ఊగిసలాట వద్దు

బుద్ధుడు జేతవనంలో ధర్మ ప్రసంగాలు చేస్తున్న రోజుల్లో అనాథపిణ్డకుడు అనే వ్యక్తి అన్యమతానికి చెందిన కొందరితో బుద్ధుని గొప్పతనం గురించి చెప్పి ‘ఆయన్ని చూసేందుకు వెళ్తున్నాను

Updated : 30 Sep 2021 05:35 IST

బుద్ధుడు జేతవనంలో ధర్మ ప్రసంగాలు చేస్తున్న రోజుల్లో అనాథపిణ్డకుడు అనే వ్యక్తి అన్యమతానికి చెందిన కొందరితో బుద్ధుని గొప్పతనం గురించి చెప్పి ‘ఆయన్ని చూసేందుకు వెళ్తున్నాను మీరు కూడా రండి’ అని ఆహ్వానించాడు. వారు బుద్ధుని ధర్మ ప్రవచనాలు విని ముగ్ధులై బౌద్ధాన్ని స్వీకరించారు. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడు ధర్మప్రచారం కోసం కోశాంబి నగరానికి వెళ్లాడు. ఆయన వెళ్లగానే అన్యమతీయులు తిరిగి తమ మతంలోకి మారిపోయారు. తిరిగి వచ్చిన బుద్ధునితో అనాథపిణ్డకుడు జరిగింది చెప్పాడు. బుద్ధుడు వారిని పిలిచి ఈ ఆరోపణ నిజమేనా అనడిగాడు. వాళ్లు నిజమే అన్నారు. అప్పుడు ఆయన, స్వధర్మం విడిచి అన్య ధర్మంలోకి వెళ్లకూడదు. అలా వెళ్లినప్పుడు పర ధర్మాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంట్లో తండ్రి ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ప్రవర్తించకూడదు. చంచలత్వం, ఊగిసలాటతో చేసే పనులు సత్ఫలితాలను ఇవ్వవు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఉదాహరణకి మీరు ఒకరి దగ్గర ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. కానీ పక్క వీధిలో ఉండే ధనికుడు ఇక్కడి కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్నంతలో ఊగిసలాట వద్దు. అతడు వెంటనే మనిషి కావల్సివచ్చి అప్పటికి ఎక్కువ ఇచ్చినా తర్వాత పనిలోంచి తీసేయొచ్చు. అలా జరిగితే పాత యజమాని దగ్గర సంపాదించిన నమ్మకం, అనుభవం బూడిదలో పోసిన పన్నీరవుతాయి. అంతే కాదు... మీరు ఒకచోట కుదురుగా పని చేయరనే అపవాదూ వస్తుంది. చేసే పనిలో కానీ, పాటించే ధర్మంలో కానీ చపలత్వం ఉంటే రెంటికి చెడ్డ రేవడి అవుతాం’ అంటూ బోధించాడు.

- చల్లా జయదేవ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని