ఈ కాలంలోనూ ఇలా చెబుతుందేమిటని నవ్వుకుంది. తన ప్రాణానికి ఎలాంటి ముప్పూ లేదని గాలానికి వేలాడుతున్న ఎరను నోట కరుచుకుంది. మరుక్షణం దానికున్న ముల్లు గొంతులో గుచ్చుకుంది. అప్పుడు పెద్దచేప మాటలు గుర్తొచ్చి బాధపడింది.

మనం కూడా ప్రాపంచిక తళుకు బెళుకుల మాయలో పడి చిన్నచేపలా మోసపోతుంటాం. ఈ జీవితం తాత్కాలికం, పరలోక జీవితం శాశ్వతం అన్న ప్రవక్తల ప్రబోధలను, ఖురాన్‌ హెచ్చరికలను పెడచెవిన పెడితే మృత్యువు ముల్లు గుచ్చుకున్నాక బాధపడీ ప్రయోజనం లేదు. మహనీయుల మాటలను అనుసరించేవారు వివేకవంతులు. కాదని తమ మనోవాంఛలకు అనుగుణంగా నడుచుకునేవారు ఆనక దుఃఖిస్తారు. గాలానికి చిక్కిన చేప తిరిగి చెరువులోకి రానట్లే మృత్యువు కబళించాక మళ్లీ జీవించలేం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ప్రాణం ఉన్నప్పుడే అల్లాహ్‌ మెప్పు పొందేందుకు కృషి చేయాలి. ‘మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజానికి పరలోక జీవితమే మేలైనది, శాశ్వతమైందీ’ (ఖురాన్‌ 87-16,17) అన్న వాక్యాన్ని ఆచరించేవారే ధన్యులు.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని