చిన్న భార్యే ఇష్టమా?!

ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు పెద్దలు. స్థూల విషయాల్లోనే కాదు, సూక్ష్మ విషయాల్లోనూ ధర్మబద్ధత ఉంటుంది.

Updated : 23 Sep 2021 06:05 IST

ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు పెద్దలు. స్థూల విషయాల్లోనే కాదు, సూక్ష్మ విషయాల్లోనూ ధర్మబద్ధత ఉంటుంది. ధర్మాన్ని అతిక్రమించినప్పుడు ఆయా తప్పులను బట్టి శిక్షలుంటాయని చెప్పే మార్కండేయ పురాణంలోని ఒక చిన్న ఉదాహరణ ఇది...

విదేహ దేశరాజు జనకుడు ధర్మాచరణ పరాయణుడు. రాజర్షి. తత్వవేత్త. కానీ ఎంతటి మహనీయులైనా పుట్టినవారు చనిపోక తప్పదు కదా! పుణ్యమూర్తి జనకుడు మరణించగానే యమదూతలు తీసికెళ్లారు. ఎనిమిది రకాల నరకాల్లో ఒకటైన ‘అమిత కర్దమ’ నరకంలో శిక్షలు అనుభవిస్తున్నారు. అంటే పాపం చేసి వచ్చిన వాళ్లని యమ కింకరులు బురద కొలనులోకి తోస్తున్నారు.

అదంతా చూసిన జనకుడు చాలా ఆశ్చర్యపోయి ‘నేనన్నీ పుణ్య కార్యాలే చేశానుగా! నన్నెందుకు ఈ నరకానికి తీసుకొచ్చారు? నేనేం పాపం చేశాను?’ అనడిగాడు.

ఒక యమదూత కల్పించుకుని ‘మహారాజా! నువ్వు ఏ పాపమూ చేయలేదు. స్వర్గానికే వెళ్తావు. కానీ తెలిసో తెలీకో నీ వల్ల జరిగిన దోషం వల్ల నువ్వు ఈ దారి గుండా స్వర్గానికి వెళ్లాల్సి వచ్చింది’ అన్నాడు.

‘నేను తప్పు చేశానా? ఏమిటది?’ అన్నాడు జనకుడు.

‘రాజా! నీకు ఇద్దరు భార్యలున్నారు. ఇద్దర్నీ సమానంగానే చూశావు. కానీ ఒక్కసారి మాత్రం చిన్న భార్య పట్ల కొంచెం ఎక్కువ మొగ్గు చూపావు. ఈ చిన్న దోషానికిగానూ నిన్ను ఇటుగా తీసుకొచ్చి నరకాన్ని చూపి, ఆనక స్వర్గానికి పంపిస్తున్నాం. చేసిన తప్పు చిన్నది కనుక శిక్ష కూడా చిన్నదే. నది ఒడ్డునున్న ఇసుక రేణువులను, ఆకాశంలో తారలను లెక్కబెట్టడం ఎంత కష్టమో నువ్వు చేసిన సాయాలను, మంచి పనులనూ కూడా లెక్కకట్టలేం’ అన్నాడు.

ఇంతలో స్వర్గం నుంచి జనకుడి కోసం విమానం వచ్చింది. ఆయన ధర్మాన్ని రక్షించాడు కనుక ధర్మం ఆయన్ను రక్షించింది. ‘ధర్మో రక్షతి రక్షితః’ అని అందుకే అంటారు.

- నిమ్మగడ్డ పద్మకుమారి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని