కష్టం వెనుక సుఖం

దారపువుండలు అమ్మి జీవనం సాగిస్తోందో వితంతు మహిళ. ఓరోజు దూదితో పేనిన దారాన్ని ఎండకు ఆరబెట్టగా ఓ కాకి దాన్ని తన్నుకుపోయింది.

Updated : 30 Sep 2021 05:52 IST

దారపువుండలు అమ్మి జీవనం సాగిస్తోందో వితంతు మహిళ. ఓరోజు దూదితో పేనిన దారాన్ని ఎండకు ఆరబెట్టగా ఓ కాకి దాన్ని తన్నుకుపోయింది. దాంతో ఆరోజు తిండికి లేక నిరాశకు లోనైంది. ‘కరుణామయుడైన అల్లాహ్‌కు నా మీద కాస్తయినా దయలేదని నిందించింది. తెల్లారాక దుఃఖిస్తూ జునైద్‌ బుగ్దాదీ (రహ్మాలై) అనే ధార్మిక పండితుడి దగ్గరకు పరుగుతీసింది.

ఆ సమయానికి ఆయన దర్బారులో అతిథులతో మాట్లాడుతున్నారు. వాళ్లు ‘హుజూర్‌! మీకోసం పదివేల బంగారు నాణేలు తెచ్చాం, కాదనకండి! వీటిని మీ ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు’ అని సంచిని వినయంగా అందించారు. ఆయన దాన్ని వెంటనే వితంతు మహిళకు ఇచ్చేశారు. ఆమె సంతోషం పట్టలేకపోయింది. తాను చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది. అంతలోనే జునైద్‌ బుగ్దాదీ అతిథులను చూస్తూ ‘ఈ కానుకలు ఎందుకిచ్చారు?’ అనడిగారు. ‘మేం సముద్రంలో ప్రయాణిస్తుండగా మా పడవకు రంధ్రం పడి నీళ్లు లోనికి రాసాగాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాం. ఇంతలో ఓ కాకి పైనుంచి దారాన్ని పడేసింది. దానితో రంధ్రానికి మరమ్మతు చేసి ఊపిరి పీల్చుకున్నాం. మేమంతా క్షేమంగా చేరామన్న సంతోషంతో ఇచ్చాం’ అన్నారు. జునైద్‌ బుగ్దాదీ ఆ మహిళ వైపు తిరిగి ‘నీ ఫిర్యాదుకు సమాధానం దొరికిందా?’ అన్నారు. చిన్న కష్టనష్టాలెదురైనా తల్లడిల్లిపోతూ దేవుడ్ని నిందిస్తామే గానీ వాటి వెనుకున్న మర్మాన్ని తెలుసుకోం. కరుణామయుడైన అల్లాహ్‌ని నమ్మి ఓర్పుతో ముందుకెళ్లాలి. ఒక్కోసారి పరీక్ష కఠినంగా ఉండొచ్చు. దానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. అల్లాహ్‌ ప్రతీ నిర్ణయమూ మేలు చేసేదే. 

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని