దుష్టులను ఎందుకు సహించాలి?!

క్రీస్తు స్వర్గలోక ప్రాప్తి గురించి చెబుతూ దానికోసం ఆటుపోట్లను సంయమనంతో ఎదుర్కోవాలని, సైతాన్‌ నిత్యం అడ్డుతగులుతుంది, మానవులను మంచేదో చెడేదో గుర్తించలేని

Updated : 23 Sep 2021 06:05 IST

క్రీస్తు స్వర్గలోక ప్రాప్తి గురించి చెబుతూ దానికోసం ఆటుపోట్లను సంయమనంతో ఎదుర్కోవాలని, సైతాన్‌ నిత్యం అడ్డుతగులుతుంది, మానవులను మంచేదో చెడేదో గుర్తించలేని స్థితికి లాక్కెళ్లి పోతుందంటూ ఓ కథ చెప్పారు. ఒక రైతు, కూలీలతో కలిసి నాణ్యమైన గోధుమ విత్తనాలు జల్లడం చూసి అతని శత్రువు రాత్రివేళ దొంగచాటుగా పిచ్చిగోధుమ విత్తనాలు జల్లాడు. మంచి, పిచ్చి గోధుమ మొక్కలన్నీ తొలి దశలో ఒకేలా ఉండటంతో, తేడా తెెలియలేదు. గింజపట్టే సమయంలో, పిచ్చి మొక్కలను గుర్తించిన కూలీలు యజమాని వద్దకెళ్లి ‘నాణ్యమైన గోధుమలే జల్లాం కదా, ఈ పిచ్చి గోధుమ పంట ఎలా ఎదిగింది?’ అన్నారు. రైతుకు విషయం అర్థమైంది. పనివాళ్లు పిచ్చి గోధుమ పైరును పెరికి వేస్తామంటే రైతు వారించి, ‘తొందరపడొద్దు! ఇప్పుడు గనుక వాటిని పెళ్లగిస్తే వాటితోబాటు మంచి గోధుమ పైరు కూడా పాడవుతుంది. కోత కాలం వరకూ రెంటినీ ఎదగనిచ్చి, అప్పుడు పిచ్చి గోధుమపైరును ముందుగా పెరికి, పొలంలో ఓ పక్కన పడేసి, కాల్చండి, మంచి గోధుమలను గోదాములకు చేర్చండి’ అన్నాడు.

క్రీస్తు ఈ కథను చెప్పడంలో ఉద్దేశం ఒకటే... లోకంలో మంచి, చెడు పక్కపక్కనే ఉంటాయి. దుష్టులు మంచివారిగా నటిస్తూ, మోసం చేస్తారు. అలాంటివారిని వెంటనే నాశనం చేసే శక్తి భగవంతునికి ఉన్నప్పటికీ, దానివల్ల మంచివారికీ కీడు జరుగుతుందని సహనం వహిస్తున్నాడు. ‘కోత కాలం అంటే ఈ లోకం అంతమయ్యే సమయం లేదా ఆ వ్యక్తుల మరణానంతరం’ అని క్రీస్తు చెప్పారు. రైతు మంచి గోధుమలను భద్రం చేసుకున్నట్లుగా, విలువలతో జీవించిన వారిని భగవంతుడు తన సన్నిధికి చేర్చుకుంటాడు.

- కొలికపూడి రూఫస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని